కరోనాతో జీవితాలు కకావికలం

ABN , First Publish Date - 2020-04-03T10:11:09+05:30 IST

కరోనా మహమ్మారి పుణ్యమా అని వలస కార్మికులు విలవిల్లాడుతున్నారు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక అన్నమో రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. రాష్ర్టా

కరోనాతో జీవితాలు కకావికలం

  • చేసేందుకు పనిలేదు, తినేందుకు తిండిలేదు
  • ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన కుటుంబాలు
  • ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన కుటుంబాలు
  • తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కరువు
  • కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మత్స్యకారుల జీవితాలూ దుర్బరం

కరోనా మహమ్మారి పుణ్యమా అని వలస కార్మికులు విలవిల్లాడుతున్నారు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక అన్నమో రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. రాష్ర్టాలు దాటి, ఇక్కడ పనులు చేసేందుకు వచ్చిన కూలీలకు ఏరోజు పనిచేస్తే, ఆరోజే మూడు పూటలా తిండి దొరుకుతుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత 10 పదిరోజులుగా పనుల్లేక పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ వలస కార్మికులు పిల్లాపాపలతో కలిసి ఉంటున్నారు. అయితే సొంత ఊళ్లకు వెళ్దామంటే రవాణా సౌకర్యం లేకపోవడం, లాక్‌డౌన్‌ ఉండడంతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.  


యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 2: కరోనా వైరస్‌ మూలాన వలస కూలీల బతుకులు విలవిలలాడుతున్నాయి. కరోనావ్యాధి ప్రబలకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ నియంత్రణ(జనతా కర్వ్ఫూ), లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించాయి. పొట్ట కూటికోసం పలు ప్రాంతాలనుంచి యాదాద్రి ఆలయ విస్తరణ పనులు నిర్వహించేందుకు వచ్చిన వలస కార్మికులు లాక్‌డౌన్‌ ఆంక్షలతో పలు ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆలయ అభివృద్ధి పనుల్లో వేగంతగ్గింది. దీంతో కార్మికులకు తమతమ ఇళ్లకే పరిమితం కావాల్సి దుస్థితి నెలకొంది. కాగా అత్యవసర పనులను కార్మికులు కనీసదూరం ఆంక్షలను పాటిస్తూ కార్మికులకు నిర్వహిస్తున్నారు. అయితే కొందరు కార్మికులకు పనులు దొరక్క నానాతంటాలుపడుతున్నారు.


యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్ద గుట్ట ప్రెసిడెన్షియల్‌ సూట్‌, స్వయంభువులు కొలువైన కొండ ప్రాంతాల్లో గేబియన్‌వాల్‌ను నిర్మాణ పనులు ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈగేబియన్‌ వాల్‌ పనులను మధ్య ప్రదేశ్‌ మహారాష్ట్రనుంచి వచ్చిన సుమారు వందకు పైగా కార్మికులు నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా జరుగుతున్న ఈగేబియన్‌ పనులను నిర్వహించేందుకు పిల్లాపాపలతో యాదగిరిగుట్టకు వచ్చి బస ఏర్పాటు చేసుకొని పనులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో గేబియన్‌ వాల్‌ పనులు నిర్వహించే కార్మికుల పనులు నిలిచాయి. ఈవలస కార్మికులకు మరెక్కడా పనులు దొరక్క పిల్లాపాపలతో అర్థాకలితో అలమటిస్తున్నారు. చేయడానికి పనిదొరక్క, నిత్యావసర సరుకులు కొనడానికి డబ్బులులేక నిస్సహాయ స్థితిలో ఇబ్బందులతోనే జీవనం సాగిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొనగా, పొట్ట కూటికోసం వచ్చిన చోట పనులు దొరక్క వలస కార్మికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వలసకార్మికులైన తమను ఆదుకోవాలని తమకు సాయాన్ని అందించాలని వలస కార్మికులు కోరుతున్నారు. 


దేవరకొండ, ఏప్రిల్‌ 2:  కరోనా వ్యాధి విజృంభించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో చందంపేట మండలం కృష్ణాపరివాహాక ప్రాంతంలో చేపలవేటతో జీవనం కొనసాగిస్తున్న విశాఖపట్టణం, ఒడిశా ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు, వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం ఒడిశా కార్మికులను ఆదుకుంటామని ప్రకటించడంతో వారికి కొంత ఊరట లభించినట్లయింది. ప్రభుత్వం అందించే బియ్యంతోపాటు పరిహారంకోసం 120మంది వలస కూలీలు ఎదురుచూస్తున్నారు. వలస కూలీలు కృష్ణాపరివాహక ప్రాంతమైన కంబాలపల్లి, ఏలేశ్వరం, కృష్ణాతీరాన గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. కరోనా వ్యాధి సోకడంతోపాటు కృష్ణానదిలో చేపలవేటలేక పూటగడవడమే  భారమైందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కంబాలపల్లి పరిధిలోని కృష్ణాపరివాహకప్రాంతంలో చేపలవేట కొనసాగిస్తున్న వలసకూలీలు 120మందికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని కంబాలపల్లి గ్రామ సర్పంచ్‌ ముత్యాల రాములమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


పనులు దొరకడం లేదు 

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాడ్వా గ్రామంనుంచి యాదాద్రి అభివృద్ధి పనులు చేసేందుకు కుటుంబ సమేతంగా వచ్చాం. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించినప్పటి నుంచి మరెక్కడా పని దొరకడంలేదు. దీంతో వారం రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నాం.  

- రాజు, వలసకార్మికుడు, మధ్యప్రదేశ్‌


నిస్సహాయస్థితిలో ఉన్నాం 

గత మూడేళ్లుగా యాదాద్రి క్షేత్రంలో పలుచోట్ల గేబియన్‌ వాల్‌ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నాం. మల్లాపూర్‌ రహదారివెంట తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకొని కుటుంబసమేతంగా జీవనం సాగిస్తున్నాం. వేరే పనులు దొరక్క అవస్థలు పడుతున్నాం.

- ముఖేష్‌ , వలస కార్మికుడు, మహారాష్ట్ర

Updated Date - 2020-04-03T10:11:09+05:30 IST