చవితి కష్టాలు..!

ABN , First Publish Date - 2020-08-10T08:20:10+05:30 IST

కరోనా మహమ్మారి వినాయక విగ్రహాల తయారీదారుల నోట్లో మట్టికొట్టింది. వైరస్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ నిబంధనలతో ఈ ఏడాది వినాయక చవితిని ఘనంగా నిర్వహించలేని పరిస్థితులేర్పడ్డాయి.

చవితి కష్టాలు..!

  • వినాయకుడి ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్‌.. 
  • లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఇళ్లకే పరిమితం కానున్న పండుగ
  • విగ్రహాల తయారీకి రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన     తయారీదారులు
  • పెద్ద విగ్రహాలను అడిగే వారే లేరని ఆందోళన
  • పెట్టుబడి కూడా దక్కదని ఆవేదన
  • కుటుంబ పోషణపై అయోమయం చిన్న విగ్రహాలతో పొట్టనింపుకునే యత్నం


 అనంతపురం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) :  కరోనా మహమ్మారి వినాయక విగ్రహాల తయారీదారుల నోట్లో మట్టికొట్టింది. వైరస్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ నిబంధనలతో ఈ ఏడాది వినాయక చవితిని ఘనంగా నిర్వహించలేని పరిస్థితులేర్పడ్డాయి. ప్రతి ఏటా గణేశుడి పండుగ వస్తోందంటే చాలు చిన్న, పెద్ద, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా మండపాలు ఏర్పాటు చేసుకుని పోటా పోటీగా విగ్రహాలను ప్రతిష్ఠించేవారు.


ఇళ్లలో చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నా, వీధుల్లోనూ, అపార్ట్‌మెంట్‌ల వద్ద స్తోమతను బట్టి భారీ విగ్రహాలు నిలిపేవారు. ఈ క్రమంలో విగ్రహాల తయారీదారులు కూడా  పండుగకు చాలా ముందు రోజుల నుంచే వివిధ ఆకృతుల్లో, ఆకర్షణీయంగా బొజ్జ గణపయ్యలను తయారు చేసేవారు. గిట్టుబాటు బాగుండటంతో పెట్టుబడులు భారీగానే పెట్టేవారు. అయితే ఈ ఏడాది మార్చిలో జిల్లాలో ప్రారంభమైన కరోనా అప్పటి నుంచి అన్ని పండుగలను ఇళ్లకే పరిమితం చేసింది. ఎవరికి వారు ఇంటికి పరిమితమై పూజలు, పునస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఇందులో భాగంగా ఈ నెల 22న రానున్న వినాయక చవితి పండుగను కూడా ఎవరికి వారు ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ ఇంత సుదీర్ఘకాలం పాటు ఉంటుందని ఊహించని గణేష్‌ విగ్రహాల తయారీదారులు బొమ్మల తయారీకి అవసరమైన సరంజామాను రూ.లక్షలు వెచ్చించి తెచ్చిపెట్టుకున్నారు. కొందరు విగ్రహాలు కూడా తయారు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విగ్రహాలు అమ్ముడుపోని పరిస్థితి నెలకొనడంతో విగ్రహాల తయారీదారుల పరిస్థితి అతలాకుతలమైంది. జీవనం దుర్భరమైంది. కొంత మంది తయారీదారులు తయారు చేసే విగ్రహాలను టెంట్లలోనే వదిలేసి సొంతూర్లకు వెళ్లిపోవడం గమనార్హం.


పెట్టుబడి రాదు... అప్పులు తీరవు! 

కొందరు విగ్రహాల తయారీదారులు గతేడాది జరిగిన వ్యాపారాన్ని బట్టి మరో పది శాతం పెంచి ముడిసరుకు కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. విగ్రహం తయారీ కోసం అవసరమైన ప్లాస్టరాఫ్‌ ప్యారీస్‌, రంగులు, చెక్కలు, కర్రలు, ఇనుప చువ్వలు తదితర సామగ్రిని ముందస్తుగానే సిద్ధం చేసుకున్నారు. మార్చి మొదటివారం నుంచే విగ్రహాలను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు.


జూన్‌ ఆఖరు వరకూ విగ్రహాలు తయారు చేయడంలోనే నిమగ్నమయ్యారు. ఈ లెక్కన ఒక్కో నిర్వాహకుడు రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. విగ్రహాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ రోజుల్లో అయితే జూలై మొదటి వారం నుంచే భారీ విగ్రహాలు కావాల్సినవారు తయారీదారులను సంప్రదించేవారు.  అడ్వాన్సు ఇచ్చివెళ్లేవారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో విగ్రహాలు పెట్టేందుకు అనుమతుల్లేవని, ఎవరికి వారు ఇళ్లలోనే జరుపుకోవాలనే నిబంధనలు విధిస్తుండంతో తయారీదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


విగ్రహాల తయారీకి అవసరమైన సామగ్రి కోసం చేసిన అప్పులే వారికి మిగిలాయి. విగ్రహాలు కొనే నాథుడు లేకపోవడంతో జీవనం కష్టంగా మారింది. పస్తులు ఉండలేక చిన్న విగ్రహాలు తయారుచేసి వాటి ద్వారా ఆకలి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

ఉపాధి కోల్పోయిన వందలాది కుటుంబాలు

జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా విగ్రహాల తయారీదారులున్నారు. వీరి పరిధిలో దాదాపు 10 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వినాయక చవితి ముందు రోజులనుంచే మరో వెయ్యి మందిదాకా తోపుడు బండ్లపై చిన్న విగ్రహాలను విక్రయించి ఉపాధి పొందేవారు. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, ధర్మవరం, మడకశిర, కళ్యాణదుర్గం, గుంతకల్లు, కదిరి తదితర ప్రాంతాలు విగ్రహాల తయారీకీ పెట్టిందిపేరు.


ప్రధానంగా గుంతకల్లులో తయారుచేసిన విగ్రహాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. ఒక్కో విగ్రహాల తయారీదారుడు సగటున రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. అంటే ఈలెక్కన విగ్రహాల తయారీకి రూ.15 కోట్ల దాకా నష్టం చవిచూడాల్సివచ్చింది. రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకూ కూలి పొందుతున్న వేలాదిమంది ఉపాధి కోల్పోయారు. 


రూ.10 లక్షలు నష్టం : రాజేంద్ర, సిండికేట్‌ నగర్‌(తయారీదారుడు).

సాధారణ రోజుల్లో పండుగకు నెలన్నర ముందు నుంచే పెద్దపెద్ద విగ్రహాల కోసం రూ.10 వేల నుంచి 20 వేల దాకా అడ్వాన్సు ఇచ్చివెళ్లేవారు.  ఏరూపంలో కావాలంటే ఆ రూపంలో విగ్రహం చేయించుకునేందుకు ఉత్సవ కమిటీలు పోటీపడేవి. దాంతో వ్యాపారం బాగా ఉండేది. దాదాపు రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు విగ్రహాల విక్రయాల ద్వారా సొమ్ము సమకూరేది. పెట్టుబడిపోనూ రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ లాభం వచ్చేది.  కరోనా పరిస్థితిని అంచనా వేయలేక విగ్రహాల ముడి సరుకు కోసం రూ.10 లక్షలు ముందుగానే పెట్టుబడి పెట్టా. పండుగ దగ్గరపడుతున్నా విగ్రహాల కోసం ఏఒక్కరూ రావడంలేదు. దీంతో ఈసారి రూ.10 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. 


కుటుంబమంతా ఇదే పనే : రామాంజనేయులు, మర్తాడు, గార్లదిన్నె మండలం.

పదేళ్లుగా విగ్రహాలు తయారుచేసి వాటిని విక్రయించి జీవనం సాగిస్తున్నాం. కుటుంబమంతా ఇదే పనిచేస్తున్నాము. ప్రతి ఏడాది ఎంతో కొంత లాభం వచ్చేది. ఆ లాభం మీదనే కుటుంబమంతా బతుకును వెళ్లదీసేవాళ్లం. పిల్లల చదువులు మా వృత్తిమీదే ఆధారపడ్డాయి.  ఈ ఏడాది కరోనాతో వ్యాపారం లేనట్లే. ఎన్ని చిన్న విగ్రహాలు అమ్మినా.. ఆపూటకాపూటకు సరిపోదు. విగ్రహాల తయారీ ముడిసరుకు కోసం రూ.2 లక్షల అప్పుచేశా. పెద్ద విగ్రహాలు అమ్ముడుపోతేనే ఆ అప్పు తీరేది. 


మూడు దశాబ్దాలుగా ఇదే జీవనాధారం : తిరుపాల్‌, విగ్రహ తయారీదారుడు, గుంతకల్లు

మూడు దశాబ్దాలుగా వినాయక విగ్రహాలు తయారు చేసి జీవిస్తున్నాం. విగ్రహాల తయారీకి ఇప్పటికే రూ. 2 లక్షలు అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టా. కరోనాతో పెద్దవిగ్రహాలు అడిగేనాథుడే లేడు. ప్రస్తుతం చిన్నపాటి విగ్రహాలను తయారు చేస్తున్నాం. ఆ విగ్రహాలు ఎన్ని అమ్మినా తిండికే సరిపోవు. ఈ పరిస్థితుల్లో బాడుగలు, తెచ్చిన అప్పులకు వడ్డీలు భారంగా మారాయి. 


 ఈ పరిస్థితులు కలలో కూడా ఊహించలేదు : బదామి, విగ్రహాల తయారీదారురాలు, రాజస్థాన్‌

ఇలాంటి గడ్డుపరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. వినాయకచవితి పండుగకు ఐదు నెలల ముందునుంచే విగ్రహాల తయారీకి అవసరమైన మెటీరియల్‌ సిద్ధం చేసుకోవడం ప్రతి ఏడాది చేస్తున్నాం. ఈ ఏడాది కూడా అదేవిధంగానే రూ.6 లక్షల ముడిసరుకు తెచ్చుకున్నాం. పెద్ద విగ్రహాలను ముందుగానే తయారు చేశాం. వాటికి రంగులు అద్దడమే మిగిలి ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతుందని, వినాయక విగ్రహాలను ఎవరూ పెట్టకూడదని, ఇళ్లలోనే చేసుకోవాలని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో మా పరిస్థితి దయనీయంగా మారింది.

   

ఒక పూటతో కాలం వెల్లదీస్తున్నాం : చల్లారామ్‌, విగ్రహాల తయారీదారుడు, రాజస్థాన్

పండుగకు విగ్రహాలు కొంటారని 5 నెలల ముందు నుంచే ప్రతిమలు తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్నాం. చేతిలో ఉన్న డబ్బంతా విగ్రహాల తయారీ మెటీరియల్‌కే ఖర్చుచేశాం. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. ఒక్క పూటతో కాలం వెళ్లబుచ్చుతున్నాం. మాది వేరే రాష్ట్రం కావడంతో అప్పులు కూడా పుట్టడంలేదు. దీంతో చిన్నపాటి విగ్రహాలనైనా కొనుగోలుచేస్తారనే ఆశతో వాటిని తయారుచేస్తున్నాం.  


పూటగడవడం కష్టంగా ఉంది : కుమ్మర రామ్మోహన్‌, తయారీదారుడు, తాడిపత్రి

మాది గుంతకల్లు స్వగ్రామం. పదేళ్ల కిందట తాడిపత్రి పట్టణానికి వలస వచ్చా.  వినాయక విగ్రహాలు తయారీ కోసం స్థలం బాడుగకు తీసుకున్నాం. ప్రతి ఏడాది మార్చి నుంచి విగ్రహాలు తయారు చేసే వాళ్లం. ఈసారి కరోనాతో విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చేందుకు ఎవరూ ముదుకురాలేదు.  ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. విగ్రహాల తయారీ మెటీరియల్‌కు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టా. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది. పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్దీలు మీదపడుతున్నాయి. కుటుంబం  పూట గడవడం కష్టంగా మారింది. 

Updated Date - 2020-08-10T08:20:10+05:30 IST