జెండా పండగపైనా కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-08-12T09:01:08+05:30 IST

ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన ఎంతో అట్టహాసంగా నిర్వహించే జెండా పండగపైనా కరోనా ప్రభావం పడింది. ఈ దఫా చిత్తూరులోని పోలీసు

జెండా పండగపైనా కరోనా ప్రభావం

 స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిరాడంబరంగా 

నిర్వహించనున్న జిల్లా యంత్రాంగం

 ప్రశంసా పత్రాల ప్రదానాన్నీ 

రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు


చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 11: ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన ఎంతో అట్టహాసంగా నిర్వహించే జెండా పండగపైనా కరోనా ప్రభావం పడింది. ఈ దఫా చిత్తూరులోని పోలీసు పరేడ్‌ మైదానంలో స్వాతంత్య్ర దిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ణయించింది. 15న ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించాక ప్రజలను ఉద్దేశించి.. జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి.. మూడు లేదా నాలుగు శకటాలనే సిద్ధం చేయనున్నారు.


స్టాల్స్‌ సైతం నాలుగు మాత్రమే ఏర్పాటు కానుండగా, మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పరిమిత సంఖ్యలోనే సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా తక్కువ సంఖ్యలో హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆస్తుల పంపిణీని రద్దు చేశారు. మరోవైపు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలకు గుర్తింపుగా ఏటా వందల సంఖ్యలో ప్రశంసా పత్రాలను ప్రదానం చేసేవారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Updated Date - 2020-08-12T09:01:08+05:30 IST