Abn logo
Sep 8 2020 @ 13:09PM

కరోనా దడదడ... ఎలా?

ఆంధ్రజ్యోతి(08-09-2020)

23ఇంటి పనులు, ఆఫీసు పనులూ కలిపి చేయడంలో ఒత్తిడికి లోనవుతున్న మహిళలు! బయటకు వెళ్లలేక, ఇంటిపట్టున ఉండలేక భయం భయంగా రోజులు నెడుతున్న పెద్దలు! కరోనా కాలంలో సర్వత్రా నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇది! ఇలాంటి పరిస్థితిని చాకచక్యంగా నెగ్గుకురావాలంటున్నారు మానసిక వైద్యులు!

అర్థంకాని అయోమయం...

బడి ఈడు పిల్లలకు ఇప్పటి వరకూ తెరుచుకోవలసిన బడులు తెరుచుకోకపోగా, కొత్తగా ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి. ఇంటి పట్టున ఉంటే ఆటలకే ప్రాధాన్యం ఇచ్చే పిల్లలకు ఈ కొత్త విద్యా విధానం క్లిష్టంగా మారింది. దీనికి తోడు తోటి పిల్లలతో ఆరుబయట ఆటలాడే పరిస్థితి లేకపోవడంతో పిల్లల్లో ఒంటరితనంతో కూడిన ఒత్తిడి పెరుగుతోంది. కాలక్షేపం కోసం టి.వి చూడడం, సెల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడుతూ వాటికి అలవాటు పడుతున్నారు. ఆ అలవాట్లకు ఆటంకం కలిగించే పెద్దల మీద చీకాకు పడడం, అసహనానికి లోనవడం, కోపం తెచ్చుకోవడం, అరవడం, ఏడ్వడం చేస్తున్నారు. కొందరు పిల్లలు తల గోడకు కొట్టుకోవడం, గోళ్లు కొరుక్కోవడం, దంతాలతో నోటి లోపలి నుంచి బుగ్గలను కొరుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు అరుదుగా చేతులు కోసుకోవడం లాంటి పనులూ చేస్తారు. ఇలాంటి పిల్లలు సమయానికి తినకపోయినా, నిద్రపోకపోతున్నా, కుటుంబంతో కలవకుండా ఒంటరిగా గడుపుతున్నా విషయాన్ని మానసిక వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. అంతకంటే ముందు పిల్లల్లో మానసిక భావోద్వేగాలు చోటుచేసుకోకుండా పెద్దలు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి.

చేదోడు వాదోడుగా!

పరిస్థితి చేయిదాటిపోయే స్థితికి వచ్చినప్పుడు కేసులు పెట్టుకోవడం, విడాకుల వరకూ వెళ్లకుండా మ్యారేజ్‌ కౌన్సెలర్లను సంప్రతించాలి. వీరు దంపతుల మధ్య తగవులను విశ్లేషించి, ఇద్దరి మధ్యా సఖ్యత ఏర్పడేలా తోడ్పడతారు. అంతకంటే ముందు దంపతులు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి ఇబ్బందిని మరొకరు గుర్తెరిగి నడుచుకుంటూ, ఇంటి పనులను సమానంగా పంచుకోవాలి. రోజంతా ఎవరి పనులతో వారు బిజీగా గడిపినా, రాత్రి నిద్రకు ముందు నాణ్యమైన సమయాన్ని గడపాలి. కబుర్లతో మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలి. కలిసి టీవీలో సినిమా చూడడం, పిల్లలతో కలిసి కేరమ్స్‌ ఆడడం లాంటి ఆహ్లాదకరమైన పనుల్లో పాల్గొనాలి. 

భరోసా కోల్పోతున్న టీనేజర్లు!

ఉరకలెత్తే ఉత్సాహం నిండి ఉండే టీనేజర్లను ప్రస్తుత పరిస్థితి విపరీతమైన అసహనానికి లోనుచేస్తోంది. విద్యాసంవత్సరం వృథా అవుతుందేమో అనే భయం ఓ పక్క, చదువు పూర్తయినా కెరీర్‌ ఎలా ఉండబోతుందో అనే ఆందోళన మరో పక్క 16 నుంచి 22 ఏళ్ల వయసు యవతను మానసికంగా కుంగదీస్తున్నాయి. రాత్రుళ్లు ఎక్కువ సమయాలు మేలుకోవడం వల్ల హార్మోన్లలో అవకతవకలు చోటుచేసుకోవడం, ఫలితంగా ఆడపిల్లల నెలసరిలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. మెదడులో విడుదలయ్యే రసాయనాల్లో హెచ్చుతగ్గుల వల్ల భావోద్వేగాల్లో తీవ్ర మార్పులూ చోటుచేసుకుంటాయి. దీనికితోడు తమలో లోపించిన ఉత్సాహాన్ని నింపుకోవడం కోసం తాత్కాలిక ఆనందాలైన ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలకు  ఆకర్షితులవుతారు.హద్దులు దాటిన ఆలోచనలతో ఒత్తిడి పెరిగి యువత ఆత్మహత్యలకూ పాల్పడే వీలుంది. చిన్న విషయాలకే చీకాకు పడుతూ ఉండడం, కోపంతో అరవడం, వస్తువులను విసిరేయడం, అరుదుగా కొందరు గాయాలు చేసుకోవడం కూడా చేస్తారు.

భరోసా ఇవ్వాలి!

పెద్దలు పిల్లల్లో కనిపించే మార్పులను నిర్లక్ష్యం చేయకుండా మానసిక నిపుణుల దృష్టికి తీసుకువెళ్లాలి. పిల్లలు ఎక్కువ సమయాల పాటు ఒంటరిగా గడుపుతున్నా, బద్ధకంతో, ఏ పని మీదా ఆసక్తి లేనట్టు వ్యవహరిస్తున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవడం మేలు. మందులు, కౌన్సెలింగ్‌తో యువతలో నెలకొనే మానసిక కుంగుబాటును వైద్యులు సరిదిద్దగలుగుతారు.


ఏదైనా ఊహించని పరిస్థితి ఎదురైనప్పుడు మొదట అసహనానికి లోనవుతాం. కోపం తెచ్చుకుంటాం, దిగాలు పడతాం! చివరకు రాజీపడి సర్దుకుపోతాం! కరోనా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ దశలన్నీ దాటేసి, రాజీపడి బతికే స్థితికి చేరుకున్నాం. దాన్నుంచి తప్పించుకుని, జీవనాన్ని గడిపే మెలకువలు క్రమేపీ అలవరుచుకున్నాం. అయినా ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళనలు ఉంటూనే ఉన్నాయి. పనులన్నీ గాడి తప్పాయి. చదువులు, ఉద్యోగాలు, జీవనశైలులు క్రమం తప్పాయి. ఫలితంగా పిల్లల నుంచి పెద్దల వరకూ పలురకాల మానసిక భావోద్వేగాలు చోటుచేసుకుంటున్నాయి. అవి ఎలాంటివంటే... 

ఇలా నడుచుకోవాలి... 

బడులు నడిచే సమయంలో పిల్లలు ఎలాగైతే టైమ్‌టేబుల్‌ ప్రకారం నడుచుకునేవారో, అదే పద్ధతిని ప్రస్తుత సమయంలోనూ అనుసరించేలా చేయాలి. ఉదయాన్నే నిద్ర లేవడం మొదలు, భోజన వేళలు, ఆన్‌లైన్‌ తరగతులు, ఆటలు, నిద్ర వేళలు క్రమంతప్పకుండా పాటించేలా చూడాలి. పెద్దలు తప్పనిసరిగా పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ, వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్లతో కబుర్లు చెబుతూ, వారి మనసులోని భావాలు మాటల్లో వ్యక్తం చేయగలిగేలా ప్రోత్సహించాలి. పిల్లలకు ఆదర్శంగా నిలుస్తూ స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించుకోవాలి.ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడిస్తూ, వారిని ఇంటి పనుల్లోనూ భాగస్వాములను చేయాలి. ప్రస్తుతం సంగీతం, నాట్యం, డ్రాయింగ్‌లను ఆన్‌లైన్‌లో నేర్పించే వెసులుబాట్లు వచ్చాయి. వాటిలో పిల్లలను చేర్చాలి. ప్రస్తుత పరిస్థితి తిరిగి పూర్వంలా మారుతుందనే భరోసా కల్పించాలి. ఇలా పెద్దలు పిల్లలతో స్నేహితుల్లా వ్యవహరిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి. 


భయాందోళనలకు దూరంగా... 

ఎడతెరపి లేకుండా వెల్లువెత్తే కరోనా వార్తలతో పెద్దలు మిగతా వారి కంటే ఎక్కువగా బెంబేలెత్తుతున్నారు. మందుల కోసం, పరీక్షల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎటువైపు నుంచి కరోనా సోకుతుందో అనే భయం పెద్దలను విపరీతంగా కుంగదీస్తున్నాయి. పిల్లలకు దూరంగా ఒంటరిగా ఉండే పెద్దల పరిస్థితి మరీ దారుణం. వీడియో కాల్స్‌ మాట్లాడడం, ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్లతో వైద్యులకు ఆరోగ్యపరిస్థితి తెలపడం లాంటి వాటి పట్ల అవగాహన లేకపోవడంతో పెద్దలు తమ అస్వస్థతలను ఎవరికీ తెలపలేని పరిస్థితి. పూర్వం ఛాతీలో అసౌకర్యం కలిగితే వైద్యలను కలిసి ముంచుకొచ్చే గుండె జబ్బును ప్రారంభంలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. అత్యవసరమైతే తప్ప ఆస్పత్రులకు వెళ్లే వీలు లేకపోవడం, ప్రయాణ సౌకర్యాలు కొరవడడం వల్ల పెద్దల్లో వ్యాధులు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. 


పెద్దలకు ఆసరాగా....

ప్రస్తుత సమయంలో పెద్దలు పిల్లలకు దూరంగా ఉండడం సరికాదు. కాబట్టి పిల్లలు తమ తల్లితండ్రులతో కలిసి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వారి ఆరోగ్య అవసరాలు గమనిస్తూ అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలు జరిపించాలి. పెద్దలకు గ్లూకోమీటరు, రక్తపోటు పరికరాల వాడడాన్ని నేర్పించాలి. కాలక్షేపం కోసం పుస్తకాలు ఇవ్వాలి. వార్తలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. అన్నిటికంటే ఎక్కువగా మేం మీకు తోడున్నాం! అనే భరోసా పెద్దలకు కల్పించాలి.

ఇంటి పని, వంట పని, ఆఫీసు పని!

గత ఆరు నెలల కాలంలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య మహిళలు గృహహింసకు గురవుతున్న కేసులు 40శాతం పెరిగాయి. ఇందుకు దంపతులు మునుపటి కంటే ఎక్కువ సమయాల పాటు ఇంట్లో కలిసి గడపవలసి రావడం, పనులను పంచుకోకపోవడం, పని ఒత్తిడి ప్రధాన కారణాలు. రోజంతా ఇంట్లోనే ఉంటున్న కుటుంబం మొత్తానికీ నిరంతరంగా పనులు చేయవలసిరావడంతో గృహిణులు విపరీతమైన అలసట, ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగినులు ఇంటి పని, ఆఫీసు పనులను సర్దుబాటు చేసుకోలేక అసహనాన్ని పిల్లలు, భర్త మీదా ప్రదర్శించడంతో కుటుంబంలో తగవులు సర్వసాధారణమైపోతాయి. చిన్న చిన్న తగవులే పెద్దవిగా మారి భౌతిక హింసకూ దారి తీస్తూ ఉంటాయి. ఆవేశంలో దంపతులు ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకునే వరకూ పరిస్థితులు దిగజారతాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే దంపతులు ఓర్పుతో నడుచుకోవాలి.

లైంగిక జీవితం సజావుగా!

దంపతుల మధ్య అనుబంధం బలపడడానికి వారి లైంగిక జీవితం తోడ్పడుతుంది. కరోనా కాలంలో అందుకోసం సమయాన్ని చేజిక్కించుకోవాలి. ఒత్తిడి, ఆందోళనలను పక్కనపెట్టి, సన్నిహితంగా గడపాలి. తగాదాలు, అలకలు, చిర్రుబుర్రులు రోజు మొత్తంలో ఎన్ని జరిగినా, వాటి ప్రభావం లైంగిక జీవితం మీద పడకుండా చూసుకోవాలి. సంతృప్తికరమైన లైంగిక జీవితంతో ఆక్సిటోసిన్‌ అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ శరీరంలో విడుదలవుతుంది. రోగనిరోధకశక్తికి తోడ్పడే ఈ హార్మోన్‌తో కరోనా కట్టడీ సాధ్యపడుతుంది. కాబట్టి దంపతులు లైంగిక జీవితాన్ని అడ్డంకులు లేకుండా ఆస్వాదించాలి.


- డాక్టర్‌ నరేష్‌ వడ్లమాని

ఛీఫ్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌,

కొలంబస్‌ హాస్పిటల్‌,

హైదరాబాద్‌