ఆటో విడిభాగాలపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-03-02T07:25:26+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి విడిభాగాల సరఫరా విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), ఎంజీ మోటార్‌ ఇండియా తెలిపాయి. చైనా నుంచి విడిభాగాల సప్లయ్‌లో...

ఆటో విడిభాగాలపై కరోనా ప్రభావం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి విడిభాగాల సరఫరా విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), ఎంజీ మోటార్‌ ఇండియా తెలిపాయి. చైనా నుంచి విడిభాగాల సప్లయ్‌లో ఊహించని సవాళ్లు ఎదురైన కారణంగా బీఎస్‌-6 వాహనాల తయారీపై ప్రభావం పడిందని ఎం అండ్‌ ఎం సేల్స్‌, మార్కెటింగ్‌ చీఫ్‌ (ఆటోమోటివ్‌ డివిజన్‌) విజయ్‌ రామ్‌ నక్రా తెలిపారు. సరఫరాలో సమస్యల వల్ల ఫిబ్రవరికి సంబంధించిన బిల్లింగ్‌ పరిమాణంలో అధిక క్షీణత నమోదైనట్టు చెప్పారు. డీలర్ల వద్ద ఇన్వెంటరీ 10 రోజులకన్నా తక్కువకు చేరిందన్నారు. విడిభాగాల సప్లయ్‌లో కొన్ని వారాల పాటు సవాళ్లు కొనసాగే అవకాశం ఉందని, కొంతకాలం తర్వా త సాధారణ పరిస్థితి ఏర్పడవచ్చని ఆయన చెప్పారు. 


కరోనా వైరస్‌తో పాటు తమ వ్యూహాత్మక వెండార్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల వాహన ఉత్పత్తి, హోల్‌సేల్‌ అమ్మకాలు ప్రభావితమయ్యాయని టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికిల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ తెలిపారు. తమ యూరోపియన్‌, చైనీస్‌ సప్లయ్‌పై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని, ఫలితంగా ఉత్పత్తి, అమ్మకాలకు విఘాతం కలుగుతోందని ఎంజీ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌ (సేల్స్‌) రాకేష్‌ సిదానా తెలిపారు. మార్చిలో కూడా అమ్మకాలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పరిస్థితిని స్థిరపరిచేందుకు కృషి చేస్తున్నామని, మార్చి చివరి వరకు సాధారణ పరిస్థితులు ఏర్పడవచ్చని ఆయన చెప్పారు. 


ఉత్పత్తి ప్రణాళికలపై ప్రభావం లేదు

విడిభాగాల సప్లయ్‌లో అవాంతరాల కారణంగా ఇప్పటికైతే తమ ఉత్పత్తి ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం లేదని మారుతీ సుజుకీ, హ్యుండయ్‌, టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వెల్లడించాయి. ఈ కంపెనీలకు చైనాలో మేజర్‌ సప్లయర్లున్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమస్య లేదని, తమ సప్లయర్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నామని మారుతీ తెలిపింది.

Updated Date - 2020-03-02T07:25:26+05:30 IST