కిక్కులేక..కినుకు రాక

ABN , First Publish Date - 2020-04-03T08:55:59+05:30 IST

కరోనా మహమ్మారితో మందుబాబులకు కష్టాలు తప్పడం లేదు. కొద్ది రోజులుగా చుక్క మందు లేక కంటి మీద కునుకే లేకుండా పోయిందని మద్యం ప్రియు లు వాపోతు

కిక్కులేక..కినుకు రాక

  • కరోనాతో నిలిచిన మద్యం అమ్మకాలు
  • జిల్లాలో తల్లడిల్లుతున్న మందుబాబులు
  • గ్రామాల్లో గుప్పుమంటున్న గుడుంబా
  • కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారితో మందుబాబులకు కష్టాలు తప్పడం లేదు. కొద్ది రోజులుగా చుక్క మందు లేక కంటి మీద కునుకే లేకుండా పోయిందని మద్యం ప్రియు లు వాపోతున్నారు. మార్చి 22న నిర్వహించిన జనతా కర్ఫ్యూ సందర్భంగా జిల్లాలోని బార్స్‌, వైన్‌ షాపులను మూసివేశారు. ఒక రోజు మామూలేనని అందరు అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిరంతరం గా మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధిం చడంతో అసలు సీన్‌ మొదలైంది. గ్రామాల్లో కనీ సం చెట్ల కల్లు కూడా దొరకకుండా పోయింది. దీంతో కొందరు మందుబాబులు మద్యం కొరతతో వెతుకులాట మొదలుపెట్టారు.


గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైన్‌ షాపుల యజమానులు రాత్రికి రాత్రే దుకాణాలను తెరుస్తూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను జరిపారు. ఇలాంటి పరిస్థితిని గమ నించిన ఎక్సైజ్‌ అధికారులు వైన్‌ షాపులను సీజ్‌ చేయడంతో మద్యం దొరకడమే గగనమై పోయింది. కొందరు మందుబాబులు చుక్క మద్యం దొరకక పోవడంతో తల్లడిల్లిపోతున్నారు. మద్యం కావాలి మహాప్రభు అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కొన్నాళ్ల పాటు పరిస్థితులు ఇలానే ఉంటే ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుందని వైద్యులు చెబుతూ పంపించేస్తున్నారు. మద్యానికి అలవాటు పడి మానసిక రోగులుగా మారిన మం దుబాబులకు అవగాహన కల్పించి అవసరమైతే ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎక్సైజ్‌ అధికారులు మాత్రం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేక గందరగోళ పరిస్థితులకు దారి తీస్తోంది. 


గుప్పుమంటున్న గుడుంబా..

కొద్ది రోజులుగా మద్యం అమ్మకాలు నిలిచి పోవ డంతో మారుమూల గ్రామాల్లో మళ్లీ గుడుంబా, సారా గుప్పుమంటోంది. దాదాపుగా కనిపించ కుండా పోయిన సారా తయారీ గ్రామాల్లో పునరావృతమవుతోంది. దీనికి తోడు ఇప్పపువ్వు రాలే సమయం కూడా ఇదే కావడంతో గ్రామాల్లో విరివిగా ఇప్పపువ్వు సేకరణ జరుగుతోంది. బయ ట సారాకు మంచి డిమాండ్‌ ఏర్పడడంతో గతంలో తయారు చేసిన వారంతా మళ్లీ అదే వృత్తిని మొదలు పెడుతున్నారు. ఇటీవల ఇచ్చోడ మం డలంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేసి నాటుసారా తయారీ పాత్రలను ధ్వంసం చేసినా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గుడుంబా తయారీ మళ్లీ ఊపందుకుంటుంది.


బ్లాక్‌లో అమ్మకాలు..

కరోనా పరిస్థితులను ముందే పసిగట్టిన కొందరు బడా మద్యం వ్యాపారులు మద్యాన్ని బ్లాక్‌ చేసి రహస్యంగా విక్రయిస్తున్నారు. ఉన్న ధర కంటే ఐదింతలు పెంచి అమ్ముతున్నారు. రూ.150 ధర ఉన్న క్వార్టర్‌ ప్రస్తుతం రూ.300లకు పైగానే అమ్ముతున్నట్లు సమాచారం. అలాగే రూ.40 ఉన్న లీటర్‌ సారా రూ.100కు పైగానే అమ్ముతున్నారు. గతంలో అమ్మేందుకు భద్రపరుచుకున్న దేశీదారు మద్యాన్ని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో విక్ర యిస్తున్నారు. ఇటీవలే అధికారులు దాడులు చేసి దేశీదారును పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. కరోనా వైరస్‌తో ఏర్పడిన  డిమాండ్‌ను  అదునుగా చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు.


నిరంతరంగా దాడులు చేస్తున్నాం: రవీందర్‌రాజు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, ఆదిలాబాద్‌

కరోనా ఎఫెక్ట్‌తో మద్యం అమ్మకాలన్నీ పూర్తిగా నిలిపి వేశాం. గుడుంబా తయారీ కేంద్రాలపై నిరంతరంగా దాడులు చేస్తున్నాం. ఇప్పటికే ఇచ్చోడ మండలంలో నాటుసారా కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్‌, పోలీసుల సహకారంతో పూర్తిగా కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2020-04-03T08:55:59+05:30 IST