20 లక్షల చేపలపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-04-08T09:54:59+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో 20 లక్షల చేపల భవితవ్యం అగమ్యగోచరంగా మారుతోంది.

20 లక్షల చేపలపై కరోనా ఎఫెక్ట్‌

కణేకల్లు చెరువులో తగ్గుతున్న నీటి మట్టం 

ఎండ వేడికి చేపలు మృత్యుబారిన  పడనున్న వైనం 

ఆందోళన చెందుతున్న మత్స్యకార్మికులు


రాయదుర్గం, ఏప్రిల్‌ 7 : కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో 20 లక్షల చేపల భవితవ్యం అగమ్యగోచరంగా మారుతోంది. చేపలు ఉన్న చెరువులతో పాటు రిజర్వాయర్‌లో నీరు రోజు రోజుకు తగ్గుముఖం పడుతుండటంతో మరో వైపు ఎండ వేడి పెరిగి చేపల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మత్స్యకార్మికులు వెళ్లి చేపలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే లాక్‌డౌన్‌ ఉందని వాటిని అధికారులు అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచక అయోమయాన్ని ఎదుర్కొంటున్నామని మత్స్యకార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మృత్యువు అంచున 20 లక్షల చేపలు 

కణేకల్లులోని హెచ్చెల్సీ అనుబంధ చెరువులో 20 లక్షల చేపలు మృత్యువు అంచున ఉన్నాయి. సాధారణంగా చేపలు ఆరు అడుగుల మేరకు నీరు నిల్వ ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంటాయి. ఏ మాత్రం నీటి మట్టం తగ్గినా క్రమేపీ మృత్యుబారిన పడతాయి. వేసవి కావడంతో ఎండలు విపరీతంగా ఉన్న దశలో వేడిని తట్టుకోలేక చేపలు చచ్చిపోతాయి. దీంతో మత్స్యకారులు నీటి మట్టంను అంచనా వేసి వాటిని వెంటనే వలలతో పట్టేసి బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. కాకపోతే ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపలను పట్టేందుకు అధికారులు నిషేధం విధించారు. మత్స్యకారులు వెళ్లి వాటిని పట్టుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తే హెచ్చరికలతో పట్టుకోకుండా చేస్తున్నట్లు వాపోతున్నారు.  


ఆలస్యమయ్యే కొద్దీ కష్టమే.. 

చేపలను పట్టడంలో ఆలస్యం చేసే కొద్దీ చనిపోయే సంఖ్య అధికమవుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రధానంగా లాక్‌డౌన్‌కు పాటిస్తూ నిబంధనల మేరకు చేపలను పట్టుకుంటామని అధికారుల ముందు మత్స్యకారులు వెల్లడిస్తున్నా సడలింపు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. కణేకల్లు చెరువులో ఉన్న ఆరడుగుల నీరు చేపల మనుగడకు ప్రమాదాన్ని సూచిస్తున్నాయంటున్నారు. అదేవిధంగా బీటీపీ ప్రాజెక్టులో ఉన్న నీరు కూడా క్రమేపీ ఇంకిపోతున్నాయని తెలిపారు.


కనీసం వాటిని పట్టుకుని విక్రయించుకునేందుకు అనుమతిస్తే సొమ్ము చేసుకుంటామని తెలుపుతున్నారు. ప్రధానంగా కణేకల్లు చెరువుపై 150 మత్స్యకార్మికుల కుటుంబాలు ఆధారపడ్డారు.  యేడాది పొడవునా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు కరోనా ప్రభావంతో చేపలను పట్టుకోకుండా వదిలేస్తే తమ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వెళ్లగక్కుతున్నారు.


Updated Date - 2020-04-08T09:54:59+05:30 IST