కడుపు కొట్టిన కరోనా!

ABN , First Publish Date - 2020-04-02T08:45:39+05:30 IST

గుప్పెడు మెతుకుల కోసం వెళ్లిన వలస బతుకులు గంజి నీళ్ల కోసం అలమటిస్తున్నాయి. కూలి చేసుకునే శరీరాలు రూ.5 నీళ్ల బిందె కోసం లాఠీ దెబ్బలకు రక్తమోడుతున్నాయి. పూరి గుడిసెలకూ అద్దె వసూలు

కడుపు కొట్టిన  కరోనా!

  • ముంబైలో తెలుగువారి బతుకు పోరాటం
  • పనుల్లేక 600 వలస కుటుంబాల ఆకలి కేకలు
  • రూ.5 పెట్టి బిందె నీళ్లు కూడా కొనలేని దుస్థితి
  • గుడిసె బాడుగ, కరెంటు చార్జీలు పెనుభారం
  • దాతలు పంచే అన్నం కూడా అందక ఇక్కట్లు
  • బయట అడుగు పెడితే లాఠీలతో ఒళ్లు గుల్ల 
  • ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వేడుకోలు


కర్నూలు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గుప్పెడు మెతుకుల కోసం వెళ్లిన వలస బతుకులు గంజి నీళ్ల కోసం అలమటిస్తున్నాయి. కూలి చేసుకునే శరీరాలు రూ.5 నీళ్ల బిందె కోసం లాఠీ దెబ్బలకు రక్తమోడుతున్నాయి. పూరి గుడిసెలకూ అద్దె వసూలు చేసే ముంబై మహానగరంలో కర్నూలు జిల్లా వాసుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. పాల కోసం ఏడ్చే పసిబిడ్డకు కొంగు చాటున కడుపు నింపుదామన్నా నెత్తురు చుక్కలే వస్తున్నాయన్న ఓ తల్లి రోదన అక్కడివారిని కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లాలోని 11 మండలాల నుంచి కూలి పనుల కోసం ముంబైలోని వర్సోవాకు వలస వెళ్లిన 600 కుటుంబాలు నేడు ఆకలి కేకలతో అలమటిస్తున్నాయి. దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతుండడంతో పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వలేక.. బిక్షమెత్తుకునే దుస్థితి దాపురించింది. సహృదయులు అన్నదానం చేస్తున్నా.. అడుగు బయటపెడితే పోలీసులు ఎముకలు విరిగేలా కొడుతుండడంతో ఆ మెతుకులు కూడా అందడంలేదు. వెనక్కురాలేక, తిండిలేక ప్రాణాలు వదులుకోలేక వేదన పడుతున్న ఆ కూలీలు ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించారు. ఆకలి తీర్చమని చేతులెత్తి వేడుకుంటున్నారు.


పది రోజులుగా పస్తులే..

కర్నూలు జిల్లా ఆదోని, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, ఆస్పరి, నందవరం, కోడుమూరు, సి.బెళగల్‌, గూడురు, పత్తికొండ తదితర మండలాల నుంచి అనేకమంది 8నెలల క్రితం ముంబైకి వలస వెళ్లారు. సిమెంట్‌ పనులు, చేపలు పట్టే వద్ద, రోడ్లు ఊడ్చడం వంటి పనులు చేస్తే మహిళలు రోజుకు రూ.300, పురుషులకు రూ.500 చొప్పున కూలీ దొరుకుతుంది. వాటితో తిండి, నీళ్లు తెచ్చుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వారి కడుపు కొట్టింది. పది రోజులుగా పనుల్లేక ఆ కుటుంబాలు పస్తులుంటున్నాయి. వారిలో బాలింతలు, వృద్ధులు, పసిపిల్లలతో పాటు దివ్యాంగులు కూడా అధికంగా ఉన్నారు.


పట్టని ప్రభుత్వం 

కరోనా నుంచి ప్రజలను రక్షించడంతో పాటు అన్నమో రామచంద్రా అని అలమటించే వారిని ఆదుకునే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వాధికారులు మాత్రం ఇలాంటి వారి కష్టాల్ని విస్మరిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన 600 కూలీలకు రిలీఫ్‌ ఇవ్వాలిందిగా మహరాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. తమను తమ ప్రాంతాలకు తరలించాలని లేదంటే ఆహార ఏర్పాట్లయినా చేయాలని ఆ కూలీలు వేడుకుంటున్నారు.


అన్నం పెట్టండయ్యా...

ముంబైకి పనుల కోసం 7నెలల క్రితం వచ్చాం. సిమెంట్‌, రోడ్లు ఊడ్చే పనులు చేసుకుంటేనే 600 కుటుంబాల కడుపునిండేది. లాక్‌డౌన్‌తో పది రోజులుగా పనుల్లేవు. దాతలు పెట్టే అన్నం తెచ్చుకుందామని బయటకు వెళ్తే పోలీసులు కొడుతున్నారు. ఏపీ ప్రభుత్వమే సాయపడాలి. లేదా మా అందరి ప్రాణాలు ఇక్కడే పోతాయి. 

- దేవదాసు, ముంబై కూలీ (ఎమ్మిగనూరు మండల వాసి)


ఒక ఫ్యాన్‌, బల్బుకు 1500 కట్టాలి 

ముంబైలో ప్రతిదీ డబ్బుతో విలువ కట్టాల్సిందే. బిందె నీళ్లు రూ.5. కడుపుకు తిన్నా లేకున్నా మేం వేసుకున్న గుడిసెలకు రూ.2వేలు బాడుగ కట్టాలి. ఒక ఫ్యాన్‌, బల్బు వాడుకున్నందుకు రూ.1500 ఇవ్వాలి. ఈ పరిస్థితిలో పది రోజులుగా ఇళ్లల్లోని బాలింతలు, ముసలోళ్ల కడుపు నింపడానికే ప్రయాస పడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఆదుకోండయ్యా.

- దయాకర్‌, ముంబై కూలీ (పెద్దకడుబూరు మండల వాసి)

Updated Date - 2020-04-02T08:45:39+05:30 IST