కరోనా కరాళ నృత్యం

ABN , First Publish Date - 2020-04-04T07:04:15+05:30 IST

కరోనా కరాళనృత్యం భూగోళాన్ని కుదిపేస్తోంది. గురువారం రాత్రికే పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల సంఖ్యను దాటగా.. శుక్రవారంనాడు దాదాపుగా మరో 74 వేల కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య

కరోనా కరాళ నృత్యం

  • 10.74 లక్షలకు పాజిటివ్‌ కేసులు
  • 57 వేల మందిని బలిగొన్న వైరస్‌
  • 4.1 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 3: కరోనా కరాళనృత్యం భూగోళాన్ని కుదిపేస్తోంది. గురువారం రాత్రికే పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల సంఖ్యను దాటగా.. శుక్రవారంనాడు దాదాపుగా మరో 74 వేల కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య దాదాపు 57 వేలకు చేరింది. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 716 మంది, ఇటలీలో 766 మంది, యూకేలో 684 మంది, స్పెయిన్‌లో 587 మంది ప్రాణాలు కోల్పోయారు.  మొత్తం నమోదైన 10.74 లక్షల కేసుల్లో.. 5,03,043 కేసులు అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో పాజిటివ్‌గా వచ్చినవే!! యూకేలోనూ వైరస్‌ ఉధృతి పెరుగుతోంది. కర్ఫ్యూలు పెట్టి, లాక్‌డౌన్‌లు అమలుచేస్తున్నా ప్రపంచదేశాలు కరోనా వేగాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. ప్రపంచ సంపదలో ఐదు శాతం కరోనా దెబ్బకు ఆవిరి అయిపోతోంది. అంకెల్లో చెప్పాలంటే ఈ మొత్తం.. 4.1 ట్రిలియన్‌ డాలర్లుగా ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. ఈ ఆపత్కాలాన్ని కలిసికట్టుగా అధిగమించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానానికి భారత్‌ సహా 188 దేశాలు మద్దతిచ్చాయి. కాగా.. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలి స్వీయ నిర్బంధంలో చికిత్స పొంది బయటపడిన బ్రిటన్‌ రాకుమారుడు చార్లెస్‌ కరోనా బాధితుల కోసం తూర్పు లండన్‌లో 4వేల పడకల సామర్థ్యంలో నిర్మించిన తాత్కాలిక ఆస్పత్రిని వీడియోలింక్‌ ద్వారా ప్రారంభించారు. ఇక, ముందస్తు చర్యలను కాస్త తొందరగా ప్రారంభించిన రష్యా.. లాక్‌డౌన్‌ను ఈ నెల చివరిదాకా పొడిగించింది. అక్కడ 4,149 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి థాయ్‌లాండ్‌లో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. భారీగా పరిశ్రమలను మూసివేయాలని, బడులు మూసివేసి పిల్లలను ఇంట ఉంచే బోధన సాగించాలని సింగపూర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ కొరియాలో పాజిటివ్‌ కేసులు 10 వేలు దాటాయి.


ఆపద వేళ ఆస్ట్రేలియా కాఠిన్యం

కరోనాపై యుద్ధానికి అన్ని దేశాలూ ఏకతాటిపైకి వస్తున్న తరుణంలో.. ‘మా దేశమే మాకు ముఖ్యం’ అన్నట్టు ఆస్ర్టేలియా వ్యవహరిస్తోంది. ఆ దేశం తీరు అక్కడి భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలను తెచ్చింది. వైరస్‌ కారణంగా చదువులు మూలనపడి, లాక్‌డౌన్‌తో చేయడానికి పని లేక ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థులకు ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం నిరాకరించింది. ‘వీసాల మీద వచ్చి వీరంతా మొదటి సంత్సరం కోర్సులు చదువుకొంటున్నారు. ప్రభుత్వం తమ కోసం ఏదో చేస్తుందని మాత్రం వారు ఆశించడానికి లేదు. వారిని ఆపాల్సిన అవసరం మాకు లేదు. ఉండగలిగితేనే ఉండాలి. లేకపోతే ఏదో పద్ధతుల్లో స్వదేశాలకు వెళ్లిపోవాలి’’ అని ప్రధానమంత్రి స్కాట్‌ మోరీసన్‌ తేల్చిచెప్పారు. చైనా తరువాత చదువుల కోసం ఎక్కువగా ఆస్ర్టేలియాకు వెళుతున్న భారతీయ విద్యార్థులే ఈ వైఖరితో ఎక్కువగా నష్టపోనున్నారు.

Updated Date - 2020-04-04T07:04:15+05:30 IST