సొమ్ములు పోలేదు! కానీ, కరోనా వచ్చింది

ABN , First Publish Date - 2020-03-22T09:01:51+05:30 IST

స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తప్పుపడుతూ రాష్ట్ర సర్కారు పెద్దలు చేసిన రెండు వాదనలూ వీగిపోయాయి. ‘కరోనా కల్లోలం అంతగా ఏమీ లేదు...

సొమ్ములు పోలేదు! కానీ, కరోనా వచ్చింది

  • ‘స్థానికం’పై వీగిన సర్కారు వాదనలు
  • రూ.1301 కోట్లు విడుదల చేసిన కేంద్రం
  • 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు
  • మరోవైపు... విస్తరిస్తున్న వైరస్‌ ముప్పు


(అమరావతి- ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తప్పుపడుతూ రాష్ట్ర సర్కారు పెద్దలు చేసిన రెండు వాదనలూ వీగిపోయాయి. ‘కరోనా కల్లోలం అంతగా ఏమీ లేదు... స్థానిక ఎన్నికలు జరపొచ్చు’... అన్నారు! కానీ, వైరస్‌  భయం మనల్నీ ముంచెత్తింది. ‘స్థానిక ఎన్నికలు జరపకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు రావు’ అన్నారు. కానీ... నిధులు వచ్చేశాయి! ఆంధ్రప్రదేశ్‌కు బకాయి ఉన్న నిధుల్లో 1301.23 కోట్లను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో విడతగా అందాల్సిన రూ.870.23 కోట్లు... పట్టణ స్థానిక సంస్థలకు 2019-20 సంవత్సరపు తొలి విడత వాయిదా రూ.431 కోట్లను ఇచ్చేసింది.


స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, ఒడిసా, తమిళనాడు రాష్ట్రాలకూ ఆయా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఒక విడత నిధులు రూ.5140 కోట్లను  కేంద్రం మంజూరు చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌లో ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థలు అందించాల్సిన కనీస సేవలకు ఎలాంటి అంతరాయం కలుగకూడదని  కేంద్రం భావిస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించని కారణంగా నిలిపివేసిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో పెండింగ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా ముప్పు నేపథ్యంలో స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సిన పారిశుధ్య చర్యల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఎస్‌ఈసీదీ అదే మాట... 

స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు అందకుండా కుట్ర పన్నారని... అందుకే ఎన్నికలను వాయిదా వేశారన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ! కరోనా ఒట్టి సాకు మాత్రమే అని, రాష్ట్రంలో భయపడాల్సినంత పనేమీ లేదని ప్రభుత్వ పెద్దలు వాదించారు. అయితే... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దీనిపై ఘాటుగానే స్పందించారు. కరోనాను కేంద్రమే జాతీయ విపత్తుగా ప్రకటించిందని గుర్తు చేశారు. అందరూ భయపడినట్లుగానే... ఇప్పుడు ఏపీ కూడా కరోనా గుప్పిట చిక్కుకుంది. ఇక... 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ‘బేసిక్‌ గ్రాంట్స్‌’ విడుదలకు సరళమైన విధానాలే ఉన్నాయని, ఎన్నికలు నిర్వహించనప్పటికీ కేంద్రం నుంచి ఆ నిధులు తెచ్చుకోవచ్చునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘పర్‌ఫామెన్స్‌ గ్రాంట్స్‌’ (పనితీరు ఆధారంగా ఇచ్చే నిధులు)కు మాత్రమే అనేక పరామితులు ఉన్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రానికి నిధులు వచ్చేందుకు తాము కూడా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఏదిఏమైనా... అటు కరోనా, ఇటు 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో అచ్చం ఎస్‌ఈసీ చెప్పినట్లే జరగడం విశేషం.

Updated Date - 2020-03-22T09:01:51+05:30 IST