ఉద్యోగులపై పంజా

ABN , First Publish Date - 2020-06-07T08:48:08+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులపై కరోనా పంజా విసురుతోంది. సచివాలయం, హెచ్‌వోడీల్లో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా సచివాలయంలో మరో 6 కేసులు నమోదైనట్లు సమాచారం.

ఉద్యోగులపై పంజా

  • సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఐదుగురికి, 
  • సచివాలయంలో మరో ఆరుగురికి పాజిటివ్‌? 
  • మొత్తం తొమ్మిదికి చేరిన కేసుల సంఖ్య
  • సీఎం ఓఎస్డీ కారు డ్రైవర్‌కు వైరస్‌ నిర్ధారణ 
  • సెలవులు పెట్టే యోచనలో ఉద్యోగులు


అమరావతి, జూన్‌  6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులపై కరోనా పంజా విసురుతోంది. సచివాలయం, హెచ్‌వోడీల్లో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా సచివాలయంలో మరో 6 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇక్కడ 9 మంది ఉద్యోగులకు వైరస్‌ సోకినట్లు అనధికారికంగా తెలుస్తోంది. దీంతో కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించడానికి ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురితో పాటు సీఎం ఓఎ్‌సడీ కారు డ్రైవర్‌కి, కొవిడ్‌ విధుల్లో ఉన్న ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అటెండర్‌కు కరోనా నిర్ధారణ అయింది. తొలుత సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌కి కరోనా రావడంతో మూకుమ్మడిగా వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. లాక్‌డౌన్‌  సడలింపులతో ఉద్యోగులందరూ విధులకు రావాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 


హైదరాబాద్‌లో చిక్కుకున్న సచివాలయ ఉద్యోగులను బస్సుల్లో తీసుకొచ్చినప్పటి నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభమైందని ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయం రెండో బ్లాకులోని మున్సిపల్‌ కమాండ్‌ కంట్రోల్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి, రెండో బ్లాక్‌లో ప్లానింగ్‌ విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌కి, రెండో బ్లాక్‌ లో ఇన్వార్డ్‌లో జమీదార్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి, మొదటి బ్లాక్‌(సీఎం బ్లాక్‌)లోని ఆర్‌టీజీఎస్‌ ఉద్యోగితో పాటు సీఎం ఓఎ్‌సడీగా పనిచేస్తున్న అధికారి కారు డ్రైవర్‌కు, నాలుగో బ్లాకులోని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌  విభాగంలో ఓ చిరుద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కాగా.. తాజాగా మరో ఆరు కేసులు గుర్తించడంతో మొత్తం సచివాలయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 9కి చేరింది. వీటిలో మూడు కేసులను నిర్ధారించాల్సి ఉంది.


పరీక్షలు పూర్తయితే మరిన్ని

సచివాలయంలో ఒకటి, రెండు, నాలుగు బ్లాకుల్లో ఉద్యోగులకు, అసెంబ్లీ, సచివాలయం భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 3, 5 బ్లాకుల్లో ఉద్యోగులతో పాటు, పారిశుధ్య సిబ్బంది, హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగుల్లో చాలామంది సచివాలయంలోని అన్నిప్రాంతాల్లో తిరిగినట్లు తెలుస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పలువురు ఉద్యోగులు తమకున్న సెలవులను వినియోగించుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యోగులు వసతి ఉంటున్న ప్రదేశాల్లోకీ కరోనా వ్యాపిస్తోంది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చిన వీరికి విజయవాడ, మంగళగిరి, నాగార్జున వర్శిటీ సమీపంలోని రెయిన్‌ ట్రీ పార్కుల్లో గత ప్రభుత్వం వసతి కల్పించింది. తాజాగా పాజిటివ్‌ వచ్చిన రెండో బ్లాకులోని ఉద్యోగి ఈ  పార్కులో  ఉండడంతో అక్కడున్న వందల మంది భయపడుతున్నారు.

Updated Date - 2020-06-07T08:48:08+05:30 IST