కరోనా ఎఫెక్ట్‌తో విధులకు డుమ్మా.. ఉద్యోగులపై కలెక్టర్ సీరియస్

ABN , First Publish Date - 2020-03-29T00:17:46+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ -19 నియంత్రణకు జిల్లా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటుండగా కొందరు ఉద్యోగులు మాత్రం విధులకు ...

కరోనా ఎఫెక్ట్‌తో విధులకు డుమ్మా.. ఉద్యోగులపై కలెక్టర్ సీరియస్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ -19 నియంత్రణకు జిల్లా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటుండగా కొందరు ఉద్యోగులు మాత్రం విధులకు హాజరుకావడంలేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. విధులకు గైర్హాజరయిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సర్య్యూలర్ జారీ చేశారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండా ఉన్నతాధికారులు అన్ని చర్యలు చేపట్టారు. నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన  కల్పించడానికి కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను అత్యవసర సేవలకు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖ, ప్రజారోగ్య శాఖల ఉద్యోగులు పూర్తిగా ఈ పనికే అంకితమయ్యారు. దానికి అనుగుణంగా అన్ని శాఖల ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు వెలువడ్డాయి. అయితే ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా మెట్రిక్ బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఇదే అదునుగా ఉద్యోగులు విధులకు హాజరవడంలేదు. అయితే విధుల్లో ఉన్నట్టు నమోదు చేసుకుంటున్నారు. ఆ విషయం ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లానా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే కరోనా వైరస్ సోకితే తమ పరిస్థితి ఏంటని ఉన్నతాధికారులను ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఇష్టారాజ్యం నడుస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయాలన్నీ ఆయా శాఖాధిపతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ ముత్యాలరాజు.. ఉద్యోగుల విధులకు తప్పకుండా హాజరుకావాలని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2020-03-29T00:17:46+05:30 IST