Abn logo
Jun 7 2020 @ 05:54AM

వైద్యం భారం

ఓపీ, టెస్టులు సహా అన్ని రేట్లూ రెట్టింపు

ప్రైవేటు ఆసుపత్రికి వెళితే జేబుకు చిల్లు

కరోనా ఎఫెక్ట్‌


కడప, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా ఉపాధి కల్పించే అన్ని మార్గాలు మూసుకుపోవడంతో మధ్యతరగతి, పేదలు ఆర్థికంగా చితికిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేని ఈ సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు... ప్రైవేటు వైద్య సేవలు మరింత ప్రియం అయ్యాయి. ఆరోగ్యం సరిలేక ప్రైవేటు ఆసుపత్రుల గడప తొక్కితే జేబుకు చిల్లు పడుతోంది. కరోనా బూచిని చూపించి ఓపీ మొదలుకుని అన్ని రకాల టెస్టుల రేట్లు అమాంతం పెంచేశారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటిలాంటి ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మారుతున్న జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం, పాశ్చాత్య ఆహార అలవాట్లకు అలవాటు పడ్డ కారణంగా రకరకాల రుగ్మతలకు ప్రజలు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా పగ బట్టగా వర్షాకాలంలో అంటువ్యాధులు పొంచి ఉన్నాయి. ఈ నేపఽథ్యంలో ప్రైవేటు వైద్యసేవలు రెట్టింపు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.


ఓపీ సహా రేట్లు పెంపు

కడప నగరంలో పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వైద్యం కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జనం కడపకు వస్తుంటారు. అయితే వైద్య సేవల రేట్లు కరోనా ముందు కరోనా తరువాత అన్నట్లు మారాయి. అన్ని రకాల సేవలను పెంచేశారు. గతంలో జనర ల్‌ సర్జన్‌, స్పెషలిస్టులు, ఆర్థో, షుగరు డాక్టర్లు ఓపీ ఫీజును రకరకాలుగా వసూలు చేసేవారు. ఆర్థో, జనరల్‌ సర్జన్లు ఓపీ ఫీజు రూ.200 నుంచి రూ.300 పెంచారు. గైనకాలజిస్టులు రూ.150 నుంచి 200, న్యూరాలజిస్ట్‌ రూ.300 నుంచి రూ.500లకు పెంచేశారు. ఇక స్కానింగ్‌ ధరలు కూడా పెంచేశారు. గైనిక్‌కు సంబంధించి స్కానింగ్‌ రూ.800 నుంచి రూ.1200లకు పెంచేశారు. గర్భంలో పిండం పరిస్థితిని చూసేందుకు చేసే స్కానింగ్‌ను రూ.1200 నుంచి 2వేలకు పెంచేశారు. సీటీ స్కానింగ్‌ రూ.500 పెంచారు.


పీపీఈ కిట్‌ రూ.10వేలు

మహిళా ప్రసవం సమయంలో శస్త్ర చికిత్సకు గతంలో రూ.20వేల నుంచి రూ.25వేలు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు ఈ మొత్తం రెండింతలు చేశారు. కరోనా నేపధ్యంలో పీపీఈ కిట్లకు రూ.10వేలు అదనంగా వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని రకాల ఖర్చులు కలుపుకుంటే రూ.50వేలు అవుతున్నట్లు సమాచారం. కరోనా కారణంగా ఆసుపత్రి శానిటైజ్‌ చేయడం, శస్త్ర చికిత్స స్థానంలో పీపీఈ కిట్లు ధరించాల్సి రావడంతో ఆ భారాన్ని రోగులపైనే మోపుతున్నట్లు ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు కడపలో ప్రైవేటు వైద్యం భారంగా మారింది.


Advertisement
Advertisement
Advertisement