శుభ, అశుభ కార్యాల్లో మారిన తీరు..!

ABN , First Publish Date - 2021-05-06T06:43:38+05:30 IST

ప్రతి ఒక్కరి జీవితంలోనూ

శుభ, అశుభ కార్యాల్లో మారిన తీరు..!

ఎంతో ఘనంగా జరిపించుకునే పెళ్లి వేడుక తూతూమంత్రంగా ముగుస్తోంది. ఎవరైనా చనిపోయినా కూడా పట్టుమని పది మంది రాని దుస్థితి. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఓదార్పు కరువవుతోంది. కరోనా కారణంగా సమాజంలో  ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 


  • మమా..!
  • సాదాసీదాగా వివాహ తంతు 


అల్వాల్‌ మే 5 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరి జీవితంలోనూ వివాహ ఘట్టం చాలా ప్రధానమైంది. ఖరీదైన మండపాలు బుక్‌ చేసి, వందలాది మంది అతిథులను ఆహ్వానించి ధనికవర్గాలు అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. ఆ వేడుక కోసం కోట్లు ఖర్చు పెడుతుంటారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలు కూడా ఉన్న దాంట్లో ఘనంగానే పెళ్లి జరిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కరోనా కారణంగా పేద, గొప్ప తేడా లేకుండా అందరూ సాదాసీదాగానే నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్‌లను ముగిస్తున్నారు. అతి కొద్ది మంది అతిథులతోనే మమా అనిపిస్తున్నారు.


ఆర్భాటాలు లేకుండానే...

తమ పిల్లల పెళ్లిళ్లను అంగరంగా వైభవంగా జరిపించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులైతే పైసా, పైసా పొదుపు చేసుకుని ఉన్నదాంట్లో గొప్పగా జరిపించాలని ఆలోచిస్తారు. కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం హడావిడి చేసే అవకాశం లేదు. వధువు, వరుడు కుటుంబ సభ్యులతో కలిపి 50 మందిని మాత్రమే అనుమతి ఉంది. దీంతో కొద్ది మంది బంధు మిత్రుల ఆశీస్సులతోనే వివాహం  కానిచ్చేస్తున్నారు. కొందరికి రూ.10 వేల నుంచి రూ.25 వేల లోపే ఖర్చవుతోంది. ఇది కూడా ఓ రకంగా మంచిదే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.


ఆరు నెలల ముందే అడ్వాన్స్‌లు

పెళ్లిళ్ల సీజన్‌లో పెద్ద, పెద్ద ఏసీ కన్వెన్షన్‌ సెంటర్లకు డిమాండ్‌ ఉంటుంది. పేట్‌ బషీరాబాద్‌, కొంపల్లి, నాగోల్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అల్వాల్‌, శంషాబాద్‌, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాలలో రూ. 3 లక్షల నుంచి మొదలుకుంటే 30 లక్షలకు పైగా రెంట్‌ వసూలు చేస్తుంటారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలలో పెళ్లిళ్లు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది మూడాలు ఎక్కువగా రావడంతో మార్చి, ఏప్రిల్‌ నెలలో శుభకార్యాలు లేవు. మే 6 నుంచే ముహార్తాలు ఉన్నాయి. దీంతో చాలా మంది 6 నెలల ముందే అడ్వాన్స్‌లు ఇచ్చి ఫంక్షన్‌ హాళ్లు బుక్‌ చేసుకున్నారు. వైరస్‌ రెండో దశ విజృంభణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ ఆంక్షలను అమలులోకి తెచ్చాయి. దీంతో కొంత మంది పెళ్లి వాయిదా వేసుకుంటుండగా, మరి కొందరు ఇళ్లు, దేవాలయాల సాదాసీదాగా పెళ్లి జరిపిస్తున్నారు. 


తక్కువ మందితో నిర్వాహణకు ఆసక్తి

కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో తక్కువ మందితోనే వివాహాలు జరిపించుకుంటున్నారు. కొంత మంది జూన్‌ నెలకు వాయిదా వేసుకుంటున్నారు. ఫంక్షన్‌హాల్లో ఘనంగా పెళ్లిళ్లు నిర్వహించుకునే వాళ్లు సైతం దేవాలయాల్లో నిర్వాహణకు ఆసక్తి చూపుతున్నారు. 

- శ్రీధర్‌ పురోహితులు, ఉమా చంద్రమౌళీశ్వర ఆలయం 


నిబంధనల ప్రకారమే పెళ్లిళ్లు జరపాలి

కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే వివాహాలు జరుపుకోవాలి. వధువు, వరుడు కుటుంబ సభ్యులతో పాటు 50 మంది వరకు హాజరు కావాలి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు వారి తల్లిదండ్రులు ఒక ఆఫిడవిట్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌, పెళ్లి పత్రిక జత చేసి పెళ్లికి అనుమతి తీసుకోవాలి. శుభకార్యాలపై రెవెన్యూ యంత్రాంగం నిఘా ఉంటుంది. భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌లు తప్పనిసరి.

- నాగమణి, అల్వాల్‌ తహసీల్దార్‌.


వీడియోల్లోనే చివరి చూపులు

5 నుంచి 10 మందితోనే అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి) : ఎవరైనా చనిపోతే కడసారి చూపు కోసం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులైతే అనుచరులు, కార్యకర్తలు.. ఇలా వందలాది మంది తరలివచ్చే వారు. పరామర్శలకు అలాగే వచ్చేవారు. కరోనా కారణంగా ఇప్పుడన్నీ మారిపోయాయి. సుమారు 10 మంది లోపు మధ్యనే అంత్యక్రియలు పూర్తవుతున్నాయి. ఫలానా వ్యక్తి చనిపోయాడని విన్న వారిలో చాలా మంది వీడియో కాల్స్‌ ద్వారానే చివరి చూపులు చూస్తున్నారు. కుటుంబ సభ్యులను ఫోన్‌లోనే పరామర్శిస్తున్నారు. 


మానవత్వం దూరమవుతోంది...

ఒకరు కిందపడగానే పక్క నుంచి వెళ్లే పదిమంది అతన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కరోనా పుణ్యమా అని రోడ్డు పక్కన చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న వ్యక్తిని చూసి కూడా సాయం అందించడానికి వెనుకాడుతున్న ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. పాజిటివ్‌ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూస్తున్న పరిస్థితులు దాపురించాయి. 


ఓదార్చే వారు కరువై...

ఇళ్లకు వెళ్లి పలకరించి ఓదార్చడం అనేది ఇప్పుడు గగనంగా మారింది. దగ్గరి బంధువులు సైతం ఫోన్‌లలోనే కన్నీళ్లు కార్చే దుస్థితి. మరి కొందరి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోవడం లేదు. అనాథ శవాలుగా శ్మశాన వాటికలకు చేరుకుంటున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారి ఇళ్ల వైపు ఓనర్‌, ఇరుగుపొరుగుతో పాటు సన్నిహితులు సైతం అనుమానపు చూపులు చూస్తుండడం బాధాకరం. 


Updated Date - 2021-05-06T06:43:38+05:30 IST