‘ఢిల్లీ’ దడ!

ABN , First Publish Date - 2020-03-31T08:09:54+05:30 IST

దక్షిణ ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. ఆ ప్రాంతం మాత్రమే కాదు... అక్కడ జరిగిన మత సదస్సులో పాల్గొని వచ్చిన వారిలోనూ కలవరం రేపుతోంది. ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్‌’గా తేలిన వారిలో చాలామంది ఢిల్లీలో

‘ఢిల్లీ’ దడ!

  • నిజాముద్దీన్‌ నుంచి కరోనా విస్తరణ
  • మార్చి 1 నుంచి మత సమావేశాలు
  • ఇరాన్‌, ఇండొనేషియా నుంచీ రాక
  • 16, 17 తేదీల్లో పాల్గొన్న తెలుగు వారు
  • రెండు రాష్ట్రాల నుంచి 2 వేలమంది!
  • సామూహిక ప్రయాణాలు, బస
  • అక్కడే కరోనాతో కాంటాక్ట్‌లోకి!?
  • రైళ్లలో తిరుగు ప్రయాణం
  • ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌
  • ఆ లక్షణాలతో ఏపీలో ముగ్గురి మృతి
  • తెలంగాణలో ఐదుగురు కూడా..
  • నిజాముద్దీన్‌ ప్రాంతంలో హై అలర్ట్‌
  • ఐసొలేషన్‌కు సుమారు 200 మంది
  • పోలీసుల స్వాధీనంలో మత ప్రచార సంస్థ కార్యాలయం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

దక్షిణ ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. ఆ ప్రాంతం మాత్రమే కాదు... అక్కడ జరిగిన మత సదస్సులో పాల్గొని వచ్చిన వారిలోనూ కలవరం రేపుతోంది. ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్‌’గా తేలిన వారిలో చాలామంది ఢిల్లీలో జరిగిన సదరు మత సదస్సుకు హాజరైన వారే. ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రార్థనా మందిరంలో రెండున్నర రోజులపాటు ఒక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. వీరిలో అత్యధికులు ఈనెల 14-15వ తేదీల్లో తమ ప్రాంతాల నుంచి రైళ్లలో బయలుదేరారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు జరిగిన సదస్సులో పాల్గొన్నారు. 15 నుంచి 20 మందితో కూడిన బృందాలుగా వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించారు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులు కలిసే బస చేశారు. ఆ తర్వాత రైళ్లలో బృందాలుగా వచ్చారు. ఏపీకి చెందిన వారు దురంతో ఎక్స్‌ప్రెస్‌, ఏపీ ఎక్స్‌ప్రె్‌సలలో ప్రయాణించారు.


వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ముగ్గురు మరణించారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు/వారి ద్వారా ఇతరులకు కలిపి ఏడెనిమిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా ప్రకటించారు. సోమవారం తెలంగాణలోనూ ‘ఢిల్లీ కనెక్షన్‌’ ఉన్న వారిలో ఐదుగురు మరణించారు. మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే... ఢిల్లీ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన వారిలో పలువురు ఆ వివరాలు తెలిపేందుకు స్థానికంగా మరిన్ని ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి సమావేశాలు నిర్వహించారు. 


హైదరాబాద్‌ నుంచి 300 మంది!

తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసుల్లో సగం లోకల్‌ కాంటాక్టు వల్లే వస్తున్నాయి. వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో, విదేశాల నుంచి వచ్చిన వాళ్లవి  30 శాతం మాత్రమే ఉంటుండగా, లోకల్‌ కాంటాక్టు ద్వారా 70 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి ఒక ప్రార్థనా మందిరంలోమతపరమైన కార్యక్రమాలకువెళ్లి వచ్చిన వారివల్లే ఎక్కువ కేసులు నమోదవుతుండడం గమనార్హం. ఢిల్లీలో ప్రార్థనలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి దాదాపు 300మంది వెళ్లినట్లు సమాచారం.


వారిలో 150 మంది వివరాలు సేకరించారు. ఖైరతాబాద్‌ నుంచి ఇలా వెళ్లిన ఒకరు.. తీవ్ర అస్వస్థతతో మృతి చెందారు. ఆయన చనిపోయాక పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు తేలింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చాక వైరస్‌ సోకినలక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేస్తే పాజిటివ్‌ వచ్చింది. అతడి నుంచి కుటుంబసభ్యుల్లో నలుగురికి వైరస్‌ సోకింది. దీంతో వైద్యశాఖ అధికారులు ఢిల్లీ ప్రార్థనామందిరం నిర్వాహకులను సంప్రదించి.. ఆ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. 


రెండో స్థానంలో రంగారెడ్డి..

తెలంగాణలో అధిక శాతం కరోనా కేసులు హైదరాబాద్‌లోనే నమోదు అవుతుండగా, తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. తెలంగాణలో ఇప్పటి దాకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4, కరీంనగర్‌లో మూడు, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 6 కుటుంబాలకు చెందిన 17 మంది వైరస్‌ బారిన పడ్డారు. కేవలం ఢిల్లీ వెళ్లడం ద్వారా మూడు కుటుంబాల వారు, తమ కుటుంబ సభ్యులకు వైరస్‌ అంటించారు. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లలో సుమారు 18 వేల మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు ప్రకటించిన వైద్యారోగ్యశాఖ, వాళ్లకు పరీక్షలు మాత్రం చేయించలేదు. ఢిల్లీలో జరిగిన మత సదస్సుకు హాజరైన నేపథ్యం ఉండటంతో... అక్కడే వైర్‌సతో ‘కాంటాక్ట్‌’ అయ్యారనే నిర్ధారణకు వచ్చారు.


ఈ మత సదస్సుకు దేశం నుంచే కాకుండా... ఇరాన్‌, ఇండొనేషియా, ఉజ్బెకిస్థాన్‌, మలేషియా నుంచి కూడా మత పెద్దలు హాజరయ్యారు.  సంస్థ ప్రధాన కార్యాలయంలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు సమావేశాలు జరిగాయని... దీనికి కొనసాగింపుగా భేటీలు జరిగాయని తెలుస్తోంది. ఇందులోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


నిజాముద్దీన్‌లో హైఅలర్ట్‌

ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఒక మతపెద్ద గత వారం శ్రీనగర్‌లో కరోనాతో మరణించారు. ఆ వెంటనే కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నిర్ధారణ అయిన కరోనా కేసుల్లోనూ ‘ఢిల్లీ కనెక్షన్‌’ బయటపడింది. ఇక... ఢిల్లీలోని సదరు మత సమావేశం జరిగిన సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న నిజాముద్దీన్‌ ప్రాంతంలో అనేక మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వీరు కూడా సదరు సమావేశానికి హాజరైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదివారం రాత్రి ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు, పారామిలటరీ బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. 163 మంది అనుమానితులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సదరు సమావేశం జరిగిన ‘మర్కజ్‌ భవంతి’వైపు ఇతరులెవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. 


ఎవ్వరూ బయటికి రాకుండా డ్రోన్లతో నిఘా వేశారు.  కరోనా అనుమానితులను ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా బస్సులను కూడా సిద్ధం చేశారు. పశ్చిమ నిజాముద్దీన్‌, నిజాముద్దీన్‌ బస్తీలో దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు. కాగా,  మర్కజ్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం ఆదేశించారు.

Updated Date - 2020-03-31T08:09:54+05:30 IST