అనకాపల్లిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-06-05T09:37:05+05:30 IST

అనకాపల్లి పట్టణంతోపాటు మండలంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ అనుమానిత లక్షణాలతో ఇప్పటివరకు ..

అనకాపల్లిలో కరోనా కలకలం

రోజురోజుకీ పెరుగుతున్న వైరస్‌ అనుమానిత లక్షణాల బాధితులు

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో 30 మందికి ట్రూనాట్‌ పరీక్షలు

20 మందికి లక్షణాలు ఉండడంతో విశాఖ తరలింపు

ఐదుగురికి పాజిటివ్‌ రిపోర్ట్‌?

నలుగురు పట్టణ వాసులు, మరొకరు తుమ్మపాల వాసి

వివరాలు వెల్లడించని అధికారులు

పెరుగుతున్న కేసులతో స్థానికుల భయాందోళన


అనకాపల్లి టౌన్‌/ తుమ్మపాల/ అనకాపల్లి రూరల్‌, జూన్‌ 4: అనకాపల్లి పట్టణంతోపాటు మండలంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ అనుమానిత లక్షణాలతో ఇప్పటివరకు సుమారు 30 మందిని స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించి, ట్రూనాట్‌ పరీక్షలు చేశారు. వీరిలో 20 మందికి వైరస్‌ లక్షణాలు వున్నట్టు తేలడంతో విశాఖపట్నం పంపారు. అక్కడ మరోసారి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు తెలిసింది. వీరంతా పట్టణంలోని ఒక గృహోపకరణాల దుకాణంలో పనిచేస్తున్నారు. కాగా తుమ్మపాల గ్రామంలోని చినబాబు కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు గురువారం అధికారులు ప్రకటించారు.


ఇతను అనకాపల్లి మెయిన్‌ రోడ్డులోని ఒక మెటల్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. దీంతో ఆ షాపులో పనిచేస్తున్న 15 మందిని వైద్య పరీక్షల నిమిత్తం ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురికి నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్టు మొబైల్‌ ఫోన్లకు సమాచారం వచ్చింది. మిగిలిన వారి రిపోర్టులు శుక్రవారం రావచ్చునని అధికారులు తెలిపారు. అదేవిధంగా అనకాపల్లి మండలం భట్లపూడిలో ఇద్దరు మహిళలకు కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు వున్నట్టు తెలిసింది. గురువారం ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం విశాఖ తరలించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. వీరు అనకాపల్లి చింతావారివీధిలోని దుకాణాల్లో పనిచేస్తున్నట్టు స్థానికులు చెప్పారు. 


అనకాపల్లి పట్టణంలో కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు వున్న కేసులు గురువారం మరింత పెరిగాయి. చింతావారివీధికి చెందిన తండ్రి, కుమారుడికి కరోనా అనుమానిత లక్షణాలు వున్నట్టు ఆదివారం ఎన్టీఆర్‌ వైద్యాలయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. తరువాత వీరిని విశాఖపట్నం తరలించారు. గృహోపకరణాల వ్యాపారం చేస్తున్న వీరి దుకాణంలో పనిచేస్తున్న 15 మంది సిబ్బందిని ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో తొమ్మిది మందికి వైరస్‌ లక్షణాలు వున్నట్టు బుధవారం గుర్తించి విశాఖపట్నం తరలించారు.


గురువారం మరో ఆరుగురికి వైరస్‌ లక్షణాలు వున్నట్టు రిపోర్ట్‌ రావడంతో వారిని కూడా విశాఖ తరలించారు. గృహోపకరణాల షాపునకు సంబంధించి మొత్తం 17 మందికి వైరస్‌ లక్షణాలు వున్నట్టు తేలింది. వీరిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు సమాచారం. అయితే స్థానిక అధికారులు ధ్రువీకరించడం లేదు. కాగా గృహోపకరణాల షాపులో పనిచేస్తున్న వారిలో దిబ్బవీధికి చెందిన యువకుడు ఉన్నాడు. అతని భార్య, తల్లిని కూడా పోలీసులు వైద్యపరీక్షలకు తరలించారు. ఈ యువకుడు గత ఆదివారం స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నట్టు తెలిసింది. ఇతనికి వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు సమాచారం రావడంతో స్నేహితులంతా ఆందోళన చెందుతున్నారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.  


భట్లపూడిలో ఇద్దరు మహిళలకు వైరస్‌ లక్షణాలు

అనకాపల్లి మండలం భట్లపూడి గ్రామంలో ఇద్దరు మహిళలకు కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు వున్నట్టు తెలిసింది. గురువారం ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం విశాఖ తరలించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. వీరు అనకాపల్లి చింతావారివీధిలోని దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరి ద్వారా భట్లపూడిలో ఎంతమందికి కరోనా వైరస్‌ సోకిందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


తుమ్మపాల వ్యక్తికి పాజిటివ్‌

అనకాపల్లి మండలం తుమ్మపాల చినబాబు కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు గురువారం అధికారులు ప్రకటించారు. దీంతో ఈ కాలనీని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి, వీధులన్నింటినీ బారికేడ్లతో మూసేశారు. పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. వీధులను శానిటైజ్‌ చేయించి బ్లీచింగ్‌ చల్లారు. సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులను వైద్య పరీక్షలకు పంపించారు. కాగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి తుమ్మపాల కంచరపేట వీధిలో బంధువులు ఉండడం, అక్కడకు రాకపోకలు సాగించినట్టు తెలియడంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టారు.


తుమ్మపాలలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఎంపీడీవో కార్యాలయంలో పలుశాఖల అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఎం.మురళీమోహన్‌ మాట్లాడుతూ, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటికి 200 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా, మరో 200 మీటర్లను బఫర్‌ జోన్‌గా పరిగణించాలని చెప్పారు.  ఈ సమావేశంలో తహసీల్దార్‌ ప్రసాదరావు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ అంజనేయులు, తుమ్మపాల పీహెచ్‌సీ వైద్యాధికారి ఎన్‌.సుజాత, డీటీ వెంకట్‌ పాల్గొన్నారు.  


ఉమ్మలాడ యువకుడికి పాజిటివ్‌

మునగపాక మండలం ఉమ్మలాడలో యువకునికి (22) కరోనా పాజిటీవ్‌ నిర్ధారణ అయినట్టు తెలిసింది. అనకాపల్లిలో గృహోపకరణాలు విక్రయించే దుకాణంలోనే ఇతను పనిచేస్తున్నాడు. ఈ షాపు యజమానులైన తండ్రీకొడుకుతోపాటు మరో 15 మంది సిబ్బందికి వైరస్‌ లక్షణాలు వున్నట్టు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. వీరిలో ఉమ్మలాడ యువకుడు కూడా ఉన్నాడు. విశాఖ తరలించి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం. కానీ అధికారులు ధ్రువీకరించలేదు. కాగా ఇతని తల్లి, అమ్మమ్మను వైద్య పరీక్షల నిమిత్తం గురువారం సాయంత్రం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. 


మరో నాలుగు కరోనా కేసులు

విశాఖపట్నం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో గురువారం కొత్తగా మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కేసుల సంఖ్య అధికారికంగా 128కి చేరింది. కరోనా పరీక్షలు చేయించుకున్న మరో 1,893 మంది నివేదికలు ఇంకా రావలసి ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు పాజిటివ్‌ కేసులను వెంటవెంటనే ప్రకటించడం లేదు. కొంత సమాచారం మీడియాకు ఇవ్వకుండా దాచిపెడుతున్నారు. అయితే గ్రామాల్లో కరోనా పరీక్షలకు తీసుకువెళుతున్న వారి వివరాలు, వారికి చేసిన పరీక్షలు, వాటి ఫలితాల గురించి బంధువులు స్థానిక మీడియాకు చెబుతున్నారు.

Updated Date - 2020-06-05T09:37:05+05:30 IST