ఎన్నికల వేళ కరోనా కలవరం..

ABN , First Publish Date - 2021-10-14T06:56:52+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పర్వంలో కరోనా కలవరం కలిగిస్తున్నది. మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన క్వారంటైన్‌కు వెళ్లారు.

ఎన్నికల వేళ కరోనా కలవరం..

- మంత్రి గంగులకు పాజిటివ్‌తో నేతల పరీక్షలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పర్వంలో కరోనా కలవరం కలిగిస్తున్నది. మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన క్వారంటైన్‌కు వెళ్లారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌ పాటించాలని మంత్రి సోషల్‌ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు కొద్ది రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు, సన్నిహితంగా మెలిగిన కార్యకర్తలు క్వారంటైన్‌లోకి వెళ్లారు. 

 ఒకే గెస్ట్‌హౌస్‌లో నేతల బస

మంత్రి గంగుల హుజూరాబాద్‌ సమీపంలోని కిట్స్‌ కళాశాలకు చెందిన గెస్ట్‌హౌస్‌లో కొద్ది రోజులుగా బస చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ గెస్ట్‌హౌస్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు కూడా ఉంటున్నారు. హరీశ్‌రావు, ఈశ్వర్‌కు వేర్వేరు గదులు ఉండగా కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు మంత్రి గంగులతో కలిసి ఉంటున్నారు. మంత్రులందరికి వేర్వేరు గదులున్నా అల్పాహారం, భోజనం తీసుకునేది ఒకే డైనింగ్‌హాల్‌లో కనుక అందరూ పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా క్వారంటైన్‌కు వెళ్లగా మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ బుధవారం ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. మంత్రి గంగులతో సన్నిహితంగా మెదిలిన సుమారు 20 మంది నేతలు హుజూరాబాద్‌లో బుధవారం పరీక్షలు నిర్వహించుకున్నారు. మంత్రులు వివిధ గ్రామాల్లో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌,  మరికొందరితో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నందున ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలందరు జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలుంటే అప్రమత్తమవుతున్నారు. వీరేకాకుండా ప్రజల్లో కూడా ఎవరెవరికి వ్యాధి ఉందో తెలిసే అవకాశం లేనందున ప్రచార ఘట్టంలో మరెందరికి కరోనా సోకుతుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. మంత్రికి కరోనా రావడంతో ప్రజలు కూడా అప్రమత్తమై జాగ్రత్త పడుతున్నారు. 





Updated Date - 2021-10-14T06:56:52+05:30 IST