కరోనా కలవరం

ABN , First Publish Date - 2020-07-01T10:26:13+05:30 IST

కరోనా ప్రతాపం చూపుతోంది. ఏ మూల, ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంటుందో తెలియక జనం భయం భయంగా రోజువారి కార్యకలాపాలు సాగిస్తున్నారు.

కరోనా కలవరం

మంగళవారం ఒక్క రోజే 77 కేసులు

జిల్లాలో 1099కి చేరిన బాధితులు

ఏ మూల.. ఎవరి నుంచి ముప్పో..?

భయం.. భయంగా రోజువారి కార్యకలాపాలు


(కడప - ఆంధ్రజ్యోతి):

కరోనా ప్రతాపం చూపుతోంది. ఏ మూల, ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంటుందో తెలియక జనం భయం భయంగా రోజువారి కార్యకలాపాలు సాగిస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే 77 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించారు. వీటితో కలిపి కరోనా బాధితులు 1099కి చేరారు. తాజాగా కడప నగరంలో 37, ప్రొద్దుటూరులో 12, పులివెందులలో 6, బద్వేలులో 3, తొండూరు, సీకే దిన్నెలో రెండేసి కేసులు వచ్చాయి. మైదుకూరు, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, సిద్ధవటం, వీరబల్లి, వేంపల్లి, పెండ్లిమర్రి, వల్లూరు, అట్లూరు, బి.కోడూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఒక్కొక్క కేసు నమోదయింది. కడప నగరంలో వచ్చిన 37 కేసులు ఎర్రముక్కపల్లి, దేవునికడప, నెహ్రూనగర్‌, కో-ఆపరేటివ్‌ కాలనీ, ఎన్జీవోస్‌ కాలనీ, ఇందిరానగర్‌, ఆర్‌కే నగర్‌, సింహపురికాలనీ, బాలాజీ నగర్‌.. ఇలా నగరంలో అన్ని ప్రాంతాల్లో వైరస్‌ విస్తరించిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా కోవిడ్‌-19 ఆస్పత్రి ఫాతిమా మెడికల్‌ కళాశాలలో 25, కోవిడ్‌ సెంటర్‌లో 9 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు. వారికి రూ.2 వేలు చొప్పున అందజేసినట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


వైరస్‌ బారిన 1.63 శాతం

ఇప్పటి దాకా వచ్చిన కరోనా టెస్టింగ్‌ ఫలితాలను పరిశీలిస్తే 1.63 శాతం మంది ప్రజలు వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. కడప రిమ్స్‌లోని వైరాలజీ రీసెర్చ్‌ డయగ్నోస్టిక్‌ ల్యాబ్‌, ట్రూనాట్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 70,864 శాంపుల్స్‌ తీశారు. 67,082 ఫలితాలు వచ్చాయి. 1099 మంది వైరస్‌ బారిన పడ్డారు. అంటే.. వచ్చిన శాంపుల్స్‌ పరీక్ష ఫలితాల్లో 1.63 శాతం ప్రజలకు కరోనా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మంగళవారం హెల్త్‌బులిటెన్‌ ఇచ్చిన సమయానికి 3,782 శాంపుల్స్‌ ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. 1,952 మంది మాత్రమే క్వారంటైన్‌, ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ లెక్కన శాంపుల్స్‌ తీసిన 1,830 మంది బయటే ఉన్నట్లు. వారిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నా.. ముప్పాతిక శాతం బయటే తిరుగుతున్నారు. వారిలో కొందరికైనా పాజిటివ్‌ రావచ్చు అని వైద్య అధికారులే అంటున్నారు. వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదు. స్వాబ్‌ శాంపుల్స్‌ తీసిన అనుమానితులను క్వారంటైన్‌కు తరలించాలని, నెగిటివ్‌ వస్తే అదే రోజు ఇంటికి పంపించాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ఆ..మూడు పట్టణాల్లో...

కడప నగరం, ప్రొద్దుటూరు, పులివెందుల పట్టణాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రొద్దుటూరు పట్టణంలో 231, కడప నగరంలో 194, పులివెందులలో 129 కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వివిధ వ్యాపారాలు, ఆస్పత్రులు తదితర పనుల కోసం ఆయా ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వస్తుంటారు. దీనికితోడు కొందరిలో నిర్లక్ష్యం.. వెరసి వైరస్‌ అదుపులేకుండా వ్యాపిస్తోంది. కట్టడి చేసే దిశగా కఠిన చర్యలు అధికారులు చరర్యలు చేపట్టారు. మాస్క్‌ లేకుండా రోడ్లపైకి వస్తే రూ.300 ఫైన్‌, నిబంధనలు పాటించని వ్యాపారులకు భారీగా ఫైన్లు వేసే ప్లాన్‌ చేస్తున్నామని ఓ అధికారి పేర్కొన్నారు. 


కరోనా భయంతో అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు..అధికారుల చొరవతో అంత్యక్రియలు పూర్తి

పాత కడపకు చెందిన ఓ మహిళా కండక్టర్‌ సోమవారం రిమ్స్‌లో చికిత్స  పొందుతూ మృతి చెందారు. ఈమెకు కరోనా ఉందని సమాచారం. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె బంధువులు మృతదేహాన్ని పాతకడపకు తీసుకొచ్చారు. అయితే అక్కడ అంత్యక్రియలు చేయకూడదంటూ స్థానికులు అడ్డుకున్నారు. ఆమె సొంత గ్రామానికి తీసుకువెళ్లి కార్యక్రమం జరుపుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న చిన్నచౌకు పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడకు చేరుకుని స్థానికులకు సర్దిచెప్పి అంత్యక్రియలు నిర్వహించారు.


ఏ నెలలో ఎన్ని కేసులు

నెల కేసులు

ఏప్రిల్‌ 15

మే 121

జూన్‌ 963

మొత్తం 1099


కరోనా ఆప్‌డెట్స్‌ 

మొత్తం శాంపిల్స్‌ 70,864

రిజల్ట్స్‌ వచ్చినవి 67,082

నెగిటివ్‌ 65,983

పాజిటివ్‌ 1099

ఫలితాలు రావాల్సినవి 3782

30న తీసిని శాంపిల్స్‌ 1,368

డిశ్యార్జి అయిన వారు 436

యాక్టివ్‌ కేసులు 663 

మృతులు 7

Updated Date - 2020-07-01T10:26:13+05:30 IST