ప్రకాశంలో.. కరోనా కలవరం !

ABN , First Publish Date - 2020-03-30T10:14:33+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి..

ప్రకాశంలో.. కరోనా కలవరం !

వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే 

వివరాల సేకరణలో యంత్రాంగం

ఆందోళన కలిగిస్తున్న పాజిటివ్‌ దంపతుల కాంటాక్ట్స్‌

ఇద్దరికీ రిమ్స్‌లో చికిత్స 

చీరాలలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే 

హైరిస్క్‌ జోన్‌గా నవాబుపేట

మూడు కిలోమీటర్ల దూరం కంటెయిన్‌మెంట్‌ జోన్‌

జిల్లాలో 5వేల మందికి  సరిపడా క్వారంటైన్‌ కేంద్రాలు 


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ సమీపంలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన చీరాల నవాబుపేటకు చెందిన ఓ వ్యక్తితోపాటు అతని భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అవే ప్రార్థనలకు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన వారు వెళ్లి వచ్చినట్లు తేలడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఢిల్లీ కనెక్షన్‌పై దృష్టి సారించింది. వివరాల సేకరణలో నిమగ్నమైంది. ఆదివారం జిల్లావ్యాప్తంగా 40 మంది అనుమానితులను గుర్తించి ఒంగోలు రిమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించింది. 


కరోనా కేసులు కొత్తగా నమోదైన నవాబుపేట చట్టుపక్కల మూడు కిలోమీటర్ల దూరం కంటెయిన్మెంట్‌ జోన్‌గా ప్రకటించింది. ఆ ప్రాంతంతోపాటు వృద్ధ దంపతుల కుమారుడు నివాసం ఉండే ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో వైద్య ఆరోగ్య సిబ్బంది పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. జిల్లాలో 5000 మంది క్వారంటైన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గానికి ఒక క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు  చేయాలని ఆదేశించారు. 


జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రజానీకాన్ని కలవరానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో మూడు జిల్లాలో ఉండటం ప్రజల్లో అలజడి రేకెత్తిస్తోంది. మరోవైపు అనుమానిత కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 


రిమ్స్‌కు 40 అనుమానిత కేసులు

జిల్లాలో ఆదివారం ఒక్కరోజే కరోనా అనుమానిత కేసులు 40 వరకూ వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. వారందరినీ అధికారులు ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. చీరాల నుంచి ఆరుగురు, కందుకూరు నుంచి ముగ్గురు, కనిగిరి నుంచి ఏడుగురు, పొదిలి నుంచి ముగ్గురు, ఒంగోలు నుంచి ముగ్గురు, మార్కాపురం నుంచి ఏడుగురుని, కారంచేడు నుంచి ముగ్గురు రిమ్స్‌లోని ఐసోలేషన్‌లో చేర్పించారు. వీరితోపాటు కురిచేడులో ఒకరు, దర్శిలోని ఒకరు కూడా నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చినట్లు గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. అందులో దర్శికి చెందిన యువకుడు ఈనెల 18 నుంచి 29వ తేదీ ఉదయం వరకూ కనిగిరిలో ఒక ప్రార్థనా మందిరంలో ఉన్నట్లు గుర్తించారు. నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చిన అనేక మంది కాల్‌సెంటర్‌ను ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నారు. 


అనుమానిత కేసులు పెరిగే అవకాశం 

ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ రిమ్స్‌కు కేసులు వస్తూనే ఉన్నాయి. వైద్యులు వారి స్వాబ్‌ను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నారు. 108 వాహనాలను కేవలం ఈ కేసులను రిమ్స్‌కు తరలించేందుకే వినియోగిస్తున్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో అనుమానిత కేసులు పెరిగే అవకాశం ఉండటంతో రిమ్స్‌లో మరిన్ని ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేస్తున్నారు. మరిన్ని అంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. 


చీరాల, ఒంగోలులో ఇంటింటి సర్వే

కరోనా కేసులు కొత్తగా నమోదైన చీరాలలో నవాబుపేట, వారి కుమారుడు ఒంగోలులో ఉంటున్న కాలనీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. చీరాల్లో పాజిటివ్‌గా తేలిన దంపతులు ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న వారి కుమారుడి ఇంటికి వచ్చారు. దీంతో ఒంగోలులోనూ అధికారులు ఆదివారం సర్వే నిర్వహించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. 


యంత్రాంగం అప్రమత్తం

జిల్లాలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం, అనుమానిత కేసులు పెరగడంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రత్యేక చర్యలకు ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన నవాబుపేట ప్రాంతాన్ని అధికారులు కంటెయిన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అక్కడ పారిశుధ్య పనులు చేపట్టారు. మూడు కిలో మీటర్ల పరిధిలోని ఇళ్లలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే దిశగా సర్వే చేపట్టారు. ఇక నవాబుపేటను జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరాన్ని అధికారులు కంటెయిన్‌మెంటు ప్రాంతంగా ప్రకటించారు. 


ఢిల్లీ కనెక్షన్‌పై దృష్టి 

కరోనా పాజిటివ్‌గా తేలిన భార్యాభర్తల్లో భర్త ఢిల్లీ దగ్గర ఉన్న నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లాడు. ఈనెల 18న ఆయన తిరిగి వచ్చాడు. ఆయనతోపాటు ఇతని భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అసలు జిల్లా నుంచి నిజాముద్దీన్‌తో ఎంత మంది వెళ్లారు అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అందిన సమాచారం మేరకు నిజాముద్దీన్‌ వెళ్లిన వారిలో జిల్లాలోని అన్ని ప్రాంతాల వారూ ఉన్నారు. అయితే నిజాముద్దీన్‌ నుంచి తిరిగి వచ్చిన చీరాల వృద్ధుడు ఆతర్వాత చీరాల, ఒంగోలు తదితర ప్రాంతాల్లో పలు వేడుకల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారు.


నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చిన వారి ఇళ్లకు రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి విచారిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అనుమానం ఉంటే వెంటనే రిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నారు. చీరాల నవాబ్‌పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్‌ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వారి కాంటాక్ట్స్‌ ఆందోళన కలిగిస్తున్నాయి. వారితోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు 280 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో 200 మంది, చీరాలలో 80 మంది దిగినట్లు తెలుస్తోంది. 


రిమ్స్‌లో కరోనా కేసులకే ప్రాధాన్యం

కరోనా అనుమానితులు పెరుగుతుండటంతో రిమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని వార్డులను కరోనా రోగుల కోసమే సిద్ధం చేస్తున్నారు. ఆసుపత్రిలో సాధారణ సేవలను వారం క్రితమే నిలిపివేశారు. దీంతో వార్డుల్లో ఉన్న సాధారణ రోగులు వెళ్లిపోయారు. దీంతో కరోనా రోగుల కోసమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 80 ప్రత్యేక గదులను సిద్ధం చేశారు. అంతకంటే ఎక్కువ మంది వస్తే ఇతర వార్డుల్లో వారిని సర్దుబాటు చేసే చర్యలు చేపట్టారు. 


నిలకడగా పాజిటివ్‌ రోగుల ఆరోగ్యం

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన దంపతుల ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇద్దరూ వృద్ధులు కావడం,  వైరస్‌ వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  పది రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయిన ఒంగోలు జడ్పీ కాలనీకి చెందిన యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. అతని నుంచి ఆదివారం స్వాబ్‌ తీసి తదుపరి పరీక్షల కోసం విజయవాడకు పంపించారు.  ఫలితాలు వచ్చిన వెంటనే అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు. 


ఆందోళన కలిగిస్తున్న కాంటాక్ట్స్‌

జిల్లాలో కరోనా పాజిటివ్‌గా తేలిన వారి కాంటాక్ట్స్‌ అందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 12న జిల్లా నుంచి సుమారు 280 మంది ఢిల్లీ వెళ్లారు. వారు ఈనెల 17, 18 తేదీల్లో తిరిగి జిల్లాకు వచ్చారు. జీటీ, నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో వారు ప్రయాణించారు. చీరాలలో 80 మంది, ఒంగోలు రైల్వే స్టేషన్‌లో 200 మంది దిగి వారి వారి ఊళ్లకు వెళ్ళారు. ప్రస్తుతం అటు తెలంగాణలో కూడా నిజాముద్దీన్‌ వెళ్ళి వచ్చిన వారికే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వారిలో ఒకరు మృతి చెందారు. చీరాల్లోని వృద్ధ దంపతుల్లో భర్త నిజాముద్దీన్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే అతనిలో, అతని భార్యలో ఈ లక్షణాలు కనిపించాయి. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ వెళ్లి వారి వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. 


హైరిస్క్‌ జోన్‌గా నవాబుపేట

చీరాల : చీరాల మండలం సాల్మన్‌ సెంటర్‌ పంచాయతీ పరిధిలోని నవాబుపేటకు చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి నివాసం నుంచి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని హైరిస్క్‌ జోన్‌గా ప్రకటించారు. నవాబుపేటకు 3 కి.మీ దూరంలో ఉన్న చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులు, చీరాల మండలంలోని జాండ్రపేట, రామకృష్ణాపురం, సాల్మన్‌ సెంటర్‌ పంచాయతీలను కంటైన్మెంట్‌ జోన్‌గా విభజించారు. నవాబు పేటలో 40 ప్రత్యేక బృందాలు సర్వే ప్రారంభించాయి. ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేసుకుంటున్నాయి. అనారోగ్యంగా ఉన్నవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, పాజిటివ్‌ వచ్చిన భార్యాభర్తలతో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇతరులెవ్వరినీ నవాబుపేటలోకి అనుమతించటం లేదు. గ్రామ ప్రధాన రహదారుల వద్ద కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. పారిశుధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్వే పూర్తయ్యాక ఎంత మందిని క్వారంటైన్‌కు పంపాలి. ఎందరిని ఐసోలేషన్‌కు పంపాలన్న విషయం తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2020-03-30T10:14:33+05:30 IST