కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-05-08T05:08:50+05:30 IST

కరోనా జిల్లావాసులను రోజురోజుకు ఆందోళనకు గురిచేస్తున్నది. నిన్నమొన్నటి వరకు కలిసి మాట్లాడిన వారు పిట్టల్లారాలిపోతుంటే కళ్ల ముందు ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. లక్షణాలు లేకుండానే విజృంభిస్తున్న వ్యాధి పట్టణంలోనేకాకుండా పల్లెలకు కూడా పాకి జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నది.

కరోనా కలవరం

 స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న ప్రజలు 

 15 వరకు హోల్‌సేల్‌ గార్మెంట్స్‌ వ్యాపారుల బంద్‌

 నేటి నుంచి సెకండ్‌ డోస్‌ వారికే వ్యాక్సినేషన్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా జిల్లావాసులను రోజురోజుకు ఆందోళనకు గురిచేస్తున్నది. నిన్నమొన్నటి వరకు కలిసి మాట్లాడిన వారు పిట్టల్లారాలిపోతుంటే కళ్ల ముందు ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. లక్షణాలు లేకుండానే విజృంభిస్తున్న వ్యాధి పట్టణంలోనేకాకుండా పల్లెలకు కూడా పాకి జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నది. 

రోజురోజుకు పెరుగుతున్న మరణాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగానే ఎవరికివారు లాక్‌డౌన్‌ విధించుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత మార్చి 18 నుంచి క్రమేపి జిల్లా అంతటా విస్తరిస్తూ వస్తున్నది. మొద ట జిల్లా కేంద్రానికి, జన సంద్రాత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోకి వ్యాపించిన వ్యాధి అన్ని గ్రామపంచాయతీలకు పాకింది. అన్నీ గ్రామాల్లోనూ వ్యాధి పీడితులు ఉండడంతో బయటకి వెళితే ఏమవుతుందోనన్న ఆందోళనకు ప్రజలు గురువుతున్నారు. 


రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివిటీ రేటు


జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,12,742 మందికి కరోనా పరీక్షలు నిరహించారు. వీరిలో 14,707 మంది కి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. పరీక్షలు చేయించుకున్నవారిలో 13.1శాతం మంది వ్యాధి బారినపడ్డారు. 50 రోజుల సగటు పాజిటివ్‌ శాతం ఇలా ఉండగా మే నెలలో మాత్రం ప్రతిరోజూ పరీక్షలు చేయించుకున్న వారిలో 30 శాతానికిపైగా మంది వ్యాధిబారినపడుతున్నట్లు నిర్ధారణ అవుతున్నది. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి 212 మంది మృత్యువాతపడ్డారని స్థానికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో, సీటీ స్కాన్‌లో రోగ నిర్ధారణ అవుతున్న వారి సంఖ్య తెలి సే అవకాశం లేకపోవడంతో జిల్లాలో ఎంత మంది వైరస్‌ బారినపడ్డారన్న విషయం పూర్తి స్పష్టత లేకుండా పోతున్నది. సుమారు 20వేల మందికిపైగా ఈ 50 రోజుల్లో వ్యాధికి గురయ్యారని అంచనా వేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి గతంతో పోల్చితే రెట్టింపును మించి ఉండడంతో బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కరోనా అనంతరం తలెత్తుతున్న సమస్యలతో చనిపోతున్నవారు కొందరైతే, సీటీస్కాన్‌ నిర్ధారణతో ఇళ్లలోనే చికిత్స తీసుకుంటూ  తీవ్రత పెరిగిన తర్వాత చనిపోతున్నవారు మరికొందరు ఉంటున్నారు. అలాంటి వారి మరణా లు కరోనా మరణాలుగా నమోదు కాకుండా పోతున్నాయి. ఆసుపత్రుల్లో చనిపోతున్నవారిలో కూడా కరోనా సోకినా ఇతర సమస్యల కారణంగా మృత్యువాతపడుతున్నారని కూడా పేర్కొంటున్నారు. దీంతో మృతుల సంఖ్య సగానికి తగ్గి అధికారిక సమాచారంలో వెల్లడవుతున్నది. మొదటి విడతతో పోలిస్తే మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉన్నది. 


ఎవరికి వారే జాగ్రత్తలు 


ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించేది లేదని తేల్చిచెప్పడంలో ప్రజలే స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో, గ్రా మాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ విధించుకొని వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తుండగా తాజాగా కరీంనగర్‌లో హోల్‌సేల్‌ గార్మెంట్స్‌ వ్యాపారులు ఈనెల 15 వరకు సెల్ఫ్‌లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. 

ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు హోల్‌సేల్‌ వస్త్ర దుకాణాలను మూసివేస్తామని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి లాక్‌డౌన్‌ను కొనసాగించేది లేనిది నిర్ణయించుకుంటామని ఆ వ్యాపార సంఘం ప్రకటించింది. జిల్లా కేంద్రంలో ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి అనుబంధంగా పనిచేసే డాక్యుమెంట్‌ రైటర్లందరూ 15 రోజులపాటు ఈనెల 23వరకు తమ పనిని నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లా కేంద్ర రిజిస్ట్రేషన్‌ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోనున్నది. వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాలు కూడా పరిమిత సమయంలో మాత్రమే దుకాణాలు తెరచి ఉంచాలని, కొద్దిరోజులపాటు సెల్ఫ్‌లాక్‌డౌన్‌ విధించుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొత్తపల్లి మున్సిపల్‌ పరిధిలో ఉదయం ఏడు నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరచి ఉంచి ఆ తర్వాత లాక్‌డౌన్‌ను విధించుకున్నారు. జూబ్లీనగర్‌తోపాటు మరికొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం వరకు మాత్రమే షాపులను తెరచి ఉంచి ఆ తర్వాత మూసివేయాలని, ప్రజ లు కూడా బయటకు రావద్దని ఆయా గ్రామపంచాయతీలు ఆంక్షలను విధించాయి. ఆంక్షలను ఉల్లంఘి స్తే జరిమానాతోపాటు పంచాయతీ తీసుకునేనిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని హెచ్చరించాయి. 


జిల్లాలో 11 మంది మృతి..503 మందికి పాజిటివ్‌ 


జిల్లాలో శుక్రవారం కరోనాబారిన పడి 11 మంది మరణించారు. కరీంనగర్‌ హనుమాన్‌నగర్‌లో ఒకరు, ఆరెపల్లిలో మరొకరు మరణించగా వీణవంక మండలం అచ్చంపల్లిలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు కరోనాబారిన పడి మరణించ డం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చొప్పదండి మండల కేంద్రంలో ముగ్గురు, గంగాధర మండలంలో ఇద్దరు, శంకరపట్నం మండలంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. జిల్లావ్యాప్తంగా 1,481 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 503 మందికి వ్యాధిసోకినట్లు తే లింది. కరీంనగర్‌లో 602 మంది పరీక్షలు చేయించుకోగా వారిలో 181 మందికి పాజిటివ్‌ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 879 మంది పరీక్షలు చేయించుకోగా 322 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.  


వ్యాక్సినేషన్‌కు పరిమితులు 


రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత కారణంగా శనివారం నుంచి కేవలం సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేష న్‌ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీం తో ఫస్ట్‌ డోస్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ కోసం యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని స్లాట్‌ బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేసిన ప్రభుత్వం తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. 

Updated Date - 2021-05-08T05:08:50+05:30 IST