దూరాన్ని కరోనా శాశ్వతీకరించలేదు

ABN , First Publish Date - 2020-06-04T06:12:13+05:30 IST

దూరం ఎలాంటిదైనా దుర్భరమైనదే. సంఘజీవులైన మానవుల మధ్య అసహజమైన సామాజిక దూరం పాటించాల్సి రావటం అసౌకర్యమే. కానీ కరోనాలాంటి ప్రాణాంతక అంటువ్యాధిని దూరం చేయటానికి, రోగనివారణా చర్యగా సామాజిక దూరాన్ని పాటించక తప్పనప్పుడు...

దూరాన్ని కరోనా శాశ్వతీకరించలేదు

మనం పోరాడాల్సింది కరోనాను దూరం చేయటానికి విధించిన దూరాల ఆంక్షల మీద కాదు. అందుకు ఉపయోగించే భాష మీదా కాదు. కరోనా అంటువ్యాధి మీద. జ్వరం వచ్చినపుడు తాత్కాలికంగా లంకణం ఉండాల్సివచ్చినా జ్వరం తగ్గినాక లంకణంతో పనిలేనట్లే, కరోనా వైరస్‌కి వాక్సిన్‌ కనుగొన్నాక ఎవరూ ఎలాంటి దూరాన్ని పాటించాల్సిన అవసరంలేదు. అన్ని దూరాలూ వాటంతటవే అదృశ్యమైపోయి క్రమక్రమంగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. తిరిగి తమ ఆత్మీయ మానవ సంబంధాల్ని పునరుద్ధరించుకొని ప్రపంచ మానవాళి తమని తాము ఆప్యాయంగా ఆలింగనం చేసుకొంటుంది. కరస్పర్శతో కరచాలనం చేసుకొంటుంది.


దూరం ఎలాంటిదైనా దుర్భరమైనదే. సంఘజీవులైన మానవుల మధ్య అసహజమైన సామాజిక దూరం పాటించాల్సి రావటం అసౌకర్యమే. కానీ కరోనాలాంటి ప్రాణాంతక అంటువ్యాధిని దూరం చేయటానికి, రోగనివారణా చర్యగా సామాజిక దూరాన్ని పాటించక తప్పనప్పుడు అది తప్పని ‘సరైన’ చర్యే అవుతుంది. ఏ కారణంచేత అలాంటి చర్య అవసరమైందో ఆ కార్యకారణ సంబంధాన్ని బట్టి దాని స్వభావం ఆధారపడి వుంటుంది. కనుక అన్ని దూరాలనీ ఒకే గాటన కట్టి, ఒకే రకంగా తప్పుపట్టలేం.


కానీ ఇప్పుడు కరోనా కారణంగా పాటిస్తున్న దూరాల మీద వివాదం నడుస్తోంది. మొదట ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినట్లుగా ‘సామాజికదూరం’ అనేపదం వాడరాదనీ, బదులుగా ‘వ్యక్తిగత దూరం’, ‘భౌతికదూరం’ అనే పదాలను ఉపయోగించాలనీ వాదన వినిపిస్తోంది. నిజానికి మనం పోరాడల్సింది కరోనాను దూరం చేయటానికి విధించిన దూరాల ఆంక్షల మీద కాదు. అందుకు ఉపయోగించే భాష మీదా కాదు. కరోనా అంటువ్యాధి మీద. వ్యక్తి, కుటుంబం, సమాజం అనే మూడంచెల మానవ సంబంధాల రీత్యా వాటి మధ్య ఏర్పడే సంబంధ బాంధవ్యాలు విభిన్నంగా వుంటాయి. వాటి మధ్య నెలకొన్న దూరాలు కూడా అలాగే వుంటాయి. అందువల్ల ఒక పదానికి బదులుగా మరొక పదాన్ని వాడటానికి అవి ఒకదానికొకటి పర్యాయపదాలు కావు. కరోనా కారణంగా ఉత్పన్నమైన ఆపత్కాల స్థితిలో, వైవిధ్యంతో కూడిన వివిధ దూరాల వివిధత్వం గురించి విడమర్చి చెప్పకుండా, అందుకవసరమైన పదాలను వాడకుండా, ఆయా దూరాలనుబట్టి పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఏకరువు పెట్టలేం.


కనుక ఈ ఆపత్కాల సమయంలో తాత్కాలికంగా ప్రపంచ మానవాళి పాటిస్తున్న పలు దూరాల ఆంక్షలన్నీ కరోనా నుండి ప్రాణరక్షణ కోసం పాటించేవే గనుక వీటిని ‘సంరక్షణ దూరాలు’గా భావించటం భావ్యంగా వుంటుంది. ‘ఎరుపంటే కాదు అపాయం - అది అపాయాన్ని తప్పించే ఒక సదుపాయం’ అని ఓ విప్లవ కవి అన్నట్లు, రెడ్‌ సిగ్నల్‌ చూసి ఆగకుండా మూర్ఖంగా జీబ్రాలైన్‌ క్రాస్‌ చేస్తే ప్రమాదంలో పడతారని ఎరుపు హెచ్చరిస్తుంది. కరోనా దూరం కూడా అంతే. కనుక ఈ వివాదాన్ని కట్టిపెట్టి కరోనాను అరికట్టటంపై దృష్టిపెడదాం. 


అయితే ఈ రియాలిటీతో, ప్రాక్టీకాలిటీతో నిమిత్తం లేకుండా ‘సామాజిక దూరం’ అనే పదం తమ మనోభావాల్ని దెబ్బతీస్తుందని దళితబహుజన సామాజిక శ్రేణులవారేమో సెంటిమెంటుగా ఆలోచిస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణీయ అధిపత్యకులావారేమో తాము పాటిస్తున్న అస్పృశ్య సామాజిక దూరాన్ని, కరోనా సామాజిక దూరాన్ని ఒకేగాట కట్టి మసిబూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. మనువాదాన్ని పునరుద్ధరించాలని చూస్తున్న ఈ నియోబ్రాహ్మణిజం నిర్వాకాన్ని ఏ మాత్రం ఖండించకుండా కొంతమంది అగ్రవర్గ మార్కిస్టు బుద్ధిజీవులేమో, కరోనా లక్షణాలతో నియోలిబరలిజం లక్షణాలకు పోలికవుందంటూ ఆ రెండింటినీ ఒకేగటకట్టి గందరగోళం సృష్టిస్తున్నారు.


నియోలిబరలిజం సృష్టించిన గ్లోబలైజేషన్‌ వలన ప్రపంచమే కుగ్రామమై మానవాళి దగ్గరవుతున్న వేళ కరోనావల్ల వారంతా భయపడిపడి ఒకరికొకరు దూరమవుతున్నారనీ, ప్రపంచీకరణ వలన పెట్టుబడి ప్రపంచమంతటా విస్తరించినట్లే దాని ఆసరాతో కరోనా కూడా ప్రపంచమంతటా వ్యాపించిందనీ కొందరు యాంత్రిక విశ్లేషణలు చేస్తున్నారు. కరోనా ప్రపంచవ్యాప్తికి ప్రపంచీకరణ ఓ వాహకంగా ఉపయోగపడి ఉండొచ్చు. కానీ స్వయంగా దానికి ప్రపంచమంతటా వ్యాపించే మహమ్మారి స్వభావం లేకుండా కేవలం ప్రపంచీకరణ వల్లనే అది వ్యాపించదు. వేరే అంటువ్యాధులు అలా వ్యాపించలేకపోవటమే అందుకు నిదర్శనం.


అలాగే, మరికొందరు, సత్యానంతరకాలంలో భాష కూడా దుర్వినియోగానికి గురవుతున్నదనీ, భౌతిక దూరాన్ని సామాజిక దూరం అనటం, అందరూ ఆ పదాన్నే వాడాలనటం నియోలిబరలిజం భావజాలవ్యాప్తికి సరిగ్గా ఉపయోగపడుతుందనీ అంటున్నారు. ప్రపంచ మానవాళి ప్రాణ రక్షణకు ఉపయోగపడే సంరక్షణ స్వభావం కలిగిన సామాజిక దూరాన్ని నియోలిబరలిజం పెట్టుబడిదారీ వ్యవస్థ తన దోపిడివర్గ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తుండవచ్చు. కాదనలేం. కానీ అది ఒక పాక్షిక పార్శ్యం మాత్రమే. అందువల్ల పిడికెడుమంది స్వార్థపరుల దుర్వినియోగ స్వభావాన్నే సామాజిక దూరాన్ని సద్వినియోగం చేసుకొంటున్న ప్రపంచ మానవాళికి అంతటికీ ఆపాదించటం ఆక్షేపణీయం. పాలలోనీళ్లు కలిపే కల్తీ వ్యాపారుల దుర్వినియోగాన్ని తప్పుపట్టే పేరిట అసలు పాల వినియోగాన్నే తప్పుపట్టటం ఎలాంటిదో ఇదీ అలాంటిదే. 


అలాగే, పనికిమానలినదన్న బ్రాహ్మణాచారమే మానవాళికి నేడు మకుటమైంది అంటూ సామాజిక దూరాన్నీ అస్పృశ్యతా దూరాన్నీ ఒకే గాటన కట్టి పొంతలేని పోలికలతో మరికొందరు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏ కారణం చేత ఏ దూరం పాటిస్తారన్న కార్యాకారణ సంబంధాన్నిబట్టి దాని స్వభావం ఆధారపడి వుంటుందని ముందు చెప్పాను. కరోనా వల్ల పాటించే సామాజిక దూరం సానుకూలమైన సంరక్షణ దూరమవుతుంది. మరి ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న మనుధర్మతత్వం కల్పించిన అస్పృశ్య సామాజిక దూరం దేనిని రక్షిస్తుంది? ఎవరిని రక్షిస్తుంది? దానికి ఏ రకమైన విలువ ఉంది? అనే ప్రశ్నలకు సమాధానం రాబడితే ఈ వాదనల బండారం బైటపడుతుంది. 


మానవహక్కులను నిరాకరించే ఈ వివక్షాపూరిత అమానుష, అస్పృశ్య దుష్ట సాంప్రదాయాన్ని భాతరదేశ రాజ్యాంగం శిక్షార్హమైన నేరపూరిత సామాజిక దూరంగా పరిగణించి నిషేధించింది. ఈ అస్పృశ్య దూరంలో మానవహక్కుల నిరాకరణ ఇమిడివున్నందునే ‘ఐక్యరాజ్య సమితి’కి చెందిన అంతర్జాతీయ మానవహక్కుల వేదిక (దక్షిణాఫ్రికా డర్బన్‌ సమావేశంలో) అభిశంసించింది. అయినాసరే నిస్సిగ్గుగా బ్రాహ్మణీయ దుష్ట సంస్కృతినే భారతీయ విశిష్ట సంస్కృతిగా శ్లాఘించటమేగాగ, కరోనా సంక్షోభ సమయంలో విశ్వానికే అది ప్రాణబిక్ష పెట్టిందని ప్రగల్భాలు పలుకుతూ అంతర్జాతీయంగా భారతదేశ పరువుప్రతిష్టలని అప్రదిష్టపాలు చేస్తున్నారు. 


జ్వరం వచ్చినపుడు తాత్కాలికంగా లంకణం ఉండాల్సివచ్చినా జ్వరం తగ్గినాక లంకణంతో పనిలేనట్లే, కరోనా వైరస్‌కి వాక్సిన్‌ కనుగొన్నాక ఎవరూ ఎలాంటి దూరాన్ని పాటించాల్సిన అవసరంలేదు. అన్ని దూరాలూ వాటంతటవే అదృశ్యమైపోయి క్రమక్రమంగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. తిరిగి తమ ఆత్మీయ మానవ సంబంధాల్ని పునరుద్ధరించుకొని ప్రపంచ మానవాళి తమని తాము ఆప్యాయంగా ఆలింగనం చేసుకొంటుంది. కరస్పర్శతో కరచాలనం చేసుకొంటుంది. ప్రకృతిని జయించిన మానవులుగా, వికృతమైన ప్రపంచ మహమ్మారి కరోనాని కూడా జయించగలం. మానవులు సంఘజీవులనే శాశ్వత సత్యాన్ని మరోసారి ఆవిష్కరించగలం. సత్యమేవజయతే.

ఉ.సా

Updated Date - 2020-06-04T06:12:13+05:30 IST