సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-03-31T08:14:04+05:30 IST

సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రాకరోనాపై భారత్‌ జరుపుతున్న పోరులో హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌

సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

  • రోజుకు 750 టెస్టులు చేసే సామర్థ్యం
  • వారంలోగా కొవిడ్‌-19 ఆర్‌ఎన్‌ఏ విశ్లేషణ
  • ఎండ పెరిగితే వైరస్‌ వ్యాప్తి తగ్గదు
  • మహమ్మారి కట్టడిలో తెలంగాణ భేష్‌
  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా


సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రాకరోనాపై భారత్‌ జరుపుతున్న పోరులో హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) నేనుసైతం అంటూ పాల్గొంటోంది. ఆ సంస్థలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు సోమవారం(మార్చి 30) నుంచి ప్రారంభమయ్యాయి. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొనడంపై ఇక్కడి శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. దీంతోపాటు కరోనా పీచమణిచే కొత్త మందులను కనుగొనడానికి దోహదపడే పరిశోధనలూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ డైరెక్టర్‌  డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.



కరోనాపై పోరులో సీసీఎంబీ పాత్ర ఏమిటి?

కరోనా నిర్ధారణ పరీక్షలను సీసీఎంబీ ఇప్పటికే ప్రారంభించింది. దీంతోపాటు ఆ వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొని, దానిలో వస్తున్న మార్పులను గుర్తించడానికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నాం. జన్యుక్రమం కనుగొనగానే దాని ఆధారంగా.. వైర్‌సపై ఏయే మందులు పనిచేస్తాయో తెలుసుకుంటాం. 


రోజుకు ఎన్ని నిర్ధారణ పరీక్షలు చేయగలరు?

ప్రస్తుతానికి రోజుకు 750దాకా పరీక్షలు చేయగలం. హైదరాబాద్‌లోనే ఉన్న సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎ్‌ఫడీ) లాంటి పరిశోధనా సంస్థల సహకారం లభిస్తే వెయ్యి దాకా నిర్ధారణ పరీక్షలు చేయొచ్చు. దీంతోపాటు అతిచౌక కరోనా పరీక్షల కిట్‌ల అభివృద్ధికి మేం ప్రయత్నాలు మొదలుపెట్టాం. మేం తయారుచేయనున్న కిట్ల రేటు చాలా తక్కువ. 


వైరస్‌ జన్యుక్రమంపై  ఏ పరిశోధనలు చేస్తున్నారు?

హైదరాబాద్‌లో చికిత్సపొందిన కరోనా పాజిటివ్‌ కేసుల నుంచి వైరస్‌ నమూనాలను సేకరించి, వాటిపై పరిశోధనలు ప్రారంభించాం. వారం రోజుల్లోగా ఈ వైర్‌సల ఆర్‌ఎన్‌ఏ విశ్లేషణ చేయగలుగుతాం. ఆ ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వైర్‌సను ఎలా ఎదుర్కోవచ్చనే విషయంపై స్పష్టత వస్తుంది. 


విరుగుడు మందుకు ఏ పరిశోధనలు చేస్తున్నారు? 

మాకు మందులు తయారుచేసే సామర్థ్యం లేదు. కానీ మానవుల నుంచి సేకరించిన కణాలపై ప్రయోగశాలలో కరోనా వైర్‌సను ప్రయోగించి, వాటికి అందుబాటులో ఉన్న మందులను ఇస్తాం. దీనికి శరీర కణాలు ఎలా స్పందిస్తున్నాయో కనుగొంటాం.ఉదాహరణకు కొవిడ్‌-19 కట్టడికి ఒక ఔషధం పనిచేస్తోందనుకుందాం. ఆ మందును ఇతర ప్రయోగశాలలు, కంపెనీల భాగస్వామ్యంతో తయారుచేస్తాం.  


కొవిడ్‌-19లో ఎలాంటి మార్పులు జరిగిఉండొచ్చు? 

వైరస్‌ జన్యువుల్లో మార్పులు జరగడమనేది ఒక నిరంతర ప్రక్రియ. అలాగే కొవిడ్‌-19 వైర్‌సలోనూ కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి కూడా. వైర్‌సలో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయం ఆర్‌ఎన్‌ఏ విశ్లేషణ తర్వాతే తెలుస్తుంది. అయితే ఏ వైరస్‌ అయినా కాలంతోపాటు బలపడుతుంది తప్ప బలహీనపడదు. 


ఎండలు పెరిగితే కరోనా వ్యాప్తి తగ్గుతుందా?  

దీనిపై వచ్చిన నివేదికలను నేను కూడా చూశా. అయితే ఇవన్నీ పరిశోధనా శాలల్లో కట్టుదిట్టమైన పరిస్థితుల్లో చేసిన పరిశోధనలు. మరిన్ని అధ్యయనాలు జరిగితే తప్ప ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం.


కరోనాపై పోరాడే శక్తి భారతీయులకు జన్యుపరంగా ఉందని ఓ నివేదికలో ప్రస్తావించారు. నిజమేనా?

ఈ పరిశోధనాపత్రాన్ని నేను కూడా చూశా. ఆ పరిశోధకులు రెండు ఆర్‌ఎన్‌ఏ నమూనాల ఆధారంగా ఈ ప్రతిపాదన చేశారు. కొన్ని సమూహాల ప్రజలకు ఈ వైరస్‌ను తట్టుకొనే సామర్థ్యం ఉండొచ్చు. దీనిపై ఇంకా సమీక్ష (పీర్‌ రివ్యూ) జరగాల్సి ఉంది.  


కరోనా వేగంగా వ్యాపించడానికి కారణమేమిటి?

ప్రతి వైర్‌సకు ఒక రిసిప్టర్‌  ఉంటుంది. దీని ద్వారానే వైరస్‌ శరీర కణాల్లోకి ప్రవేశిస్తుంది. కరోనా వైరస్‌ రిసిప్టర్‌ మిగిలిన వాటి కంటే చాలా భిన్నంగా ఉండటంతో దీన్ని మన శరీర కణాల్లో ఉండే రిసిప్టర్‌లు అడ్డుకోవు. అందువల్లే ఈ వైరస్‌ చాలా వేగంగా వ్యాపిస్తోంది. 


తెలంగాణ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ తరఫున ఎలాంటి సలహాలిచ్చారు ? 

2 ముఖ్యమైన ప్రతిపాదనలు చేశాం. వీటిలో మొదటిది హెల్త్‌ వర్కర్స్‌కు అవసరమైన సామగ్రిని సమకూర్చడం. కరోనాపై అవగాహన కల్పించే సందేశాలను వీలైనంత ఎక్కువ ప్రజలకు పంపమని కోరాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కట్టడికి తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి.

స్పెషల్‌ డెస్క్‌ 

Updated Date - 2020-03-31T08:14:04+05:30 IST