హైదరాబాద్‌లో అత్యధికంగా రోజువారీ కరోనా టెస్టుల సగటు

ABN , First Publish Date - 2020-09-24T09:34:59+05:30 IST

: రాష్ట్రంలో రోజువారీ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాల్లో నిర్వహిస్తుండగా, అత్యల్ప టెస్టులు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్నట్లు కేంద్రం తెలిపింది..

హైదరాబాద్‌లో అత్యధికంగా రోజువారీ కరోనా టెస్టుల సగటు

భూపాలపల్లిలో అత్యల్పం.. 6 జిల్లాల్లోనే రోజూ వెయ్యి టెస్టులు 

కేంద్ర ప్రభుత్వం వెల్లడి


హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజువారీ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాల్లో నిర్వహిస్తుండగా, అత్యల్ప టెస్టులు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో బుధవారం పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. దేశవ్యాప్తంగా ఆగస్టులో అన్ని జిల్లాల్లో చేసిన మొత్తం టెస్టులు, ఒకరోజుకు చేసిన సగటు టెస్టుల వివరాలు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో హైదరాబాద్‌ జిల్లాలో రోజుకు సగటున 8,091 టెస్టులు చేస్తుండగా, అతి తక్కువగా భూపాలపల్లి జిల్లాల్లో రోజుకు 137 కరోనా నిర్ధారణ పరీక్షలే చేస్తున్నారు. హైదరాబాద్‌ తర్వాత రంగారెడ్డిలో ఒకరోజుకు 2,921, మేడ్చల్‌లో 2,057 టెస్టులు చేస్తుండగా, రోజుకు వేయికి మించి టెస్టులు చేస్తున్న  జిల్లాలు సిద్దిపేట-1034, నిజామాబాద్‌-1013, వరంగల్‌ అర్బన్‌-1134 ఉన్నాయి. ఇక రోజుకు వందకు పైగా కేసులు నమోదు అవుతున్న నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లోనూ రోజుకు కనీసం వెయ్యి టెస్టులు కూడా చేయడం లేదని కేంద్రం వెల్లడించింది. ఇక పరీక్షలు కూడా హైదరాబాద్‌లో అత్యధికంగా చేయగా, ఆ తర్వాత వరుసగా రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో నిలిచాయి. ఎక్కువ కేసులు వస్తున్న ఖమ్మం జిల్లాల్లో ఆగస్టులో కనీసం 20 వేల టెస్టులు కూడా చేయకపోవడం గమనార్హం. 


ఆగస్టులో అత్యధిక కేసులు నమోదు 

ఆగస్టు మాసంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉండడమే కాకుండా గత ఆరు మాసాల్లో అత్యధిక కేసులు ఆ నెలలోనే నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం ఆగస్టు 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,65,253 పరీక్షలు నిర్వహించారు. అందులో 62,070 పాజిటివ్‌లు వచ్చాయి. పాజిటివ్‌ రేటు 6.43 శాతంగా నమోదైంది. ఆ మాసంలో ఏకంగా 307 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఒక రకంగా కరోనా కేసుల్లో ఆగస్టు మాసం రికార్డు సృష్టించింది. ఈ స్థాయిలో కేసులు, మరణాలు రాష్ట్రంలో తొలి కేసు నమోదైన మార్చి 2 నుంచి ఏ నెలలలోనూ నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు మాసంలో 9,65,253 టెస్టులు చేసినట్లు హెల్త్‌ బులిటెన్‌ ద్వారా వెల్లడించగా, కేంద్రం వెల్లడించిన లెక్కల్లో మాత్రం ఆ మాసంలో కేవలం 8,62,556 టెస్టులు చేసినట్లు తెలిపింది. అంటే రెండింటి మధ్య 1,02,697 వ్యత్యాసం కనిపిస్తోంది.

Updated Date - 2020-09-24T09:34:59+05:30 IST