ఫిబ్రవరిలో తగ్గనున్న కరోనా

ABN , First Publish Date - 2020-10-19T06:37:58+05:30 IST

కరోనా కేసుల్లో గరిష్ఠస్థాయిని భారత్‌ సెప్టెంబరు రెండోవారానికేఅధిగమించిందని, జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు యాక్టివ్‌ కేసుల సంఖ్య

ఫిబ్రవరిలో తగ్గనున్న కరోనా

సెప్టెంబరు మధ్యలోనే కేసులు పతాకస్థాయికి!..

లాక్‌డౌన్‌ లేకుంటే జూన్‌కే 1.4 కోట్ల పాజిటివ్‌లు

ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అధ్యయనంలో వెల్లడి


కరోనా కేసుల్లో గరిష్ఠస్థాయిని భారత్‌ సెప్టెంబరు రెండోవారానికేఅధిగమించిందని, జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందని కేంద్ర ప్రభు త్వం నియమించిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ వెల్లడించింది. మార్చిలో లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే జూన్‌ నాటికే దేశంలో 1.4 కోట్లకు పైగా కేసులు నమోదయ్యేవని, ఆగస్టు నాటికే 25 లక్షలకుపైగా మరణాలు సంభవించేవని కమిటీ పేర్కొంది. లాక్‌డౌన్‌ విధింపునకు మే నెల దాకా ఆగి ఉంటే జూన్‌కే 50లక్షల దాకా యాక్టివ్‌ కేసులు ఉండేవని వెల్లడించింది.


ప్రస్తుత పరిస్థితిని బట్టి ఫిబ్రవరి నెలాఖరుకుదేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1.05 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్టు కమిటీ అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశంలో 75 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1.1 లక్షల మందికి పైగా కరోనా మహమ్మారికి బలయ్యారు. ప్రభుత్వం సకాలంలో లాక్‌డౌన్‌ విధించడంతో పాటు ప్రజలు మాస్క్‌లు ధరించడం, భూతిక దూరం, పరిశుభ్రత పాటించడం వల్ల భారత్‌ కరోనాను సమర్థంగా ఎదుర్కొందని కమిటీ తెలిపింది.


శీతాకాలం, పండుగల సీజన్‌ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిటీ సూచించింది. దేశంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ ప్రభావం, భవిష్యత్‌ కార్యాచరణపై అధ్యయనం చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూన్‌ 1న నేషనల్‌ సూపర్‌ మోడల్‌ కమిటీని నియమించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌) ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ నేతృత్వం లో వివిధ రంగాలకు చెందిన ఏడుగురు నిపుణులతో కూడిన ఈ కమిటీ అధ్యయన వివరాలను ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం మార్చి నుంచి లాక్‌డౌన్‌ విధించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు అరికట్టగలిగామని నిపుణుల కమిటీ అభిప్రాయ పడింది. సెప్టెంబర్‌ చివరికి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలుగా ఉంది.


దేశంలో 30ు మందిలో కరోనా యాం టీబాడీలు అభివృద్ధి చెందాయని తెలిపింది. ఈ సంఖ్య ఆగస్టు నెలాఖరుకు 14ు ఉంది. కాగా.. వైద్య వ్యవస్థలపై తీవ్ర భారం పడే ప్రమాదం ఉంటే తప్ప రాష్ట్రాలు/జిల్లాల స్థాయిలో ఎలాంటి లాక్‌డౌన్‌ ఆంక్షలూ విధించకూడదని కమిటీ సూచించింది. లాక్‌డౌన్‌ సమయంలో లక్షల సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లినా కరోనా వ్యాప్తి పెరగలేదని కమిటీ స్పష్టం చేసింది. 


అందరూ జరభద్రం.. 

చలికాలంలో కరోనా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఓనం పండుగ తరువాత కేరళలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి, క్రిస్‌మస్‌ వంటి పెద్ద పండుగలు వస్తున్న దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కమిటీ హెచ్చరించింది.


ప్రజలు ఇళలోనే వేడుకలు జరుపుకోవాలని సూచించింది. ప్రార్థనా స్థలాల్లో గాలి, వెలుతురు సరిగా ఉండదు. అలాంటి చోట్ల ప్రజలు గుమికూడితే వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు.      

- స్పెషల్‌ డెస్క్‌




చలికాలంలో సెకండ్‌ వేవ్‌ ముప్పు: వీకే పాల్‌

గత 3 వారాల్లో దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గిందని, చాలా రాష్ట్రాల్లో పరిస్థితి నిలకడగా ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, కొవిడ్‌పై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ అధిపతి వీకే పాల్‌ చెప్పారు. అయితే, రానున్న చలికాలంలో సెకండ్‌ వేవ్‌ వచ్చే ముప్పును కొట్టిపారేయలేమని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే దాన్ని నిల్వ చేయడానికి, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులోకి తేవడానికి అవసరమైనన్ని వనరులు ఉన్నాయని పాల్‌ తెలిపారు.


‘‘ఐదు రాష్ట్రాల్లో (కేరళ, కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, పశ్చిమ బెంగాల్‌), మూడు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే కేసులు పెరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు. కరోనా కేసుల విషయంలో భారతదేశం ప్రస్తుతం మెరుగైన పరిస్థితిలోనే ఉందిగానీ.. దేశంలోని 90 శాతం మంది ప్రజలు వైర్‌సబారిన పడే ముప్పు ఇంకా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డారు. యూర్‌పలోని చాలా దేశాల్లో చలికాలంలో కరోనా తిరగబెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.


సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగింది


కరోనా ఊహించని విపత్తు. మార్చిలో నామమాత్రంగా ఉన్న కేసులు నాలుగైదు నెలల్లోనే లక్షలకు పెరిగాయి. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంతో మేలు జరిగింది. మొదట్లో మనం కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేము. ప్రభుత్వాలు చురుకుగా స్పందించడంతో పీపీఈ కిట్ల నుంచి ఆక్సిజన్‌ దాకా వేగంగా ఏర్పాటు చేసుకోగలిగాం. భవిష్యత్తులో సవాళ్లను అధిగమించేందుకు ఈ అనుభవం ఉపయోగపడుతుంది. 


- ఎం.విద్యాసాగర్‌, నిపుణుల కమిటీ సారథి


Updated Date - 2020-10-19T06:37:58+05:30 IST