మరో 52 మందికి వైరస్‌

ABN , First Publish Date - 2020-06-30T09:52:16+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. సోమవారం నాటికి మొత్తం కేసులు 1383కు చేరుకున్నాయి.

మరో 52 మందికి వైరస్‌

60కి చేరుకున్న కరోనా మరణాలు 

జిల్లాలో 1400 చేరువగా కరోనా కేసులు 


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. సోమవారం నాటికి మొత్తం కేసులు 1383కు చేరుకున్నాయి. జిల్లాలో కరోనా మరణాల సంఖ్య అధికారికంగా 60కి చేరుకుంది. సోమవారం మరో ఇద్దరు కరోనా వల్ల మరణించారు. 52 మంది వైరస్‌ బారినపడ్డారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఇప్పటివరకు 579 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల్లో ఇంకా 744 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం నమోదైన 52 పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం నగర పరిధిలోనే ఉన్నాయి.


వన్‌టౌన్‌, భవానీపురం, కొత్తపేట, కొత్తగుళ్లు, వెంకటేశ్వరపురం, మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీ, టిక్కిల్‌ రోడ్డు, ఎల్‌ఈపీఎల్‌ ఐనాక్స్‌ సమీపంలోని సాయిబాబాగుడి దగ్గర, ఆటోనగర్‌ కాలనీ, పూర్ణానందంపేట, పెనమలూరు, గొల్లపూడి, గన్నవరం ప్రాంతాల్లోను పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొత్త ప్రభుత్వాసుపత్రి, పాత ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుష్‌ హాస్పిటల్‌, షాదీఖానా, బాప్టిస్ట్‌పాలెం, ఇండోర్‌ స్టేడియం, ఉప్పులూరు, జిల్లాలో మచిలీపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఎ.కొండూరు కంభంపాడు, నూజివీడు, ఆగిరిపల్లి తదితర ప్రాంతాల్లో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

 

ట్రిపుల్‌ ఐటీలోకి కరోనా ప్రవేశం......

కరోనా కోరల్లో నూజివీడు విలవిలలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే నూజివీడులో 15కేసులు వెలుగు చూడటంతో ఇక్కడ వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు ట్రిపుల్‌ఐటిలో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారు విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


దీనికి తోడు ఈ నెల 23,24 తేదీల్లో ట్రిపుల్‌ఐటిలో జరిగిన అధికారిక సమావేశానికి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ నుంచి హాజరైన అధికారులిద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించినట్లు సోమవారం ఇక్కడికి సమాచారం అందడంతో ఇక్కడివారందరికి సోమవారం వైద్య పరీక్షలు జరిపినట్లు సమాచారం. ఫలితాలు మంగళవారానికి కాని వెల్లడి కావు. మరో పక్క ఇక్కడ పని చేస్తున్న 120 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమను కనీసం ఒక వారం ఇంటి వద్దే ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-06-30T09:52:16+05:30 IST