యూకేలో లక్ష దాటిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-01-27T06:57:49+05:30 IST

కరోనాతో ఓసారి వణికి.. ఆపై కొత్త స్ట్రెయిన్‌కు కేంద్రంగా మారిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో మృతుల సంఖ్య లక్ష దాటింది.

యూకేలో లక్ష దాటిన కరోనా మరణాలు

భారత్‌లో 9,102 కొత్త కేసులు 


లండన్‌, జనవరి 26: కరోనాతో ఓసారి వణికి.. ఆపై కొత్త స్ట్రెయిన్‌కు కేంద్రంగా మారిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో మృతుల సంఖ్య లక్ష దాటింది. యూర్‌పలో వైర్‌సతో తీవ్రంగా ప్రభావితమైన ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌లోనూ ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. ప్రపంచంలో లక్షపైగా మరణాలు నమోదైన ఐదో దేశం యూకే. కాగా, దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు 36.70 లక్షలు. దీనిప్రకారం మరణాల రేటు 2.72గా ఉంది. దాదాపు రెండు నెలలుగా యూకే కొత్త స్టె్ట్రయిన్‌ ప్రభావం ఉంది. 70 శాతం వేగంగా వ్యాపించే కొత్త స్ట్రెయిన్‌ కారణంగా రోజుకు 40 వేల వరకు పాజిటివ్‌లు వస్తున్నాయి. మంగళవారంతో ప్రపంచ కేసులు 10 కోట్లు దాటాయి. ఇందులో అమెరికా (2.60 కోట్లు) వాటానే పావు వంతుపైన ఉండటం గమనార్హం. 


దేశంలో మరో 117 మంది మృతి

భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 9,102 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. కరోనాతో 117 మంది మృతిచెందినట్లు పేర్కొంది. కాగా, ఆదివారం 5.70 లక్షల పరీక్షలు మాత్రమే నిర్వహించడంతో కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కేరళ, మహారాష్ట్రలోనూ కేసులు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 1.77 లక్షలకు తగ్గాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 9 దేశాలకు 60 లక్షల టీకాలు పంపిణీ చేసినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి భారత్‌ తెలిపింది. భారత్‌ నుంచి 5 లక్షల టీకాలు గురువారం శ్రీలంక చేరనున్నాయి.

Updated Date - 2021-01-27T06:57:49+05:30 IST