మా రాష్ట్రంలో కరోనా మరణాలు తక్కువే

ABN , First Publish Date - 2020-08-12T08:53:58+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సోకి మరణించినవారి సంఖ్య చాలా తక్కువని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ తెలియజేశారు. జాతీయ స్థాయిలో వైరస్‌ తీవ్రతపై పది రాష్ట్రాల..

మా రాష్ట్రంలో కరోనా మరణాలు తక్కువే

  • మొత్తం 0.89 శాతమే.. భారీగా టెస్టులు చేస్తున్నాం
  • వైరస్‌ కట్టడికి ప్రత్యేక వ్యూహం.. క్లస్టర్లపై దృష్టి
  • కొవిడ్‌ ప్రపంచాన్నే సవాల్‌ చేస్తోంది.. సహకరించండి
  • వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి సీఎం జగన్‌ వినతి


అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సోకి మరణించినవారి సంఖ్య చాలా తక్కువని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ తెలియజేశారు. జాతీయ స్థాయిలో వైరస్‌ తీవ్రతపై పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న జగన్‌... రాష్ట్రంలో పరీక్షల తీరును ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 25,34,304 పరీక్షలు చేయగా.. 2.35లక్షల మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రతి పది లక్షల మందిలో 47,459మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.89శాతంగా నమోదైనట్లు తెలిపారు. ‘ప్రస్తుతం రోజుకు సగటున 60వేల పరీక్షలు చేస్తున్నాం. రోజూ 9నుంచి పదివేల కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85- 90శాతం క్లస్టర్లలోనే నమోదవుతున్నాయి. వైరస్‌ నియంత్రణకు ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నాం. పాజిటివ్‌ వచ్చినవారికి త్వరితగతిన చికిత్స అందిస్తున్నాం. దీనివల్లే మరణాలు తగ్గించగలుగుతు న్నాం’ అని వెల్లడించారు. ఇంకా ఏం చెప్పారంటే..


‘కరోనాపై ప్రజల్లో భయాందోళనలు తగ్గించాం. మార్చిలో తొలి కేసు గుర్తించినప్పుడు, ఆ శాంపిల్‌ను పుణేలోని ల్యాబ్‌కు పంపించాం. రాష్ట్రంలో అప్పుడు కనీసం వైరాలజీ ల్యాబ్‌ లేదు. ఇవాళ పది లక్షల మందిలో 47,459మందికి పరీక్షలు చేసే స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటుచేశాం. 13 జిల్లాల్లోనూ కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం.. వైరస్‌ సోకినవారిని వేగంగా గుర్తించడం.. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించడం.. ఇలా ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. 100కిపైగా మొబైల్‌ యూనిట్ల ద్వారా, 1,500కిపైగా కేంద్రాల్లో శాంపిళ్లను సేకరిస్తున్నాం. 138 ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో 37,189 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. మైల్డ్‌ కొవిడ్‌ బాధితుల కోసం మరో 109 కేర్‌ సెంటర్లను గుర్తించాం. వాటిలోనూ 56వేలకు పైగా బెడ్లు ఉన్నాయి. ఆక్సిజన్‌ బెడ్లు 11వేలకుపైనే ఉన్నాయి.


వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది 32వేల మంది ఉన్నారు. రోజంతా పనిచేసే కాల్‌సెంటర్లతో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశాం. బాధితులకు అరగంటలోపే బెడ్‌ కేటాయించేలా చర్యలు తీసుకున్నాం. ఒకేసారి 1,088అంబులెన్సులు ప్రారంభించాం. కరోనా కాలంలో కేంద్రం సహకారం మరువలేనిది. ఇందుకు మీకు(ప్రధానికి) కృతజ్ఞతలు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి టైర్‌-1 నగరాలు మా రాష్ట్రంలో లేవు. భారీ మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులూ లేవు. అందువల్ల రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్రం సహాయ సహకారాలు అందించాలి. ప్రపంచాన్నే సవాల్‌ చేస్తున్న కరోనా నియంత్రణలో రాష్ట్రానికి సహకరించాలి.’

Updated Date - 2020-08-12T08:53:58+05:30 IST