ఐదు రోజులు.. 60 మృతదేహాలు

ABN , First Publish Date - 2021-05-15T06:16:50+05:30 IST

ఐదు రోజులు.. 60 మృతదేహాలు

ఐదు రోజులు.. 60 మృతదేహాలు

రోజు రోజుకూ పెరుగుతున్న కొవిడ్‌ మృతులు


దహన సంస్కారాలు నిర్వహించిన జీడబ్ల్యూఎంసీ 


ఇంకా అందుబాటులోకి రాని బర్నింగ్‌ మెషిన్లు


వరంగల్‌ సిటీ, మే 14 : కొవిడ్‌ మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇందుకు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో వరంగల్‌ పోతన నగర్‌ శ్మశానవాటికలో చేపట్టిన ఉచిత దహన సంస్కారాల ప్రక్రియే మృతుల పెరుగుదలను వెల్లడిస్తోంది. వీటిలో ఎంజీఎంతో పాటు ఇతర ప్రైవేటు ఆస్పత్రులు, ఇళ్లలో మృతి చెందిన వారు కూడా ఉన్నారు. అంతా చక్కగా ఉందనే పాలకుల ప్రగల్బాలు తప్పు అని మృతుల లెక్కలు చెబుతున్నాయి. కొద్ది రోజుల వరకు 45 మృతదేహాలకు జీడబ్ల్యూఎంసీ ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించింది. 

కానీ ఐదు రోజులుగా ప్రతీ రోజు 10 నుంచి 12 మృతదేహాలకు దహన సంస్కారాలు చేపట్టడంతో క్షేత్రస్థాయిలో కరోనా విజృంభణ, నియంత్రణ చర్యలు ఒట్టి మాటలే అనేది స్పష్టం చేస్తోంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ నుంచి ఇప్పటి వరకు జీడబ్ల్యూఎంసీ 232 మృతదేహాలకు దహన సంస్కారం జరిపింది. సుమారు 15 నెలల వ్యవధిలో మృతుల సంఖ్య ఈ స్థాయిలో ఉండడం కూడా కలకలం రేపుతోంది. మృతుల్లో అధికంగా 50 ఏళ్లు దాటిన వారే ఉంటున్నారు. ఆక్సిజన్‌ కొరత, సరైన సమయంలో చిక్సిత దొరక్కపోవడం, బెడ్ల కొరత వంటి కారణాలతోనే మృతుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


రెండు రోజుల్లో బర్నింగ్‌ మెషిన్లు

జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పోతననగర్‌ శ్మశాన వాటికలో ఏర్పాటైన ఎలక్ర్టిక్‌ బర్నింగ్‌ మెషిన్లు రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఒక మెషిన్‌ గతసంవత్సరమే ఏర్పాటైంది. అయితే కొద్ది రోజులుగా పని చేయడం లేదు. దానికి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. అదనంగా రూ.9.5 లక్షలు వెచ్చించి జీడబ్ల్యూంఎసీ మరో బర్నింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసింది. ఈ మెషిన్‌ రెండు రోజుల్లో ఇన్‌స్టాల్‌ చేయడంతో పాటు పాడైపోయిన బర్నింగ్‌ మెషిన్‌కు కూడా మరమ్మతులు చేసి  రెండింటిని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం కట్టెల మీదనే దహన సంస్కారాలు చేస్తున్నారు.


Updated Date - 2021-05-15T06:16:50+05:30 IST