మృతులు 5000

ABN , First Publish Date - 2020-05-31T07:15:38+05:30 IST

దేశంలో కరోనా తీవ్రతను చాటుతూ ఒక్క రోజే దాదాపు 8 వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో దేశంలో...

మృతులు 5000

  • ఒక్క రోజే దాదాపు 8 వేల కేసులు
  • 15.4 రోజుల్లో రెట్టింపు
  • రికార్డు స్థాయిలో 265 మరణాలు
  • ఉద్యోగులకు వైరస్‌.. పార్లమెంటుశుద్ధి
  • విదేశాంగ శాఖ ఉద్యోగులకు కరోనా

న్యూఢిల్లీ, మే 30:  దేశంలో కరోనా తీవ్రతను చాటుతూ ఒక్క రోజే దాదాపు 8 వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో దేశంలో 7,964 కేసులు నమోదయ్యాయి. 265 మంది చనిపోయారు. ఒక్క రోజు వ్యవధిలో రికార్డయిన గరిష్ఠ కేసులు, మరణాలు ఇవే. కోలుకున్నవారి శాతం 4.51 శాతం పెరిగి 47.40కు చేరింది. కేసుల రెట్టింపునకు సమయం 13.3 రోజుల నుంచి  15.4 రోజులైంది. రాజ్యసభ సచివాలయ అధికారికి పాజిటివ్‌ రావడంతో శనివారం పార్లమెంటు భవన సముదాయాన్ని  శుద్ధి చేశారు. కర్ణాటకలో.. తెలంగాణ నుంచి ఉడుపి వచ్చిన రెండేళ్ల చిన్నారికి కరోనా సోకింది. విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు ఇద్దరికి  కరోనా నిర్ధారణ అయింది. థానెలో కొవిడ్‌ లక్షణాలతో చనిపోయిన మహిళ అంత్యక్రియలకు హాజరైన 18 మందికి పాజిటివ్‌ వచ్చింది.


జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పాజిటివ్‌గా తేలిన 40,184 మందిలో 28.1 శాతం లక్షణాలు కనిపించనివారేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో సాగిన అధ్యయనం పేర్కొంది. కరోనా నివారణకు సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.    వందే భారత్‌లో భాగంగా శనివారం ఢిల్లీ నుంచి మాస్కోకు విమానం బయల్దేరాక.. పైలట్‌ కరోనా బాధితుడని తేలడంతో విమానాన్ని వెనక్కు రప్పించారు. తమిళనాడులో తాజాగా నమోదైన 938 కేసుల్లో చెన్నైలోనే 616 ఉన్నాయి. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వైద్యనిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.


రైల్లో మాస్కులు మస్ట్‌

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): జూన్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైళ్లలో వెళ్లే ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని, ఆహార పదార్థాలు, నీరు, బెడ్‌ షీట్లు, దుప్పట్లను తెచ్చుకోవాలని వివరించింది.


Updated Date - 2020-05-31T07:15:38+05:30 IST