కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే.. కొవిడ్‌ మరణాల రేటు ఎక్కువ

ABN , First Publish Date - 2020-09-20T08:00:10+05:30 IST

జాతీయ సగటు కంటే.. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ మరణాల రేటు అధికంగా ఉందని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా ఆందోళన వ్యక్తం చేశారు...

కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే.. కొవిడ్‌ మరణాల రేటు ఎక్కువ

  • అక్కడ ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలి
  • తెలంగాణలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు భేష్‌
  • మరణాల రేటు కూడా తక్కువ: రాజీవ్‌గౌబా
  • పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం: సీఎస్‌ 

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జాతీయ సగటు కంటే.. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ మరణాల రేటు అధికంగా ఉందని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో కలిసి.. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల్లో నెగటివ్‌ వచ్చినా.. లక్షణాలు ఉన్నవారికి కచ్చితంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు.


80శాతం కొవిడ్‌ మరణాలను నమోదు చేసుకుంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఒడిసా, చండీగఢ్‌, తెలంగాణ, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌లో.. ఆక్సిజన్‌ సరఫరా సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలు, ఆరోగ్య కేంద్రాల స్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని, ఆక్సిజన్‌ సరఫరాలో రవాణా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మరణాల నియంత్రణకు కృషి చేస్తున్న రాష్ట్రాలు.. ఆ విధానాలను కేంద్రంతో పంచుకోవాలని కోరారు. తద్వారా.. ఇతర ప్రాంతాల్లోనూ ఆ విధానాలను అమలు చేయవచ్చన్నారు. కొవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచిన రాష్ట్రాలను రాజీవ్‌ గౌబా అభినందించారు. అయినా.. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే మరణాల రేటు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ టెస్టులు, పాజిటివ్‌ రేటు, మరణాలు, అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌, సాధారణ పడకల సంఖ్య తదితర వివరాలను ఇంకా సమగ్రంగా అందజేయాలని కోరారు. కాగా.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొవిడ్‌-19 నియంత్రణ చర్యలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు.


రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌-19 పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడాన్ని రాజీవ్‌గౌబా అభినందించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో విస్తృతంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ కొనియాడారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూనే.. టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచామని తెలిపారు. జిల్లాల్లో కొవిడ్‌ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ ప్రీతి మీనా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Updated Date - 2020-09-20T08:00:10+05:30 IST