జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2020-08-09T07:10:48+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. కరోనా బారినపడి వేల సంఖ్యలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ...

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌


  • జిల్లాలో వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు
  • కరోనా కాటుకు 17 మంది బలి
  • పల్లెల్లోనూ విస్తరిస్తోన్న వైరస్‌


మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 8: జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. కరోనా బారినపడి వేల సంఖ్యలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరణాల సంఖ్య 17కు చేరింది. ముఖ్యంగా పట్టణాల్లో వైరస్‌ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వృద్ధులపై వారిపై కరోనా పంజా విసురుతోంది. మృతుల్లో 50 సం వత్సరాలకు పైబడ్డ వారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక కేసులు జిల్లాకేంద్రంలో నమోదవుతుండగా, తరువాత స్థానంలో బెల్లంపల్లి ఉంది. నస్పూర్‌ మున్సిపాలిటీలో కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 17 మరణాలు సంభవించగా అందులో 12 మంది హైద్రాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో మరణించారు. 


జిల్లాలో వెయ్యికి పైగా కేసులు...

జిల్లా వ్యాప్తంగాశుక్రవారం అర్ధరాత్రి వరకు అధికారిక గణాంకాల ప్రకారం 1002 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితోపాటు వివిధ మండలాల్లోని పీహెచ్‌సీల్లో వైరస్‌ లక్షణాలు గల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన బాఽధితులను వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి హోంక్వారంటైన్‌ లేదా బెల్లంపల్లిలోని సింగరేణి ఐసోలేషన్‌ సెంటర్‌గానీ, హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితోపాటు అధిక సంఖ్యలో లక్షణాలు గల వారు నేరుగా హైద్రాబాద్‌, కరీంనగర్‌లలో పరీక్షలు చేయించుకుంటున్నారు. రిపోర్టులు పాజిటివ్‌గానీ, అనుమానిత లక్షణాలుగానీ రాగానే అక్కడే చికిత్స పొందుతున్నారు. 


ఆపదలో హెల్ప్‌లైన్‌ అండ...

కొవిడ్‌ వైరస్‌ సోకి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆపదలో ఆదుకొనేందుకు హెల్ప్‌లైన్‌ అండగా నిలుస్తోంది. సేవా భారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని కరోనా పేషెంట్లకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్టర్‌ కన్సల్టేషన్‌తోపా టు ఇతర సహాయ సహకారాలు అందజేస్తోంది. ఇందు కోసం 9676733 230 సెల్‌ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. వైద్యులతో  మాట్లాడిస్తూ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర సమాచారాన్ని అంద జేస్తున్నారు. నిరుపేదలైన కరోనా పేషెంట్లకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితం గా ఆక్సీ మీటర్‌, ఽథర్మామీటర్‌తోపాటు వైద్యుల సూచనల మేరకు మందులతో కూడిన రూ.2500 విలువగల కిట్లను అందజేస్తున్నట్ల్లు సంస్థ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్‌ వెరబెల్లి తెలిపారు. 


కరోనాతో 17 మంది మృతి..

కరోనా కాటుకు ఇప్పటి వరకు జిల్లాలో 17 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ 14న చెన్నూర్‌ మండలం ముత్తెరావుపల్లిలో మహిళ మృతి చెందగా, జూన్‌ 29న బెల్లంపల్లికి చెందిన మహిళ మృతి చెందింది. జూలై 9న శ్రీరాంపూర్‌కు చెందిన యువకుడు హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, 17న బెల్లంపల్లికి చెందిన  ఒకరు హైద్రాబాద్‌ అపోలో ఆసుపత్రిలో, నస్పూర్‌కు చెందిన మహిళ కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు ఆసుపత్రిలో మృతి చెందారు. 19న లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన ఒకరు హైద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మరణించగా, 25న మంచిర్యాలకు చెందిన ఒకరు హైద్రాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆసుపత్రిలో మృతి చెందాడు. 26న రామకృష్ణాపూర్‌కు చెందిన మహిళ, 27న మంచిర్యాలకు చెందిన ఒకరు బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మరణించాడు. 28న శ్రీరాంపూర్‌కు చెందిన ఒకరు హైద్రాబాద్‌లోని యశోదలో, 30న బెల్లంపల్లికి చెందిన మహిళ హైద్రాబాద్‌లోని కిమ్స్‌లో మృతి చెందారు. 31న మంచిర్యాలకు చెందిన ఒకరు హైద్రాబాద్‌ అపోలో ఆసుపత్రిలో, ఈ నెల 4న జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి చెందిన ఒకరు గాంధీ ఆసుపత్రిలో చనిపోయాడు. 6న మంచిర్యాలకు చెందిన ఒకరు హైద్రాబాద్‌లోని వాసవీ ఆసుపత్రిలో మరణించగా, అదే రోజు మంచిర్యాలకు చెందిన మహిళ ఇంట్లో మృతి చెందింది. 7న బెల్లంపల్లికి చెందిన ఒకరు హైద్రాబాద్‌ కింగ్‌ కోఠి ఆసుపత్రి, నస్పూర్‌కు చెందిన  ఒకరు ఇంటి వద్ద మృతి చెందాడు. 

Updated Date - 2020-08-09T07:10:48+05:30 IST