కరోనా డేంజర్‌ బెల్స్‌

ABN , First Publish Date - 2022-01-20T06:26:59+05:30 IST

పెద్దపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతున్నది.

కరోనా డేంజర్‌ బెల్స్‌

- జిల్లాలో ఒక్కరోజే 704 కేసులు నమోదు

- కరోనా వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికం

- కేసులు పెరుగుతున్నా వ్యాధి తీవ్రత తక్కువే

- నివారణ పట్టని అధికారులు, సింగరేణి సంస్థ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతున్నది. రోజురోజుకు కేసులు పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 704 మందికి కరోనా సోకినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సింగరేణి ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. గత ఏడాదిన్నర నుంచి ఇంత పెద్దమొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, సింగరేణి ఆసుపత్రుల్లో 2,039 మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 531 మందికి కరోనా వచ్చింది. గోదావరిఖని ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రంలో 343 మంది శాంపిళ్లను పరీక్షించగా 173 మందికి కరోనా సోకినట్లు వెల్లడయ్యింది. ఈ కేసుల్లో అత్యధికంగా గోదావరిఖని కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోనే నమోదు కావడం గమనార్హం. నాలుగు రోజుల నుంచి ఈ ప్రాంతంలో రోజుకు 300కు తగ్గకుండా కరోనా కేసులు రికార్డు అవుతున్నాయి. బుధవారం 500 మందికి పైగా కరోనా సోకింది. గోదావరిఖనిలో 252, యైుటింక్లయిన్‌ కాలనీలో 76, రామగుండంలో 33, అంతర్గాం మండలంలో ఇద్దరికి, పాలకుర్తి మండలంలో 14 మందికి, రామగిరి సింగరేణి డిస్పెన్సరీ పరిధిలో 41మందికి కరోనా సోకింది. పెద్దపల్లి పట్టణంలో 46 మందికి, మండలంలో 22 మందికి, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో ఒకరికి, ధర్మారం మండలంలో ఒకరికి, ఓదెల మండలంలో ఆరుగురికి, సుల్తానాబాద్‌ మండలంలో ఒకరికి, జూలపల్లి మండలంలో ఒకరికి కరోనా సోకింది. మంథని పట్టణంలో 32 మందికి, కమాన్‌పూర్‌ మండలంలో ఇద్దరికి, ముత్తారం మండలంలో ఒకరికి కరోనా సోకింది. 

‘ఖని’ ప్రాంతంలో అత్యధికంగా..

గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి ఆసుపత్రుల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 172 మందికి పరీక్షలు చేస్తే 92 మందికి, యైుటింక్లయిన్‌ కాలనీ డిస్పెన్సరీలో 131 మందికి పరీక్షలు చేస్తే 73 మందికి, ఆర్‌జీ-3 డిస్పెన్సరీలో 106 మందికి పరీక్షలు నిర్వహిస్తే 41 మందికి కరోనా సోకింది. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 206 మంది సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా రావడం గమనార్హం. వారి ద్వారా గోదావరిఖని, రామగుండం పట్టణంలో కరోనా వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. కోల్‌బెల్ట్‌ను ఆనుకుని ఉండే మంథని పట్టణంలో కూడా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. పెద్దపల్లి పట్టణంలోనూ కరోనా ఉదృతి పెరుగుతున్నది. ధర్మారం, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలో కరోనా కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నప్పటికీ, తీవ్రత తక్కువగానే ఉంటున్నది. ఆసుపత్రులకు 10 శాతం మంది మాత్రమే వెళుతున్నారు. 90 శాతం మందికి హోం ఐసోలేషన్‌ చికిత్స ద్వారానే నయం అవుతున్నది. ఈ కరోనా సీజన్‌లో జిల్లాలో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కరోనా కట్టడి కోసం సింగరేణి సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతానికి వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, చలి తగ్గి వేసవి మొదలైతే మాత్రం ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశాలు లేకపోలేదని డాక్టర్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-20T06:26:59+05:30 IST