కరోనా బాధితులకు సైటోకైన్స్‌తో ముప్పు

ABN , First Publish Date - 2020-07-11T18:06:13+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది..

కరోనా బాధితులకు సైటోకైన్స్‌తో ముప్పు

భారీ సంఖ్యలో కణాలు విడుదలైతే రక్తం గడ్డకట్టే ప్రమాదం

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై అధిక ప్రభావం

గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు

ఆక్సిజన్‌ అందక మరణించే అవకాశం

ముందుస్తు మందులతో ఉపశమనం

‘ఆంధ్రజ్యోతి’తో కేజీహెచ్‌ కార్డియోథొరాసిక్‌ విభాగ వైద్య నిపుణుడు డాక్టర్‌ సాగర్‌బాబు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఇప్పటి వరకు ఒక కోటి 25 లక్షల మంది వైరస్‌బారిన పడగా, 5.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే సైటోకైన్స్‌ కణాలు ఒకేసారి భారీ సంఖ్యలో విడుదల కావడమే మరణాలకు కారణమని వైద్య పరిశోధనల్లో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో కరోనాతో చనిపోయిన వారికి పోస్టుమార్టం నిర్వహించగా ఈ విషయం స్పష్టమైందని పేర్కొంటున్నారు. కొవిడ్‌ బారినపడిన వారికి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు పెరగడానికి గల కారణాలు, మరణాల రేటును తగ్గించడానికి ఏమి చేయాలన్న దానిపై కేజీహెచ్‌ కార్డియోథొరాసిక్‌ విభాగ వైద్య నిపుణుడు డాక్టర్‌ సాగర్‌ బాబు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించిన సమాచారం.... 


సైటోకైన్స్‌తో రక్తం గడ్డ కడుతుంది 

కరోనా వైరస్‌ బారినపడిన వ్యక్తుల్లో వైరస్‌కు రియాక్షన్‌గా రెండు రోజుల వ్యవధిలో సైటోకైన్స్‌ కణాలు తుఫాన్‌ మాదిరిగా వేలాదిగా విడదలవుతున్నాయి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురై ప్రాణాపాయం సంభవించే స్థాయికి తీసుకెళుతున్నది. భారీ సంఖ్యలో ఉత్పత్తి అయిన సైటోకైన్స్‌ కణాలు శరీరంలోని అనేక చోట్ల రక్తం గడ్డ కట్టేలా చేయడంతోపాటు ఇంఫ్లమేషన్‌ను పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. రక్తనాళాల్లో ఎక్కడ పడితే అక్కడ గడ్డ కట్టడం వల్ల ఆయా ప్రాంతాలకు రక్త సరఫరా పూర్తిగా ఆగిపోతుంది. గుండె, ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెపోటు, ఆయాసం వంటి సమస్యలు వచ్చి ప్రాణాపాయం సంభవిస్తుంది. ఊపిరితీత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడడం వల్ల ఊపరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయి ఆయాసం పెరిగి మృతి చెందుతున్నారు. ఇటువంటి సమస్యలు వచ్చిన వారికి వెంటిలేటర్‌ పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడి మరణాలు సంభవిస్తున్నాయే తప్ప... ఆక్సిజన్‌ అందడంలో ఇబ్బందులు ఏర్పడి కాదు. 


వీరిలో ప్రమాదమెక్కువ.....

కరోనా వైరస్‌ బారినపడిన ప్రతి ఒక్కరిలోనూ సైటోకైన్స్‌ కణాలు విడుదల అవుతాయి. అందరికీ ఇవి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం లేదు. అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడినవారు, కిడ్నీ, కేన్సర్‌, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో సైటోకైన్స్‌ ఎక్కువగా విడుదల కావడం ప్రమాదకరంగా మారుతున్నది. 


ఈ మందులతో ఊరట..  

వైరస్‌ బారినపడి, ఇటువంటి సమస్యలతో బాధపడేవారికి ముందుగానే రక్తం పల్చబడే మందులు వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తం పల్చబడేలా చేసే యాస్పిరిన్‌, ఇంఫ్లమేషన్‌ను తగ్గించే పారాసిటమాల్‌, సైటోకైన్స్‌ ఉత్పత్తిని తగ్గించే స్టెరాయిడ్స్‌ వంటివి కరోనా రోగులకు ఇస్తున్నారు. వీలైనంత వరకు రక్తం గడ్డ కట్టకుండా చేసినట్టయితే మరణాలను తగ్గించవచ్చు. ఈ మందులు ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితం ఉండడంతోపాటు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఆయా సమస్యలతో బాధపడేవారికి ఈ మందులు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. 


Updated Date - 2020-07-11T18:06:13+05:30 IST