కర్ఫ్యూ కరోనా..!

ABN , First Publish Date - 2020-03-22T08:58:29+05:30 IST

ఇది... కనిపించని శత్రువుపై కత్తులు దూయని యుద్ధం! మనందరి రక్షణ కోసం మనమంతా కలిసి చేయక తప్పని యుద్ధం! ఉమ్మడిగా గెలిచి తీరాల్సిన యుద్ధం! ఆ శత్రువు పేరే...

కర్ఫ్యూ కరోనా..!

  • వైరస్‌పై దేశవ్యాప్త సమరం
  • రాష్ట్రంలో మరో పాజిటివ్‌ కేసు
  • తెలంగాణలో 2వ దశ విస్తరణ
  • మహారాష్ట్రలో 3వ దశ ప్రవేశం
  • విజయవాడలో తొలి పాజిటివ్‌తో
  • రాష్ట్రంలో మొత్తం 5 కేసులు నమోదు
  • ప్యారిస్‌ నుంచి వచ్చిన యువకుడికి వైరస్‌ 
  • ‘తూర్పు’ యువకుడికీ కరోనా నిర్ధారణ
  • విశాఖ ఏజెన్సీలో ఇద్దరు అనుమానితులు 
  • అనంతలో ఇద్దరు, సిక్కోలులో మరొకరు..
  • తెలంగాణలో తొలిసారి స్థానికుడికి వైరస్‌
  • 2వ దశతో ఆందోళన.. 21కి చేరిన కేసులు


అమరావతి, ఆంధ్రజ్యోతి: ఇది... కనిపించని శత్రువుపై కత్తులు దూయని యుద్ధం! మనందరి రక్షణ కోసం మనమంతా కలిసి చేయక తప్పని యుద్ధం! ఉమ్మడిగా గెలిచి తీరాల్సిన యుద్ధం! ఆ శత్రువు పేరే... కరోనా వైరస్‌! ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేసింది! మరో ‘విశ్వవిజేత’నవుతానని వికటాట్టహాసం చేస్తోంది. భారత్‌లోనూ అడుగుపెట్టింది. ఇక్కడ తన ఆటలు సాగవని అందరూ చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు ప్రత్యేకంగా, కష్టపడి చేయాల్సిందేమీ లేదు! ఎవరికి వారు బాధ్యతగా ఉండటమే! కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ‘దూరం’ పాటించడమే! దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించడమే! దేశం కోసం... ఇల్లు కదలకుండా, కులాసాగా, దిలాసాగా కూర్చోవడమే! దీనిపై చైతన్యం కల్పించేందుకు ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చారు.


అవసరమైతే, ఆ తర్వాత తీసుకోబోయే చర్యలకు దీనినో సన్నాహకంగా భావించాలని కూడా సంకేతాలు ఇచ్చారు. ‘జనతా కర్ఫ్యూ’కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. దేశమంతా ‘14 గంటల’ స్వచ్ఛంద కర్ఫ్యూకు సిద్ధమైంది. తెలంగాణలో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలు కర్ఫ్యూ పాటించాలని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం దాదాపు అన్ని రైళ్లు బంద్‌! ఏపీలో  ప్రజా రవాణా కూడా బంద్‌! అత్యవసర సేవలు మినహా... పెట్రోలు బంకులతోపాటు ఇతర వాణిజ్య, వ్యాపారాలు కూడా మూత పడుతున్నాయి.


‘మూడు’ ముప్పు రాకుండా...

కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండాలంటే... ‘సామాజిక దూరం’ పాటించాలి! ఈ సందేశాన్ని బలంగా పంపేందుకే ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చారు. కరోనాకు ఇంత భయపడాలా... అంటే భయపడాల్సిందే అని అగ్రరాజ్యాల అనుభవాలు చెబుతున్నాయి. ఈ వైర్‌సకు ఇంకా మందు కనుక్కోలేదు. వైరస్‌ వ్యాప్తి మూడో దశకు చేరితే... ఒకరి నుంచి గరిష్ఠంగా 3500 మందికి సోకే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే...ఆ పరిణామాలను ఊహించడానికే భయమేస్తుంది. నివారణ లేని ఈ వైర్‌సను నియంత్రించడమొక్కటే పరిష్కారం. దానికి మన చేతుల్లో ఉన్న ఒకే ఒక మార్గం ‘మూసేయడం’. షాపులు, సినిమా హాళ్లు, జిమ్‌లు, క్లబ్‌లు, స్విమ్మింగ్‌పూళ్లు... చివరకు మన ఇంటి తలుపులు సైతం మూసేయాలి. అందులో భాగమే... ‘జనతా కర్ఫ్యూ’!


దేశవ్యాప్తంగా 283 కేసులు

భయపడినంతా జరుగుతోంది! కరోనా కోరలు మరింత క్రూరంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటిదాకా... విదేశాల్లో వైరస్‌ అంటించుకున్న వారిలోనే పాజిటివ్‌ కనిపించింది. ఇప్పుడు... వారి నుంచి మరొకరికి, ఆ ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్‌ వ్యాపిస్తున్న విపత్కర దశలోకి దేశం అడుగిడుతోంది. ఇక... విజయవాడలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఐదుగురికి కరోనా సోకినట్లయింది.


 నేడే ‘జనతా కర్ఫ్యూ’

  • ఉదయం 7 నుంచి రాత్రి 9 దాకా!
  • ఇది ఇంట్లో ఉండి గెలిచే యుద్ధం
  • ప్రధాని పిలుపుతో కదిలిన దేశం
  • రాష్ట్రంలో సర్వం ‘ఎక్కడికక్కడే’

Updated Date - 2020-03-22T08:58:29+05:30 IST