కరోనా నేర్పిన పాఠాలు.. అమెరికా నుంచి భారత్ నేర్చుకోవాల్సిందేంటి

ABN , First Publish Date - 2021-05-05T21:59:51+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ప్రపంచానికి పెద్దన్నగా ఉంటూ వచ్చిన అమెరికాను ఈ మహమ్మారి అల్లాడించింది. ఈ విలయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ... తాజాగా ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ కాంగ్రెస్‌కు ఇచ్చిన ఉపన్యాసం పెద్ద చర్చనీయాంశంగా మారింది

కరోనా నేర్పిన పాఠాలు.. అమెరికా నుంచి భారత్ నేర్చుకోవాల్సిందేంటి

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ప్రపంచానికి పెద్దన్నగా ఉంటూ వచ్చిన అమెరికాను ఈ మహమ్మారి అల్లాడించింది. ఈ విలయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ... తాజాగా ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ కాంగ్రెస్‌కు ఇచ్చిన ఉపన్యాసం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మహమ్మారి నుంచి బయటపడుతున్న అమెరికాను మళ్లీ గాడిన పెట్టడానికి బైడెన్ ఎంచుకున్న విధానం.. భారత ప్రధాని మోదీ విధానాలకు పూర్తి భిన్నంగా ఉండటం కూడా ఆర్థిక నిపుణుల కన్ను దాటి పోలేదు. ఇంతకీ బైడెన్ ఏ విధానాలను ఎంచుకున్నారు? మోదీ రూట్‌కు బైడెన్ మార్గానికి భేదాలేంటి? బైడెన్ ప్రసంగం నుంచి భారత్ ఏం నేర్చుకోవచ్చు? అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే..


అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారి యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి గతవారం ప్రసంగించారు. ఈ ప్రసంగంలో బైడెన్ తాను పెద్ద ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఎందుకంటే కొన్ని పనులను కేవలం ప్రభుత్వమే చేయగలదని, అలాంటప్పుడు పెద్ద ప్రభుత్వం ఉండటం వల్ల ఆ పనులు వేగంగా జరుగుతాయని బైడెన్ అభిప్రాయపడ్డారు. అప్పుడెప్పుడో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి చూసుకున్నా అమెరికాలో ఈ విధానం లేదు. ఎప్పుడూ కూడా చిన్న ప్రభుత్వమే మంచిదనే భావన అప్పటి నుంచి కొనసాగుతోంది. అయితే బైడెన్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. అలాగే ఉద్యోగాల సృష్టి కోసం అమెరికన్ జాబ్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘‘ప్రతి తరంలో అమెరికాలోనే పెట్టే పెట్టుబడి ఇది. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన అతిపెద్ద జాబ్స్ ప్లాన్’’ అని దీన్ని బైడెన్ అభివర్ణించారు.



వీటన్నిటితోపాటు హెల్త్‌కేర్ ప్రీమియాలను తగ్గించి, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ల ధరలు తగ్గించాలని ఆయన సూచించారు. ‘‘అమెరికాలో హెల్త్ కేర్ అనేది ఒక హక్కు కావాలి. అంతేకాని ప్రివిలేజ్ (ప్రత్యేక అధికారం) కాకూడదు’’ అని బైడెన్ అన్నారు. ఇవన్నీ విన్న తర్వాత చాలా మంది లేవనెత్తిన ప్రశ్న, ‘కరోనా కోరల నుంచి ఇప్పుడే బయటపడుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ విధానాలు అవసరమా? అసలు ఈ ఉద్యోగాలు, కుటుంబాల పథకాలకు అయ్యే ఖర్చును బైడెన్ ప్రభుత్వం ఎలా భరిస్తుంది?’. ఈ ప్రశ్నకు బైడెన్ తన ప్రసంగంలోనే సమాధానమిచ్చారు. భారత్ నేర్చుకోవాల్సింది కూడా ఆ భాగంలోనే ఉందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ బైడెన్ చెప్పిన సొల్యూషన్ ఏంటో తెలుసా? టీడీఈ (ట్రికిల్ డౌన్ఎకనామిక్స్).


‘‘కార్పొరేట్ అమెరికా, సంపన్నులైన 1శాతం అమెరికన్లు వారి వాటా ప్రకారం చెల్లించాల్సిన సమయం ఇది’’ అని బైడెన్ స్పష్టంచేశారు. అసలు టీడీఈ అంటే ఏంటి అంటే.. రీగన్ సమయంలో ఇది ప్రారంభమైంది. ప్రభుత్వ రెవెన్యూను పెంచుకోవడానికి ఏ స్థాయిలో ట్యాక్సులు విధించాలనే విషయం గుర్తించాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్యాక్సులు(పన్నులు) మరీ తక్కువగా ఉంటే ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది. అదే సమయంలో పన్నులు ఎక్కువగా ఉన్నా కూడా ఆదాయం తక్కువగానే ఉంటుంది. దీనికి కారణం పని వికలీకరణ(డిసిఇన్సెంటివైజ్) అంటే వారికి ఉండే సౌకర్యాలు పోవడంతో వ్యక్తులు తమ పని సామర్థ్యాన్ని తగ్గించుకోవడం. రానురాను పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించే శక్తి ఉన్న వారిపై పన్నులు విధిస్తే ఆర్థిక వ్యవస్థకు నష్టం అనే నమ్మకంగా ఇది మారిపోయింది. కానీ నిజానికి టీడీఈ (ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్) చెప్పేదేంటంటే.. ‘‘అందరూ ధనవంతులు అవుతున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ కన్నా సంపన్నులు వేగంగా సంపాదించడం కూడా మంచిదే’’.


ఈ నమ్మకం వల్లే యూఎస్, యూకే వంటి దేశాలు సంపన్నులు, వ్యాపారవేత్తలకు ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చేవి. ఇలా చేస్తే ఆర్థిక వృద్ధి జరుగుతుందని భావించేవి. అయితే దీని వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గి, ఆర్థిక వ్యవస్థపై ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వద్ధ నిధుల కొరత ఏర్పడేది. ఇక్కడే చిన్న ప్రభుత్వం అనే భావన టీడీఈని బలంగా చేసింది. హెల్త్‌కేర్, విద్య నేరుగా అందించని ఒక చిన్న ప్రభుత్వానికి అంత ఆదాయం అక్కర్లేదు. దీంతో ఇలా సంపన్నులకు పన్నుల విషయంలో మినహాయింపులు ఇవ్వడం చాలా దేశాల్లో సాధారణం అయిపోయింది. మన దేశంలో కూడా మోదీ ఇదే పద్ధతి పాటిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ‘మినిమం గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెర్స్’ నినాదంతో వచ్చారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్‌లు తగ్గించారు. దీంతో రాహుల్ గాంధీ వంటి విపక్ష నేతలు మోదీ ప్రభుత్వాన్ని ‘సూట్ బూట్ సర్కార్’ అంటూ విమర్శలు చేశారు.


ఇది కూడా చదవండి

భయంతో బతికిన చోటే ఇప్పుడు బిందాస్.. బైడెన్‌కు థాంక్స్ చెబుతున్న అమెరికన్లు..


ఈ పథకం ప్రకారం సృష్టించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగాల్లో 90శాతం ఉద్యోగాలకు కాలేజ్ డిగ్రీ అవసరం లేదని, 75 శాతం ఉద్యోగాలకు అసోసియేట్ డిగ్రీ కూడా అక్కరలేదని బైడెన్ చెప్పారు. అమెరికన్ జాబ్స్ ప్లాన్ అనేది దేశ నిర్మాణానికి బ్లూకాలర్ బ్లూ ప్రింట్ అంటూ ఆయన పేర్కొన్నారు. వాల్ స్ట్రీట్‌లో మంచి వ్యక్తులు ఉన్నారు కానీ, అమెరికా మాత్రం మధ్యతరగతి ప్రజలు, యూనియన్ల మీదే నిర్మితమైందని బైడెన్ అన్నారు. వర్కింగ్ క్లాస్ యొక్క బేరమాడే శక్తిని పెంచడం కోసం ప్రొటెక్ట్ ది రైట్ టు ఆర్గనైజ్ యాక్ట్‌ను పాస్ చేయాలని ఆయన కాంగ్రెస్‌కు సూచించారు. ఇది యూనియన్ల ఏర్పాటుకు మద్దతిస్తుంది. అలాగే దేశంలో కనీస వేతనాలను పెంచాలని ఆయన ప్రతిపాదించారు. వారానికి 40 గంటలు పనిచేసే ఏ వ్యక్తీ పేదరిక రేఖకు దిగువన ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని సూచించారు. పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలుండాలని, దీనికోసం పేచెక్ ఫెయిర్‌నెస్ యాక్ట్‌ను తీసుకురావాలనే ప్రతిపాదన చేశారు.


అమెరికన్ కుటుంబాల ఇబ్బందులను తగ్గించడం కోసం మంచి విద్య, నాణ్యమైన అందుబాటులో ఉండే చైల్డ్ కేర్, మెడికల్ లీవ్స్, కుటుంబాల్లో చిన్నారుల కోసం ట్యాక్స్ క్రెడిట్లను కూడా బైడెన్ ప్రస్తావించారు. ఏడాదిలో 12 వారాల పెయిడ్ మెడికల్ లీవ్ ఇవ్వాలని ఆయన అన్నారు. అలాగే చైల్డ్ కేర్ కోసం ఇబ్బందుల్లో ఉన్న కష్టపడే కుటుంబాలు చిల్లిగవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. చారిత్రక నల్లజాతీయుల కాలేజీలు, ట్రైబల్ కాలేజీలు, మైనారిటీకి సేవలందించే ఇన్‌స్టిట్యూట్లకు గ్రాంట్లు, పెట్టుబడులు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే యూనివర్సల్ పబ్లిక్ విద్యను 12 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచాలని బైడెన్ అభిప్రాయపడ్డారు.



2019లో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఒకసారి ప్రసంగించిన మోదీ.. దేశంలో సంపద సృష్టిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇలా సంపద సృష్టించే వారందరూ దేశానికి సేవ చేస్తున్నట్లే అని ప్రకటించారు. వారిని అనుమానించకూడదని, గౌరవించాలని సూచించారు. వాళ్లు సృష్టించకపోతే సంపద ఉండదని, దాన్ని పేదలకు పంచలేమని వివరించారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. 2019-20లో భారత వృద్ధి 4శాతానికి పడిపోయింది. పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగాలు సృష్టించడంపై వ్యాపారాలు దృష్టి పెట్టలేదు. అసలు ఈ విషయాలను సరిగా పట్టించుకోలేదు. కార్పొరేట్ ట్యాక్స్ కట్ పేరుతో ప్రభుత్వం వదులుకున్న రూ.1.5 లక్షల కోట్ల  సంపద వ్యాపారాల జేబుల్లోకి వెళ్లి, వారి లాభాలను పెంచింది. దీని వల్ల ఎవరికీ లాభం కలుగలేదు. దేశం మొత్తం కరోనాతో పోరాటంలో నానా కష్టాలు పడుతుంటే.. 2020లో కార్పొరేట్ లాభాలు మాత్రం 20 నుంచి 25శాతం పెరగడమే దీనికి నిదర్శనం. ఈ లాభాలన్నీ ఉద్యోగులను తొలగించడం, ఖర్చులు తగ్గించుకోవడం వల్లే కంపెనీలకు వచ్చినవే.


2021లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో మరికొన్నేళ్లు వృద్ధి రేటు పెరగడం కలగానే కనిపిస్తోంది. ఈ సమయంలో ప్రైవేటు రంగం కొత్త పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలను సృష్టించడం కల్లే. ఎందుకంటే ప్రస్తు పరిస్థితుల్లో అసలు ఉన్న సామర్థ్యాలనే కంపెనీలు ఉపయోగించుకోలేని పరిస్థితి, ఇప్పుడు కొత్తగా సామర్థ్యాలను పెంచుకొని ఏం చేయాలి? ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరిగిపోయాయి. 2020లో మధ్యతరగతి వర్గం మూడోవంతు తగ్గిపోయింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరినా.. దేశ జనాభాలో దాదాపు 75 మిలియన్ల మంది పేదరిక రేఖ దిగువకు చేరారు. కరోనా సెకండ్ వేవ్ మరో విషయాన్ని స్పష్టం చేసింది. ప్రజా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులకు వేరే ప్రత్యామ్నాయం లేదని తేల్చేసింది. కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రభుత్వం కేటాయింపు ఈసారి 10శాతం తగ్గించింది. ఇక దేశంలో వైద్య, ఆరోగ్య రంగం కరోనా విలయంతో ఎంతలా అల్లాడుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో ఈ రంగ సామర్థ్యం పెరగడానికి ఇంతకంటే అవకాశం లేదు. ఈ రంగంలో ప్రభుత్వం తప్పితే వేరే వాళ్లు పెట్టుబడులు పెట్టడం చాలా అరుదు.



కరోనా మహమ్మారి నుంచి కోలుకుని, దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు బైడెన్ చేస్తున్న ప్రయత్నాలను చూసి భారత్ పాఠాలు నేర్చుకోవచ్చా? అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే బైడెన్ విధానం ఢోకా లేనిదేమీ కాదు. దీని గురించి కూడా తన ప్రసంగంలో బైడెన్ స్వయంగా ప్రస్తావించారు. ‘‘ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ఇప్పటి వరకూ ఎప్పుడు సక్సెస్ కాలేదు. ఇది దిగువ, మధ్య తరగతుల నుంచి ఆర్థిక వ్యవస్థను పెంచాల్సిన సమయం’’ అని ఆయన చెప్పారు. అయితే సంపన్నుల మీద పెట్టిన ఫోకస్‌ను పేద, మధ్య తరగతి వారిపై పెట్టాలని ఐఎమ్ఎఫ్(ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్) 2015లో జరిగిన చర్చలో తెలిపింది. వృద్ధికి ఆదాయం ఒకటే కాక, ఆదాయ పంపిణీ కూడా చాలా ముఖ్యమని చెప్పిన ఈ చర్చలోని నిపుణులు.. 20 శాతం ధనికుల ఆదాయ శాతం పెరిగినప్పటికీ, ఈ లాభాలు అందరికీ అందవు కాబట్టి అది జీడీపీ వృద్ధిని సూచించదని చెప్పారు. అదే సమయంలో దిగువ తరగతికి చెందిన 20శాతం ప్రజల ఆదాయం శాతం పెరిగితే అది అధిక జీడీపీ వృద్ధిని సూచిస్తుందని చెప్పారు. ఒక దేశంలో వృద్ధి జరగాలంటే బీద, మధ్య తరగతి వారే చాలా ముఖ్యమని ఈ సమావేశంలో నిపుణులు తేల్చారు. మరి ఇక నుంచైనా మన ప్రభుత్వం కార్పొరేట్లపై కాక కష్టపడే వారిపై దృష్టి పెడుతుందేమో చూడాలి.


Updated Date - 2021-05-05T21:59:51+05:30 IST