తెరవెనుక సైనికులు!

ABN , First Publish Date - 2020-05-31T08:58:24+05:30 IST

కరోనా వేళ.. ప్రజల్లో రకరకాల అనుమానాలు. జ్వరమొచ్చినా, జలుబు చేసినా, దగ్గొచ్చినా, కాస్తంత నలతగా అనిపించినా కరోనా వచ్చిందేమో అనే అనుమానం.

తెరవెనుక సైనికులు!

కరోనా వేళ కీలకంగా ‘కంట్రోల్‌ రూం’ 

37 మంది సిబ్బంది.. 24 గంటలూ విధులు

రెండు నెలలుగా అలుపెరగని పోరాటం


హైదరాబాద్‌ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): కరోనా వేళ.. ప్రజల్లో రకరకాల అనుమానాలు. జ్వరమొచ్చినా, జలుబు చేసినా, దగ్గొచ్చినా, కాస్తంత నలతగా అనిపించినా కరోనా వచ్చిందేమో అనే అనుమానం. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎక్కడ పరీక్ష చేస్తారో తెలియదు. ఇలాంటి అనుమానాలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. లక్షణాలను దాచిపెట్టి వ్యాప్తికి కారకులైన వారూ ఉన్నారు. అలాగే.. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. 37 మంది సిబ్బంది.. కొందరు అధికారులు.. రెండు నెలలుగా మూడు షిఫ్టుల్లో ఇందులో పని చేస్తున్నారు. 040-2111 1111. ఫోన్‌ చేస్తే చాలు.. వెంటనే స్పందిస్తారు అక్కడి ఉద్యోగులు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ, రెండు నెలలుగా నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ సడలింపులతో విమాన ప్రయాణాలు మొదలైన వేళ ఈ కంట్రోల్‌ రూం బాధ్యతలు మరింతగా పెరిగాయి. నిన్నటివరకు జనం చేసిన ఫోన్లకు స్పందించిన సిబ్బంది.. ఇప్పుడు కొత్త అవతారమెత్తింది. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి వచ్చిన వారికి ఫోన్లు చేస్తున్నారు. వారి ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. హోం క్వారంటైన్‌లో ఉంటున్నారా..? వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షిస్తున్నారా..? అన్న వివరాలు సేకరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ‘తెరవెనుక సైనికుల్లా’ కంట్రోల్‌ రూమ్‌ ఉద్యోగులు తమ వంతు పోరాటం చేస్తున్నారు. కంట్రోల్‌ రూమ్‌లో ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో సెల్‌ ఏర్పాటు చేశారు. కరోనా అనుమానిత కాల్స్‌ను కొన్ని టీంలు, భోజనానికి సంబంధించి కొన్ని బృందాలు, అంబులెన్స్‌ సేవల ఫోన్లను ఒక టీం చూస్తోంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఫిర్యాదులను మరో బృందం పరిశీలిస్తుంది.  


ఒక్కో కాల్‌.. ఒక్కో కథ.. 

హైదరాబాద్‌లో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయని కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహించే ఓ అధికారి చెప్పారు. ‘‘ఇటీవల రాత్రి 12 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. పక్కింట్లో వ్యక్తి విపరీతంగా దగ్గుతున్నాడని ఫిర్యాదు చేశాడు. అతడిని ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది’’ అని తన అనుభవాలను తెలిపారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వ్యక్తి బయట తిరుగుతున్నాడనే ఫిర్యాదులు కూడా తమకు రోజూ వస్తుంటాయని మరో అధికారి అన్నారు. ‘నాకు జలుబు ఉంది. కరోనా ఏమో అని అనుమానంగా ఉంది.ఇంట్లో ఉండలేకపోతున్నా. భయమేస్తోంది. ఆస్పత్రికి పంపకుండా బయట పరీక్షలు నిర్వహించండి’ అంటూ కూడా ఫోన్లు వస్తుంటాయని తెలిపారు. అలాంటి వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి, వారి అనుమానాలను నివృతి చేస్తుంటామని కంట్రోల్‌ రూంలో పనిచేసే ఓ వైద్యాధికారి తెలిపారు. 

Updated Date - 2020-05-31T08:58:24+05:30 IST