అన్నదాతలకు ఊరట కల్పిద్దాం

ABN , First Publish Date - 2020-04-10T07:31:54+05:30 IST

‘దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడం కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో ...

అన్నదాతలకు ఊరట కల్పిద్దాం

  • లాక్‌డౌన్‌లో రాష్ట్రాలకు అండగా ఉంటాం
  • రాష్ట్రాల మంత్రులతో సమీక్షలో  కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడం కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. ఈ సందర్భంగా అన్నదాతలకు ఊరట కలిగించే చర్యలన్నీ తీసుకుంటాం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌  రాష్ట్రాలకు భరోసా ఇచ్చారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయమంత్రులు పురుషోత్తం రూపాల, కైలాశ్‌ చౌధురి, కార ్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌, సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో వ్యవసాయ పనులు కొనసాగించడంలో రాష్ట్రాలు చూపుతున్న చొరవను మంత్రి తోమర్‌ ప్రశంసించారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే మినహాయింపులపై క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కలిగించాలని రాష్ట్రాలకు సూచించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు ఇప్పటి నుంచే సంసిద్ధం కావలసిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఈ నెల 16న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధాన వ్యవసాయ కార్యకలాపాలు, ప్రస్తుత రబీలో పంటకోతలు, వ్యవసాయ మార్కెట్లు, టోకు మండీల నిర్వహణ, కనీస మద్దతు ధరతో ఉత్పత్తుల సేకరణ, రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర సౌకర్యాలను కల్పించడం వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.


లాక్‌డౌన్‌లో రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు 

విత్తనాలు వేయడం, కోతలు, ఉత్పత్తుల విక్రయాలతో సహా వ్యవసాయ కార్యకలాపాలపై క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కల్పించండం.

మినహాయింపు కార్యకలాపాలకు సంబంధించిన సంస్థల సిబ్బంది, యంత్రాలు, సామగ్రి, రవాణా తదితరాలకు సత్వరమే అనుమతులివ్వడం.

నిత్యావసర సరుకుల పంపిణీకి జాతీయ అధీకృత కంపెనీలకు అనుమతి పత్రాలు, వాటి సిబ్బందికి ప్రాంతీయ పాసులివ్వడం.

మినహాయింపుల అమలులో భాగంగా భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించడం.

అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ కరోనా వ్యాప్తి నియంత్రణ  చర్యలు చేపట్టడం.

Updated Date - 2020-04-10T07:31:54+05:30 IST