Abn logo
Jun 22 2021 @ 00:34AM

వ్యాపారం కోసమే కరోనా కొనసాగింపు

ఒకపక్క కొవిడ్-19 వైరస్ కారణంగా రోజూ వేలాదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతోంటే, జి7 అధినేతలు మాత్రం ఇంకా దానిని ఎదుర్కొనే ప్రణాళికలపై చర్చలు చేస్తూనే ఉన్నారు. గత జి7 సమావేశం నుంచి ఇప్పటిదాకా కొవిడ్-–19 కారణంగా పది లక్షల మంది మరణించారు. ఈ వైరస్ మరిన్ని రూపాంతరాలు చెందవచ్చుననీ, ప్రస్తుత టీకాలను దాటిపోగలిగే శక్తిని సైతం సంతరించుకోవచ్చుననీ హెచ్చరికలు వస్తున్నాయి. ఇంత అత్యవసరస్థితిలోనూ ప్రపంచం మొత్తానికి టీకాను అందించే ప్రణాళికపై ఒక నిర్ణయానికి రావటంలో ఇటీవలి జి7 (కార్న్‌వాల్‌) సమావేశం విఫలమైంది. విరాళంగా ఇస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన వంద కోట్ల టీకాల డోసుల సంఖ్య సమావేశాలు ముగిసేసరికి 87 కోట్లకు పడిపోయింది. అందులోనూ కేవలం 61.3 కోట్ల డోసులు మాత్రమే కొత్తవి. నిజానికి ప్రపంచం మొత్తానికి ఏడాదిన్నర కాలంలో కావాల్సిన డోసుల సంఖ్య పదకొండు వందల కోట్లు. జి7 దేశాల అధినేతలు సముద్రతీరాల్లో ఫోటోల కోసం తీరుబడిగా ఫోజులిస్తుంటే, మరోవైపు వైరస్‌ కొత్త రూపాలు ప్రజలమీద దాడి చేస్తున్నాయి. ఇంగ్లాండులో ఆల్ఫా, దక్షిణాఫ్రికాలో బీటా, బ్రెజిల్‍లో గామా, భారత్‌లో డెల్టా వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. అంతర్జాతీయ సహకారం ఆలస్యమయ్యే ప్రతి నిమిషానికీ మన పొరుగున కొందరి ప్రాణం ప్రమాదంలో పడుతున్నదన్నమాటే.


ప్రపంచ జనాభాలో 13 శాతం మాత్రమే ఉన్న జి7 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీకా సరఫరాలో మూడో వంతును కొనేశాయి. మరోపక్క ఆఫ్రికా తన 134కోట్ల జనాభాలో కేవలం 1.8 శాతానికి మాత్రమే టీకాలను ఇవ్వగలిగింది. ఈ తాత్సారం ఇలాగే కొనసాగితే, అల్పాదాయ దేశాల్లో ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలంటే 57 సంవత్సరాలు పడుతుంది. అందుకే, ‘టీకా- అంతర్జాతీయత’ (వాక్సిన్‌ ఇంటర్నేషనలిజం) కోసం ‘ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’ ఒక అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తోంది. ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జూన్‌ 18వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఐదు దేశాల ప్రభుత్వాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు, 20 దేశాల రాజకీయ ప్రతినిధులు, టీకా ఉత్పత్తిదారులు, ఆరోగ్యకార్యకర్తలు, ప్రజారోగ్యనిపుణులు పాల్గొని టీకా అంతర్జాతీయత దిశగా కృషికి నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. 


ప్రస్తుత అత్యవసర సందర్భంలో ప్రతి ఒక్కరికీ టీకా అందేట్టుగా వాటి ఉత్పత్తినీ, సరఫరానూ పెంచాలంటే- ప్రతి ప్రయోగశాలకు, ప్రతి కర్మాగారానికి, ప్రతి శాస్త్రవేత్తకు, ప్రతి ఆరోగ్య కార్యకర్తకు సాధికారత కల్పించాలి. కానీ, ఉన్నతాదాయ, మధ్యాదాయ దేశాలు టీకా సరఫరాలో 85 శాతాన్ని తామే వాడుకుంటున్నాయి. టీకాల ఉత్పత్తిలో గుత్తాధిపత్యాల్ని తొలగించడానికి ఈ దేశాలు ఏ ప్రయత్నమూ చేయటం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచం అంతటా పంచే దిశగా ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. మిగతా ప్రపంచమంతా టీకాలు లేవని గగ్గోలు పెడుతోంటే, అమెరికా, ఇతర సంపన్న దేశాలు మాత్రం ఏం చేసుకోవాలో తెలీనంత టీకాను కూడబెట్టుకుని కూచున్నాయి.  ఒక విషయం స్పష్టం: ఈ మహా విపత్తును ముగించటంలో ఉద్దేశ్యపూర్వకమైన తాత్సారం జరుగుతున్నది. 


ఒక అంచనా ప్రకారం ఈ విపత్తును ముగించేందుకు కావలిసినన్ని టీకాలను మనం కేవలం ఏడాదిలోపే తయారు చేసుకోగలం. కానీ శక్తివంతమైన ఔషధ వ్యాపార సంస్థలు టీకాల ఉత్పత్తిలో తమ సాంకేతిక పరిజ్ఞాన్ని ఎవ్వరితోనూ పంచుకోకుండా, ఉత్పత్తికి సహకరించకుండా, కావాలని ఈ విపత్తును సాగదీస్తున్నాయి. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల మీద 157 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఐక్యూవిఐఏ నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వాలు ఇప్పటికే అసాధారణ పరిమాణంలో ప్రజాధనాన్ని ప్రైవేటు కంపెనీలకు అర్పించాయి. కొవిడ్-19 టీకాల గుత్తాధిపత్యం ద్వారా లాభపడిన ఔషధ కంపెనీ నిర్వాహకులలో తొమ్మిదిమంది కొత్త బిలియనీర్లుగా అవతారమెత్తారు. వారి సంపాదన మొత్తం కలిపితే అల్పాదాయ దేశాలలో 78 కోట్ల మంది ప్రజలకు పూర్తిస్థాయి టీకాలను ఇవ్వడానికి సరిపోతుంది.


ఈ పరిస్థితి ఇక కొనసాగడానికి వీల్లేదు. ఇప్పటికే దక్షిణార్ధ గోళపు ప్రతినిధి వర్గాలు చేతులు కలిపి టీకా-అంతర్జాతీయత కోసం ఎలుగెత్తుతున్నాయి. క్యూబా, బొలీవియా, అర్జెంటీనా, మెక్సికో, కెన్యా, కేరళ వంటి ఎన్నోచోట్ల నుంచి ఈ నినాదాలు వినిపిస్తున్నాయి. ఉత్తరార్ధ గోళం నుంచి కూడా- ఇంగ్లాండు, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి మిత్రులు ఈ పిలుపునకు స్పందిస్తున్నారు. బడా ఔషధ కంపెనీలకు దాసోహమంటున్న తమ ప్రభుత్వాలను నిలదీసేందుకు ఈ దేశాల ప్రజలూ సిద్ధమవుతున్నారు. విర్చో, బయోలైస్, ఫియోక్రూజ్ వంటి టీకా ఉత్పత్తి సంస్థలు కూడా తమ వంతు సహాయం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మహత్తర కలయికకు ఒకటే లక్ష్యం: టీకాల తయారీ, పంపిణీ అందరి కోసం జరగాలి, టీకాలు అందరికీ చేరాలి. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ‘మన జీవితాలూ స్వేచ్ఛా ప్రమాదంలో ఉన్నాయి, దక్షిణార్ధ గోళపు సార్వభౌమత్వమే ప్రమాదంలో ఉంది’ అంటూ ప్రమాదఘంటికలు మోగించింది. టీకా-అంతర్జాతీయత కోసం ప్రపంచ దేశాలను ఏకం చేస్తున్న మాతో చేతులు కలపండి.

వర్ష గండికోట–నెల్లుట్ల, అనా కైస్టర్ ఆరెండర్

(ప్రోగ్రెసివ్‌ ఇంటర్నేషనల్‌ సమ్మిట్‌ ఫర్‌ వాక్సిన్‌ ఇంటర్నేషనలిజం సమన్వయకర్తలు)