ముంచేలా ఉన్నారు..!

ABN , First Publish Date - 2020-04-07T10:24:22+05:30 IST

రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి..

ముంచేలా ఉన్నారు..!

కరోనా అనుమానితుడి మృతదేహం బంధువులకు

సందేహించినా.. భయం లేదని అప్పగింత

అంత్యక్రియలు ముగిశాక కరోనా నిర్ధారణ

పెద్దాసుపత్రి వైద్యాధికారుల నిర్వాకం

వైద్య సేవలు, అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో గుబులు

తొలి పాజిటివ్‌ కేసు విషయంలోనూ ‘పెద్దల’ నిర్లక్ష్యం

జిల్లాను కబలిస్తున్న కరోనా.. ఇంకా మారని అధికారులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. అయినా జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. విపత్కర పరిస్థితుల్లో సమన్వయం లోపిస్తోంది. జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు పట్ల నిర్లక్ష్యం మరిచిపోక మునుపే.. ఓ కరోనా అనుమానితుడి మరణం వ్యవహారంలో మరింత నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.


ఐసొలేషన్‌లో ఉంటూ ఓ కరోనా అనుమానితుడు ఐదు రోజుల క్రితం మృతి చెందాడు. అయితే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భయపడాల్సింది లేదని, సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరపవచ్చని భరోసా ఇచ్చి మరీ పంపించారు. ఈ తతంగం ముగిసిన తరువాత ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చింది. దీంతో వైద్య సేవల్లో పాల్గొన్నవారు, మృతదేహాన్ని ప్యాక్‌ చేసి అప్పగించిన వారు, అంత్యక్రియల్లో పాల్గొన్నవారూ ప్రమాదంలో పడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల నివేదిక వచ్చేవరకు కనీస జాగ్రత్తలు పాటించాలని కూడా కర్నూలు పెద్దాసుపత్రి పెద్దలకు అనిపించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


అందరిలో భయం

కరోనా అనుమానితుడిగా అడ్మిట్‌ అయిన వ్యక్తి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేలోగా చనిపోయాడు. ఇలాంటి సందర్భంలో ఫలితాలు వచ్చేవరకూ మృతదేహాన్ని అప్పగించకుండా వేచి చూడాలి. తగిన చర్యలు తీసుకోవాలని కింది స్థాయి వైద్యులకు సూపరింటెండెంట్‌ ఆదేశాలు ఇవ్వాలి. అలా చేయకపోగా బంధువులకు అప్పగించారు. కరోనా అనుమానితుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న తరువాత కలెక్టర్‌, డీఎంహెచ్‌వో అయినా స్పందించి, తగిన సూచనలు ఇవ్వాల్సింది. మృతదేహాన్ని అప్పగిస్తే సమస్యలు తలెత్తవచ్చన్న కనీస ఆలోచన చేయలేకపోయారు. 


జిల్లా స్థాయి అధికారులంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆ వ్యక్తికి వైద్య సేవలు అందించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సుమారు 30 మంది ఆసుపత్రి సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. 


ఇంతకూ ఏం జరిగింది..?

పాణ్యం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కార్డియాక్‌ సమస్యతో ఈ నెల ఒకటో తేదీన నంద్యాల శాంతిరామ్‌ హాస్పిటల్‌కు వెళ్లాడు. పరీక్షించిన వైద్యులకు అనుమానాలు తలెత్తాయి. దీంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్‌ చేశారు. అదే రోజున ఆ వ్యక్తి కర్నూలు పెద్దాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరాడు. మరుసటి రోజున కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆ వ్యక్తి నుంచి నమూనాలను సేకరించి వైరాలజి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు రాక మునుపే, చికిత్స పొందుతూ ఈ నెల 3వ తేదీన ఆ వ్యక్తి కార్డియాక్‌ సమస్యతో మరణించాడు. ఈ విషయాన్ని వైద్యాధికారులు కర్నూలు, పాణ్యంలోని ఆ వ్యక్తి బంధువులకు తెలియజేసి పిలిపించారు.


తాము ఆసుపత్రికి వెళ్లే సరికి మృతదేహాన్ని ప్యాక్‌ చేసి సిద్ధంగా ఉంచారని మృతుడి బంధువులు అంటున్నారు. కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరినందున, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సందేహించారు. అయితే భయపడాల్సిన పని లేదని, సంప్రదాయబద్ధంగా ఖననం చేసుకోవచ్చని అక్కడి వైద్యులు వారికి ధైర్యం చెప్పి పంపించారు. ఆ సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారా..? రిపోర్టులు వచ్చాయా అని తాము అడిగినా సమాధానం చెప్పలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.


అప్పుడూ అలాగే..

నొస్సం రైల్వేస్టేషన్లో ట్రాక్‌మన్‌గా పని చేస్తున్న ఓ యువకుడికి కరోనా సోకినట్లు మార్చి 28న తేలింది. జిల్లాలో ఇదే పాజిటివ్‌ కేసు. మరో ఐదుగురితో కలిసి నొస్సంలో ఉంటున్న ఆ యువకుడు మార్చి 5న తన సొంత ఊరు రాజస్థాన్‌లోని దౌకా జిల్లా టీపల్కికి వెళ్లాడు. అక్కడి నుంచి ఆగ్రాకు వెళ్లి.. మార్చి 19న తిరిగి నొస్సంకు చేరుకున్నాడు. ఆ రోజు నుంచి జ్వరంతో బాధపడుతూ మార్చి 23న కర్నూలు పెద్దాసుపత్రిలో చేరాడు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలను తిరుపతి ల్యాబ్‌కు పంపించారు. 28న కరోనా పాజిటివ్‌ అని నివేదిక వచ్చింది.


కరోనా అనుమానితులను ఐసొలేషన్‌ వార్డులో ఉంచాలి. కానీ 24వ తేదీ రాత్రి ఎమ్‌ఎమ్‌-3 వార్డుకు తరలించారు. మూడు రోజులు అక్కడే సాధారణ రోగుల మధ్య ఉంచి చికిత్స చేశారు. అతనితో పాటు వార్డులో ఉన్న ఇతర రోగులు, వైద్యులు, సిబ్బందికి ఎలాంటి మాస్క్‌లు, యూనిఫాం ఇవ్వలేదు. కరోనా సోకినట్లు 27వ తేదీ మధ్యాహ్నానికే ఆసుపత్రి వర్గాలకు అంతర్గతంగా సమాచారం వచ్చింది. దీంతో బాధితుడిని ఐసొలేషన్‌కు తరలించారు. అంతకు మునుపు మూడు రోజులు ఎమ్‌ఎమ్‌ 3 వార్డులో ఆరుగురు సాధారణ రోగులకు వైద్యం చేశారని రికార్డులు చెబుతున్నాయి. సూపరింటెండెంట్‌ ఆదేశాలతోనే ఇలా వ్యవహరించా మని పలువురు వైద్యులు తెలిపారు. కానీ సూపరింటెండెంట్‌ మాత్రం పూటకో మాట చెప్పి ఉన్నతాధికారులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. విషయం బయటకు పొక్కడంతో ఎమ్‌ఎమ్‌-3, 4 వార్డులను కరోనా అనుమానిత కేసుల కోసమే ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్‌ ప్రకటించారు.


అదే నిజమైతే.. మొదటి నుంచి ఐసొలేషన్లో చికిత్స పొందుతున్న బాధితుడిని కరోనా నోడల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న వైద్యుడు అంత ఆలస్యంగా ఎందుకు పరిశీలించారు? ఎమ్‌ఎమ్‌-3లో సేవలు అందించిన వైద్యుల్ని, వైద్య విద్యార్థుల్ని పాజిటివ్‌ కేసు నమోదయ్యాక హోం క్వారంటైన్‌కు ఎందుకు తరలించారు..? ఈ ప్రశ్నలకు ఉన్నతాధికారులు కూడా నోరు మెదపలేకపోతున్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చినా, జిల్లా అధికారుల్లో మార్పు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


బంధువులకు చెప్పలేదు..

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలను ఈ నెల 5న అధికారులు మూడు విడతలుగా ప్రకటించారు. ఆ జాబితాలో పాణ్యం నుంచి ఐసొలేషన్‌లో చేరి, మృతి చెందిన వ్యక్తి పేరు కూడా ఉంది. కానీ ఈ విషయాన్ని మృతుని బంధువులకు ఇప్పటికీ తెలియజేయకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రికి సోమవారం తాము వెళ్లామని, కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాల గురించి అడిగితే ఇంకా రాలేదని చెప్పారని, తర్వాత చెబుతామని పంపించారని మృతుడి బంధువులు తెలిపారు. ఇంతలో కరోనా పాజిటివ్‌ కేసుల జాబితాలోని మృతుడి వివరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఓ సన్నిహితుడితో స్నేహపూర్వకంగా మెలిగాడని విచారణలో తేలినట్లుగా తెలిసింది. 

Updated Date - 2020-04-07T10:24:22+05:30 IST