పాఠశాలలపై కరోనా పంజా!

ABN , First Publish Date - 2021-04-16T04:44:22+05:30 IST

ల్లాలో పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని ఒకవైపు పాఠశాల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నా... ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్‌బారిన పడుతున్నారు.

పాఠశాలలపై కరోనా పంజా!
విజయగనరంలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థుల మధ్య కానరాని భౌతిక దూరం (ఫైల్‌)





వైరస్‌బారిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

 పదుల సంఖ్యలో వెలుగుచూస్తున్న కేసులు

ఎక్కడా కానరాని నిబంధనలు

ఆందోళనలో తల్లిదండ్రులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 15 :

కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు సగటున వందలాది కేసులు నమోదువుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడాలేకుండా అన్నిచోట్ల విజృంభిస్తున్నాయి.ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైరస్‌ బారిన పడుతున్నారు. పాఠశాలల్లో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించకపోవడం, శానిటేషన్‌ వంటివి కానరావడం లేదు. ఇవన్నీ కరోనా వ్యాప్తికి కారణాలవుతున్నాయి. దీంతో పిల్లలను బడికి పంపాలా? వద్దా? అని తల్లిదండ్రులు మదనపడుతున్నారు. వారి భవిష్యత్‌పై బెంగ వారిని వెంటాడుతోంది. 

 జిల్లాలో పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని ఒకవైపు పాఠశాల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నా... ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్‌బారిన పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ లెక్కల ప్రకారం 2,829 ప్రభుత్వ,  581 ప్రైవేటు పాఠశాలలున్నాయి. 3,09,480 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి మాస్కులతో పాటు శానిటైజర్లు అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ చాలా పాఠశాలల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో మాస్కులు పంపిణీ కాలేదు. చాలాచోట్ల కనీస నిబంధనలు కానరావడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. మధ్యాహ్న భోజన సమయంలో సైతం విద్యార్థులు గుంపులుగా ఒకేచోట భోజనాలు చేస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు తరువాత విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా ఉన్నత తరగతులు, అటు తరువాత ప్రాథమిక తరగతులను ప్రారంభించారు. అయితే నిబంధనలు పక్కాగా పాటించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కచ్చితంగా మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటిస్తూనే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.  శానిటైజర్‌ వినియోగాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ నిబంధనలు కొన్ని పాఠశాలల్లో పక్కాగా అమలు కావడం లేదు. మరికొన్నచోట్ల ‘నాడు-నేడు’ పనులు పెండింగ్‌ ఉండడంతో గదులను అప్పజెప్పకపోవడంతో ఇరుకు గదుల్లో దగ్గర దగ్గరగా కూర్చోవాల్సి వస్తోంది.  విద్యార్థులు మాస్కు ధరించే విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడంలేదు. మధ్యాహ్నభోజన విషయంలోనూ, పాఠశాలలోకి ప్రవేశించినప్పుడు, బయటకు వచ్చేటప్పుడు అజాగ్రత్తగా ఉంటున్నారు.


బడికి పంపాలా? వద్దా?

జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండడంతో  పిల్లలను పాఠశాలకు పంపాలా? వద్దా ? అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు,  విద్యార్థులు కరోనా బారిన పడడంతో పాఠశాలలకు పంపేందుకు భయపడుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులవైపే మొగ్గుచూపుతున్నారు. గత వారంరోజులుగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించలేదు. కరోనా ఉద్ధృతి తగ్గే వరకూ బడులకు పంపకుంటేనే మేలన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. 


పక్కాగా నిబంధనలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పక్కాగా కరోనా నిబంధనలు అమలుచేస్తున్నాం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నిర్థారణ పరీక్షలు చేస్తున్నాం. వైరస్‌ లక్షణాలు బయటపడితే వెంటనే క్వారంటైన్‌కు తరలించి వైద్యసేవలందిస్తున్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సలహాలు, సూచనలు అందిస్తున్నాం. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.

-నాగమణి, డీఈవో, విజయనగరం






Updated Date - 2021-04-16T04:44:22+05:30 IST