వైద్య సిబ్బందిని వెంటాడుతున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-22T05:44:16+05:30 IST

ఉమ్మడి జిల్లాలో వైద్యసిబ్బందిని కరోనా వెంటాడుతోంది.

వైద్య సిబ్బందిని వెంటాడుతున్న కరోనా

 పోచంపల్లి పీహెచ్‌సీలో 9 మందికి పాజిటివ్‌

 తంగడపల్లి వైద్యాధికారికి సైతం 

శాలిగౌరారం ఇద్దరికి

 నల్లగొండ, చండూరు మునిసిపల్‌ కార్యాలయంలో ముగ్గురికి పాజిటివ్‌ 

ఇంటింటా జ్వర సర్వే ప్రారంభం

భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌ టౌన్‌, శాలిగౌరారం, రామగిరి, చండూరు, దేవరకొండ, కట్టంగూర్‌, వలిగొండ, నల్లగొండ అర్బన్‌, జనవరి 21: ఉమ్మడి జిల్లాలో వైద్యసిబ్బందిని కరోనా వెంటాడుతోంది. భూదాన్‌పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన పరీక్షల్లో వైద్య సిబ్బందికి తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 19న నలుగురు వైద్య సిబ్బందికి, 20న ముగ్గురికి, శుక్రవారం మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్థానిక కెనెరా బ్యాంకులో పనిచేస్తున్న మరో ఉద్యోగికి సైతం పాజిటివ్‌ వచ్చింది. చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోని తంగడపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.శివప్రసాద్‌రెడ్డి, సీహెచ్‌వో మనోహర్‌తో పాటు నలుగురు నర్సులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నల్లగొండ మునిసిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు, చండూరు మునిసిపల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. దేవరకొండ డివిజన్‌లో శుక్రవారం ఒక్కరోజే 159 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేవరకొండలో 57 మందికి, చందంపేటలో ఆరుగురికి, చింతపల్లిలో నలుగురికి, డిండిలో 21 మందికి, గుడిపల్లిలో నలుగురికి, గుర్రంపోడులో 12 మందికి, కొండమల్లేపల్లిలో 28 మందికి, బొడ్డుపల్లిలో ఐదుగురికి, మర్రిగూడ మండలంలో ఎనిమిది మందికి, పీఏపల్లి, వీటీనగర్‌లో ఏడుగురు చొప్పున పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. కట్టంగూర్‌ పీహెచ్‌సీలో 20 మందికి, వలిగొండ పీహెచ్‌సీలో 38 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా, ఇంటింటా జ్వర సర్వే శుక్రవారం ప్రారంభమైంది. నల్లగొండ జిల్లాలో తొలి రోజు 58,440కుటుంబాల్లో 2,18,600 మందిని పరీక్షించి 2041 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 24వ తేదీ నుంచి 31వరకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే నగల దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్వాహకులు నిర్ణయించారు. 

Updated Date - 2022-01-22T05:44:16+05:30 IST