రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుముఖం

ABN , First Publish Date - 2020-04-10T06:20:25+05:30 IST

తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుతోందా.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనమా.. అంటే అవుననే అంటున్నాయి...

రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుముఖం

గురువారం మరో 18.. ఒకరి మృతి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుతోందా.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనమా.. అంటే అవుననే అంటున్నాయి వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు. తెలంగాణలో గురువారం కొత్తగా 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోంది అనుకున్న సమయంలోనే మర్కజ్‌ కారణంగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒక రోజు ఏకంగా 75 కేసులు నమోదయ్యాయి. బుధవారం కూడా 49 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గురువారం 18 కేసులే నమోదు కావడం ఉపశమనాన్ని కలిగిస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి 50 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అనుమానితుల క్వారంటైన్‌ కూడా పూర్తయింది. ఈ కేటగిరీలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు దాదాపు లేవని చెబుతున్నారు.


రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో 167 కేసులు, నిజామాబాద్‌లో 47, రంగారెడ్డి 27, వరంగల్‌ అర్బన్‌ 23, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 21 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో  కరోనా వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌ఫర్‌ జరగలేదని ప్రభుత్వం తెలిపింది. నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో గడిచిన 10 రోజుల్లో మొత్తం 47 కేసులు నమోదయ్యాయి. వీరిలో మర్కజ్‌కు వెళ్లివచ్చినవారే 29 మంది దాకా ఉన్నారు. నిర్మల్‌ జిల్లాలో కొత్తగా 5 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 15కు చేరుకొంది. కాగా, ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి గురువారం పానగల్‌లోని అర్బన్‌ ఆస్పత్రి డాక్టర్‌ నితిన్‌ గౌతమ్‌, సిబ్బంది కాళ్లు కడిగి శాలువాలతో సత్కరించారు. 

Updated Date - 2020-04-10T06:20:25+05:30 IST