జిల్లాలో 40కి తగ్గిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-06T09:57:26+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ ఆదివారం కొద్దిగా మందగించింది. తాజాగా మరో 40 మంది వైరస్‌బారిన పడ్డారు.

జిల్లాలో 40కి తగ్గిన కరోనా కేసులు

రెండు వారాల తరువాత ఇదే అత్యల్పం 

మొత్తం 1,278కు చేరిన పాజిటివ్‌లు

అనకాపల్లిలో తగ్గని జోరు

మరో 9 మందికి వైరస్‌... సెంచరీ దాటిన బాధితులు

ఎంవీపీ కాలనీ, మద్దెలపాలెంలో మూడేసి, ఇసుకతోట, ఆరిలోవలో రెండేసి కేసులు 

మహారాణిపేట పీఎస్‌లోహెచ్‌సీ, పీసీలకు పాజిటివ్‌


విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ ఆదివారం కొద్దిగా మందగించింది. తాజాగా మరో 40 మంది వైరస్‌బారిన పడ్డారు. గత నాలుగు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఇంత తక్కువ కేసులు నమోదు కావడం గత నెల 21వ తేదీ తరువాత ఇదే ప్రథమం. ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు 76, 79, 81, 102 చొప్పున కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య 1278కు చేరింది. ఇప్పటి వరకు 85,686 మందికి పరీక్షలు నిర్వహించగా, 82,943 మందికి నెగెటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయి. ఇంకా 1465 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. 


అనకాపల్లిలో వైరస్‌ విహారం మరో 9 మందికి పాజిటివ్‌

అనకాపల్లిలో కరోనా వైరస్‌ స్వైరవిహారం చేస్తున్నది. ఆదివారం మరో తొమ్మిది మంది వైరస్‌బారిన పడ్డారు. దీంతో కేసుల సంఖ్య 104కి చేరింది. గవరపాలెం బుద్ద ప్రకాశరావునాయుడు వీధిలో 36 ఏళ్ల మహిళ, విజయరామరాజుపేటలో 19ఏళ్ల యువకుడు, దిబ్బవీధిలో 30 ఏళ్ల మహిళ, దాసరిగెడ్డ రోడ్డులో 35 ఏళ్ల మహిళ, కొణతాల చిన్నయ్య వీధిలో 35 ఏళ్ల మహిళ, శారదాకాలనీలో 37 ఏళ్ల కానిస్టేబుల్‌, కొణతాల చిన్నయ్యగారి వీధిలో ఏడేళ్ల బాలుడు, సతకంపట్టు ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల మహిళ, పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న 34 ఏళ్ల కానిస్టేబుల్‌ కరోనా వైరస్‌బారిన పడ్డారు. కొణతాల చిన్నయ్యగారి వీధికి చెందిన ఏడేళ్ల బాలుడి తల్లిదండ్రులు ఇప్పటికే వైరస్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


మహారాణిపేట పీఎస్‌లో హెచ్‌సీ, పీసీలకు...

మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. వీరిలో ఒకరిది కొబ్బరితోట, మరొకరిది కంచరపాలెమని అధికారులు చెప్పారు. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లోని దండుబజార్‌లో కొన్నాళ్లు విధులు నిర్వహించారు. ఈ సమయంలో వైరస్‌ బారినపడి ఉంటారని భావిస్తున్నారు. 


మద్దిలపాలెంలో ముగ్గురికి...

మద్దిలపాలెం పరిధిలోని 22వ వార్డులో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. న్యూ రేసపువానిపాలెంలో నివాసముంటున్న రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌(30), పిఠాపురం కాలనీలో నివాసముంటున్న ద్వారకా జోన్‌ పీఎస్‌ హోమ్‌గార్డు(35), ఆరు కుళాయిల జంక్షన్‌లో నివాసముంటున్న వృద్ధుడు(60)కి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి.


ఎంవీపీ కాలనీలో ముగ్గురికి.. 

ఎంవీపీ కాలనీలోని వివిధ ప్రాంతాల్లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఆదర్శనగర్‌కు చెందిన మహిళ(42), ఎంవీపీ కాలనీ సెక్టార్‌-5కు చెందిన వ్యక్తి(46), ఇదే కాలనీకి చెందిన వ్యక్తి(47) వైరస్‌ బారిన పడ్డారు.


ఇసుకతోటలో ఇద్దరు మహిళలకు..

ఇసుకతోట బీసీ హాస్టల్‌ సమీపంలో నివాసముంటున్న మహిళ(45), రామాలయం సమీపంలో మరో మహిళ(37) వైరస్‌ బారినపడ్డారు. ఒకరు ఎంవీపీ రైతు బజార్‌లో విక్రయదారికాగా, మరొకరు ఏఎన్‌ఎం. వీరితో కాంటాక్ట్‌ అయిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


ఆరిలోవలో ఇద్దరికి..

ఆరిలోవ అప్సరా కాలనీ ప్రాంతంలో  27 ఏళ్ల యువకుడు, 80 ఏళ్ల వృద్ధుడు వైరస్‌ బారినపడ్డాడు. వీటితో కలిపి ఆరిలోవ ప్రాంతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 25కు చేరింది. 


అంగటిదిబ్బ ప్రాంతంలో ఒకరికి.. 

అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చాడు. ఆ సమయంలో శ్వాబ్‌ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా, ఆదివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. 


భీమిలి ఎగువపేటలో కార్పెంటర్‌కు.. 

భీమునిపట్నం ఎగువపేటలో ఓ కార్పెంటర్‌(33)కు వైరస్‌ సోకింది. ఇతను నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంతానికి రోజూ పనికి వెళ్లి వస్తుంటాడు. నాలుగు రోజులు కిందట ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. 


గోపాలపట్నంలో ఒకరికి..

గోపాలపట్నం పరిధి లక్ష్మీనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడ్డాడు. ఇతను చేపల వ్యాపారం చేస్తుంటాడు. ఫిషింగ్‌ హార్బర్‌లో ఇటీవల పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో వ్యాపారం చేసే వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇతను వ్యక్తి వైరస్‌ బారినపడినట్టు ఆదివారం తేలింది. 


చినముషిడివాడలో ఒకరికి.. 

చినముషిడివాడ క్రాంతి నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో 36 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఇతను పూర్ణామార్కెట్‌ పండ్ల దుకాణంలో పని చేస్తుంటాడు. జ్వరంతో బాధపడుతుండడంతో రెండో తేదీన పరీక్షలు నిర్వహించారు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. 


ప్రహ్లాదపురంలో ఒకటి..

వేపగుంట పరిధిలోని ప్రహ్లాదపురం అంజనాద్రి కాలనీలో 31 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆదివారం వచ్చిన ఫలితాల్లో పాజటివ్‌ నిర్ధారణ అయుంది. 


సీతన్న గార్డెన్స్‌లో...

మాధవధార సీతన్నగార్డెన్స్‌లో 40 ఏళ్ల వ్యక్తి వైరస్‌ బారినపడ్డాడు. కంటెయిమెంట్‌ జోన్‌లో ఉంటున్న ఈయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఒకటో తేదీన నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో పాజిటివ్‌ తేలింది. 


జూనియర్‌ మహిళా డాక్టర్‌కు....

ఉక్కు జనరల్‌ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న వైద్యురాలికి కరోనా సోకింది.  కిడ్నీ సంబంధ సమస్యతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన మహిళకు ఆమె వైద్య సేవలందించారు. సదరు మహిళకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో  వైద్యురాలికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యురాలు సేవలు పొందిన రోగులు, ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 


దొండపర్తిలో యువతి.. 

దొండపర్తి ప్రాంతంలో 19 ఏళ్ల యువతికి వైరస్‌ సోకింది. ఆమె వైరస్‌ బారినపడడడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారుల చెప్పారు. 


వీఎంఆర్‌డీఏలో కంప్యూటర్‌ ఆపరేటర్‌కు.. 

వీఎంఆర్‌డీఏలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న మహిళకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి ఆదివారం పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 


పరారీలో వైరస్‌ బాధితుడు.. 

పెయిందొరపేట అడ్రస్‌ ఇచ్చిన ఓ వ్యక్తికి కరోనా టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది. అతను అడ్రస్‌ ఇచ్చిన ఇంటికి వెళ్లగా అది తప్పని తేలింది. ఫోన్‌ చేసినా స్పందించక పోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మొబైల్‌ సిగ్నల్స్‌ ప్రకారం  నౌరోజీ రోడ్డు, మహాహరాణిపేట, ఆంథోని నగర్‌ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఇతనిని పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.


ఎలమంచిలిలో ఒకిరికి....

ఎలమంచిలి పట్టణంలోని కొత్తపేట కాలనీ సమీపంలో 65 ఏళ్ల వ్యక్తి వైరస్‌ బారిన పడ్డాడు. అనకాపల్లి ఆస్పత్రిలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రేగుపాలెం వైధ్యాధికారి తెలిపారు. 


జి.కోడూరులో యువకునికి....

మాకవరపాలెం మండలంలో జి.కోడూరులో 24 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఇతను హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ... ఈ నెల 4వ తేదీన గ్రామానికి వచ్చాడు. కరోనా పరీక్షలు నిమిత్తం అదే రోజూ నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. 


నాతవరం మండలంలో...

నాతవరం మండలం ఏపీపురంలో ఒక యువకుడు(32) వైరస్‌బారిన పడ్డాడు. ఇతను శ్రీకాళహస్తి నుంచి గత నెల 26న స్వగ్రామానికి వచ్చాడు అప్పటి నుంచి  హోం క్వారంటైన్‌లో వున్నాడు. 3వ తేదీన నర్సీపట్నం ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. వైద్య సేవల కోసం నర్సీపట్నం తరలించారు.

Updated Date - 2020-07-06T09:57:26+05:30 IST