Abn logo
Jul 4 2020 @ 14:52PM

మరో 149 మందికి కరోనా‌.. అనంతపురం జిల్లాలో 1972కు చేరిన బాధితులు

రంగంలోకి కరోనా స్పెషలాఫీసర్‌

ఆస్పత్రుల్లో వసతుల్లేక అల్లాడుతున్న రోగులు

మాటలకే పరిమితమైన అధికారుల చర్యలు


అనంతపురం వైద్యం(ఆంధ్రజ్యోతి) : కరువు జిల్లాలో  కరోనా కనికరం లేకుండా విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో మహమ్మారిబారిన పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే 149 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ లెక్కన జిల్లాలో కరోనా బాధితులు 1972కు చేరిపోయారు. ఇందులో 9 మంది మరణించగా 1111 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్నారు. 852 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొం దుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజూవారిగా రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లా కరోనా కేసుల సంఖ్యలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది.  అనంతపురం నగరంలో కరోనా కేసుల ఉధృతి అమాంతం పెరుగుతోంది. ప్రస్తుతం 80 శాతం కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. తాడిపత్రిలో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ కేసులు విజృంభిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో కరోనా జిల్లా స్పెషలాఫీసర్‌, ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌ మళ్లీ అనంతపురానికి చేరుకున్నారు. శుక్రవారం జిల్లా అధికారులతో సమావేశమై కొవిడ్‌ ఆస్పత్రులు, కేసుల నమోదు, చికిత్సలు తదితర వాటిపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆయన డీఐజీ, జిల్లా ఎస్పీ, జేసీలతో కలిసి నగరంలోని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తూ సాగారు.  


ఆస్పత్రుల్లో వసతులు కరువు.. బాధితులకు అవస్థలు 

కరోనా అంటేనే జనం వణికిపోతున్నారు. దేన్ని తాకితే వస్తుందో, ఎవరితో మాట్లాడితే అంటుకుంటుందోననే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రోగులను అదో రకంగా చూస్తున్నారు. దీంతో అసలే వైరస్‌ సోకి అల్లాడుతున్న బాధితులకు ఇది మరింత ఇబ్బందిగా మారింది. అలాంటి బాధితులకు అధికార యంత్రాంగం భరోసా కల్పించి మంచి వైద్యసేవలు, వస తులు అందించి ఆత్మవిశ్వాసం కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇందుకు విరుద్ధంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది. కరోనా  బాధితులకు వైద్య సేవలు అందించే కొవిడ్‌-19 ఆస్పత్రి విభాగాలలో అవసరమైన వసతులు కల్పించడం లేదు. గాలి, వెలుతురుతో పాటు సరైన ఆహారం, అల్పాహారం కూడా అందించలేకపోతున్నారు.


పరుపుల సంఖ్య కూడా ఆయా ఆస్పత్రుల్లో తక్కువగా ఉండటంతో బాధితులు ఉండేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లా ఆస్పత్రి, హిందూపురం ఆస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, ఎస్కేయూ, కిమ్స్‌ సవీరా, గుత్తిరోడ్డు నారాయణ కళాశాల, వివేకానంద కళాశాలలో కొవిడ్‌ బాధితులకు చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ అవసరం మే రకు వసతులు కల్పించడం లేదు. జిల్లాలో కేసులు పెరుగుతున్నా వసతులు మాత్రం మెరుగుపడకపోవడంతో బాధితులను ఆయా కేంద్రాల్లో ఉంచడానికి సమస్యగా మారుతోంది. కరోనా బాధితులకు అన్ని వసతులు, మెరుగైన చికిత్సలు అందిస్తామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


శాంపిళ్ల సేకరణలో జాప్యం

శాంపిళ్ల సేకరణ జిల్లాలో ఇంకా అస్తవ్యస్తంగానే సాగుతోంది. ల్యాబ్‌లలో వేలాది నమూనాలు పెండింగ్‌లో ఉండటంతో జిల్లా వ్యాప్తంగా శాంపిళ్ల సేకరణ నిలిపేశారు. అయితే రోజూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆయా బాధితుల కుటుంబసభ్యులు, కాంటాక్ట్‌లు సైతం శాంపిళ్లు ఇచ్చి పరీక్షలు చేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. అయితే శాంపిళ్ల సేకరణ నిలిపేయటంతో అనుమానితులు ఎక్కడికి వెళ్లి శాంపిళ్లు ఇవ్వాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మాలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ ఉంటే మా కుటుంబంతో కలిసిన వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం శాంపిళ్ల సేకరణ విషయంలో పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వడం లేదు. ఇది అనుమానితులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement