కరోనా: హైదరాబాద్‌లో సీన్ రివర్స్.. అనుకున్నదొకటి.. జరుగుతున్నది మరొకటి..!

ABN , First Publish Date - 2020-05-26T16:41:43+05:30 IST

కరోనా వైరస్‌కు కళ్లెం పడడం లేదు. బస్తీలు, కాలనీల్లో వేగంగా విస్తరిస్తోంది. ఒకరికి సోకితే మొత్తం కుటుంబం వైరస్‌ బారిన పడుతోంది. గ్రేటర్‌లో సోమవారం తాజాగా 31 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు

కరోనా: హైదరాబాద్‌లో సీన్ రివర్స్.. అనుకున్నదొకటి.. జరుగుతున్నది మరొకటి..!

కరోనా కట్టడి ఎలా..?

పెరుగుతున్న కేసులతో ఆందోళన

శరవేగంగా విజృంభణ  

సోమవారం మరో 31


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌కు కళ్లెం పడడం లేదు. బస్తీలు, కాలనీల్లో వేగంగా విస్తరిస్తోంది. ఒకరికి సోకితే మొత్తం కుటుంబం వైరస్‌ బారిన పడుతోంది. గ్రేటర్‌లో సోమవారం తాజాగా 31 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు ప్రకటించారు. గ్రేటర్‌లో ముగ్గురు కానిస్టేబుల్స్‌, ఓ వైద్యుడికి వైరస్‌ సోకింది. పెరుగుతున్న కేసులతో అటు అధికారులు.. ఇటు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో దాదాపు రెండు వందల కట్టడి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది. కేవలం బాధితులు ఉండే ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వరకే పరిమితమయ్యాయి. కట్టడి కేంద్రాలు ఎత్తివేయడంతో కరోనా వ్యాప్తి తగ్గిందని అందరూ భావించారు. కేవలం సింగిల్‌ డిజిట్‌లోనే కేసులు ఉంటాయని మే నెల ప్రారంభంలో అంచనా వేశారు. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు హైదరాబాద్‌లో కూడా సడలింపులు ఇవ్వడంతో విపరీతమైన రద్దీ పెరిగింది. 


గ్రేటర్‌పై పంజా...

ఈ నెల మొదటి నుంచీ కరోనా గ్రేటర్‌పై ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. గత నెల కంటే ఈ నెలలో నమోదైన కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంది. గత నెలలో 46, 38 అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్యలైతే.. ఈ నెల 11న అంతకంటే ఎక్కువగా 79 నమోదయ్యాయి. 14వ తేదీన 40, 16వ తేదీన 44 కేసులు ఉండడం కరోనా తీవ్రతను తెలియజేస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గడిచిన 25 రోజుల్లోనే 674 మందికి వైరస్‌ సోకింది. ఈ కేసులన్నీ ఎక్కువగా కొన్ని కుటుంబాల సభ్యుల మధ్యే ఉన్నాయి. 


మొదటి వారంతోనే....?

మర్కజ్‌ లింక్‌లన్నీ ఈనెల మొదటి వారంతో పూర్తవుతాయని అధికారులు భావించారు. మే 7వ తేదీ వరకు కరోనా పాజిటివ్‌ సంఖ్య జీరోకు చేరుకుంటుందని యంత్రాంగం అంచనా వేసింది. అయితే.. అందరి అంచనాలు తారుమారు చేస్తూ కరోనా దూసుకుపోతోంది. 


వైద్యులు, పోలీసులపైనా దాడి

కరోనా రోగులు, అనుమానితులు, వలస కార్మికులకు సేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులపై కూడా కరోనా దాడి చేస్తోంది. తాజాగా ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన అంకాలజిస్టు కరోనా బారిన పడి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నగరంలో ముగ్గురు కానిస్టేబుళ్లు వైరస్‌ బారిన పడ్డారు. కాచిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌కు వైరస్‌  సోకగా.. నెలల గర్భిణి అయిన అతని భార్యకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


మే నెలలో నమోదైన కేసుల సంఖ్య:

మే 1వ తేదీ: 05 కేసులు

మే 2వ తేదీ: 15 కేసులు

మే 3వ తేదీ: 20 కేసులు

మే 4వ తేదీ: 03 కేసులు

మే 5వ తేదీ: 11 కేసులు

మే 6వ తేదీ: 11 కేసులు

మే 7వ తేదీ: 12 కేసులు

మే 8వ తేదీ: 10 కేసులు

మే 9వ తేదీ: 30 కేసులు

మే 10వ తేదీ: 26 కేసులు

మే 11వ తేదీ: 79 కేసులు

మే 12వ తేదీ: 37 కేసులు

మే 13వ తేదీ: 31 కేసులు

మే 14వ తేదీ: 40 కేసులు

మే 15వ తేదీ: 33 కేసులు

మే 16వ తేదీ: 44 కేసులు

మే 17వ తేదీ: 37 కేసులు

మే 18వ తేదీ: 26 కేసులు

మే 19వ తేదీ: 34 కేసులు

మే 20వ తేదీ: 15 కేసులు

మే 21వ తేదీ: 26 కేసులు

మే 22వ తేదీ: 42 కేసులు

మే 23వ తేదీ: 33 కేసులు

మే 24వ తేదీ: 23 కేసులు

మే 25వ తేదీ: 31 కేసులు

Updated Date - 2020-05-26T16:41:43+05:30 IST