పశ్చిమ గోదావరి జిల్లాలో హైదరాబాధ ఎక్కువే.. అక్కడి నుంచి తిరిగొచ్చిన వాళ్లల్లో..

ABN , First Publish Date - 2020-06-24T21:32:31+05:30 IST

కరోనా కేసులు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి.. ఆరంభంలో పట్టణాల్లో కనిపించిన కరోనా రాను రాను పల్లెలపై పడింది.. ప్రస్తుతం పల్లెల్లో తన ఉధృతిని చూపిస్తోంది. ఏలూరు రూరల్‌ మండలంలోని చొదిమెళ్ళ పంచాయతీ దొండపాడు, శ్రీరామ్‌నగర్‌లో యువకుడికి,

పశ్చిమ గోదావరి జిల్లాలో హైదరాబాధ ఎక్కువే.. అక్కడి నుంచి తిరిగొచ్చిన వాళ్లల్లో..

ఏలూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి.. ఆరంభంలో పట్టణాల్లో కనిపించిన కరోనా రాను రాను పల్లెలపై పడింది.. ప్రస్తుతం పల్లెల్లో తన ఉధృతిని చూపిస్తోంది. ఏలూరు రూరల్‌ మండలంలోని చొదిమెళ్ళ పంచాయతీ దొండపాడు, శ్రీరామ్‌నగర్‌లో యువకుడికి, పాలకొల్లు రూరల్‌ లంకలకోడేరులో 72 ఏళ్ల వృద్ధురాలికి, తణుకు మండలం వేల్పూరులో ఒక కేసు నమోదయ్యాయి. కాళ్ల మండలం  పెదఅమిరంలో ఈ నెల 9న విదేశాల నుంచి  వచ్చిన మహిళకు కరోనా సోకింది. అత్తిలి మండలంలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తహసీల్దార్‌ రామాంజనేయులు తెలిపారు. కొత్తగా అత్తిలి రజకవీధి కంటైన్మెంట్‌ జోన్‌లో ఐదుగురికి, అత్తిలి ఎన్‌టీఆర్‌ నగర్‌లో ఒకరికి, బల్లిపాడులో ఒకరికి  పాజిటివ్‌ సోకిందని, దీంతో మండలంలో కేసుల సంఖ్య 15కు చేరింది. వీరవాసరం మండలం కొణితివాడలో హైదరాబాద్‌లోని కుమారుడు దగ్గరికి వెళ్లి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా సోకింది. భీమవరం 2,14 వార్డుల్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఆకివీడు మాదివాడలో వృద్ధురాలికి కరోనా సోకింది. మహిళ భర్త, ఇద్దరు కుమారులు, కోడలు, మనుమరాలిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇటీవల బాత్‌రూమ్‌లో జారిపడడంతో ఈ నెల 4న హైదరాబాద్‌ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించి 15వ తేదీన తిరిగి వచ్చారు. 18న పరీక్షలు చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యుడు సద్దాం హుస్సేన్‌ తెలిపారు. కొవ్వూరు మెరకవీధిలోకి చిట్టూరివారివీధిలో మరో కేసు నమోదైంది. మధురపూడిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆర్‌డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. పాజిటివ్‌ బాధితులందరినీ ఆశ్రం ఆసుపత్రికి తరలించి ఆయా ప్రాంతాల్లో అధికారులు సూపర్‌ శానిటేషన్‌ పనులు చేపట్టారు. 


బాధితుల్లో గందరగోళం  

ఆశ్రం ఆసుపత్రిలో పాజిటివ్‌ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగు తున్న కారణంగా వారి లక్షణాలను బట్టి  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లినిక్‌కు తరలించాలని తాజాగా నిర్ణయించారు. ఇప్పటికే ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో 600 మందికి పైగానే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడున్న పడకల స్థాయి ఒకేసారి నిండిపోయే పరిస్థితులు ఉండడంతో దీనికి తగ్గట్టుగానే ముందు జాగ్రత్తగా ఆయా కేర్‌ సెంటర్లను సిద్ధం చేశారు.  ఏలూరు ఆశ్రంలో చికిత్స పొందుతున్న వంద మందిని ఇప్పటికే సీఆర్‌రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన కేర్‌ సెంటర్‌కు తరలించారు.  మరో వంద మందిని మంగళవారం భీమవరం కేర్‌సెంటర్‌కు తరలిం చేందుకు ప్రయత్నించారు. అయితే వీరిలో అత్యధికులు ఏలూరులోనే ఉండడానికి ఇష్టపడడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమను  కేర్‌ సెంటర్‌కు తరలించవద్దంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులు వారికి నచ్చచెప్పి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఏలూరు అంతటా లాక్‌డౌన్‌ ఒట్టిమాట...

 ఏలూరు నగరం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో వెలువడుతున్న సమాచారం పూర్తి అవాస్తమని, దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని వచ్చిన వార్తలన్నీ అసత్యమని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ఖండించారు. ఏలూరు నగరంలోని వార్డు నెంబర్లు 3, 4, 8, 9, 12, 14, 39, 40, 46, 48లలో కరోన పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని ఈ కారణంగానే ఈనెల 22వ తేదీ నుంచి నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు మాత్రమే జారీ చేశామని వెల్లడించారు. ఈ వార్డులు మినహా ఏలూరు నగరం పూర్తిగా లాక్‌డౌన్‌ చేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.  


కొత్త కంటైన్మెంట్‌ ప్రాంతాలివే..

జిల్లాలో నూతనంగా 13 కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రకటించారు. భీమవరం మండలం రాయలం, యలమంచిలి మండలంలో నేరుడుమిల్లి, అత్తిలి మండలం ఎస్‌వీఎస్‌ ఎస్‌ఆర్ట్స్‌ కాలేజ్‌ దగ్గర రామన్నపేట, భీమవరం అర్బన్‌ రైతు బజార్‌ వార్డు, నిడదవోలు రూరల్‌  మండలం శెట్టిపేట శివారు బోడెంపేట, సమిశ్ర గూడెం,చింతలపూడిలోని పాతబస్టాండ్‌ దగ్గర బర్మా వీధి, తాడేపల్లిగూడెం 24వ వార్డు, తాడేపల్లిగూడెం రూరల్‌ జగన్నాఽథపురం, భీమడోలు మండలం ఆగడాలలంక, భీమవరం 20వ వార్డు, ఏలూరు రూరల్‌ వెంకటాపురం పరిధిలో నెహ్రూ నగర్‌,శనివారపుపేట,ఇందిరా కాలనీల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌ ముత్యాలరాజు వెల్లడించారు. జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఉన్న బఫర్‌ జోన్‌ను తొలగించి కంటైన్మెంట్‌గా పరిమితం చేస్తున్నట్టు వెల్లడించారు. పోలవరం 7వ వార్డు, ఆకివీడు మండలం గుమ్ములూరు, తణుకులో 32, 33 వార్డుల్లో కంటైన్మెంట్‌ జోన్‌లను తొలగిస్తున్నట్టు ప్రకటించారు.


రోజుకు 300 మందిని పరీక్షించే ల్యాబ్‌ వచ్చేసింది

నేటి నుంచి ఆశ్రం ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ పనిచేయబోతోంది. సాంకేతిక విలువలతో అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. వైరస్‌ ఉధృతి జిల్లాలో ఎక్కువగా ఉండడం, దీనికి తగ్గట్టుగానే పరీక్షల్లో వేగం పెంచాలని వైరాలజీ ల్యాబ్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఒక్క ల్యాబ్‌లోనే రోజుకు మూడు వందలకు పైగా శాంపిల్స్‌ పరీక్షించేందుకు వెసులుబాటు వచ్చింది. అంటే అప్పటికప్పుడే రోగ నిర్ధారణ జరగబోతుందన్నమాట. ఈ ల్యాబ్‌కు సంబంధించి  ఐసీఎంఆర్‌ అనుమతి కూడా తాజాగా లభించింది. 


Updated Date - 2020-06-24T21:32:31+05:30 IST