కొవిడ్‌ .. మింగేస్తోంది... ఆసుపత్రుల్లో చేరినా మృత్యువాత

ABN , First Publish Date - 2020-07-04T21:16:11+05:30 IST

వైరస్‌ ఉధృతి తగ్గ లేదు. ఒకవైపు పాజిటివ్‌ కేసులు, మరో వైపు మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆసుపత్రుల్లో అనారోగ్యంతో చేరుతున్న వారిలో కొందరు రెండు మూడు రోజుల్లోనే ఆకస్మికంగా

కొవిడ్‌ .. మింగేస్తోంది... ఆసుపత్రుల్లో చేరినా మృత్యువాత

అధికారులకూ వైరస్‌..  బెంబేలెత్తిపోతున్న సిబ్బంది  

 ఏలూరులో ఒక నేత ఆకస్మిక మృతి 

 కరోనా లక్షణాలుంటేనే  పరీక్షలు : కలెక్టర్‌ 


ఏలూరు (ఆంధ్రజ్యోతి) : వైరస్‌ ఉధృతి తగ్గ లేదు. ఒకవైపు పాజిటివ్‌ కేసులు, మరో వైపు మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆసుపత్రుల్లో అనారోగ్యంతో చేరుతున్న వారిలో కొందరు రెండు మూడు రోజుల్లోనే ఆకస్మికంగా మృతి చెందడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. అంతకంటే మించి అందరిలోనూ భయాందోళనలు రేకెత్తిస్తుంది. ఇప్పటి దాకా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా ప్రజలు సాధ్యమైనంత మేర అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేసే కొందరు అధికారులకే వైరస్‌ ఆకస్మికంగా సంక్రమిస్తోంది. ఈ మధ్య కాలంలో పోలీసులు, వలంటీర్లతో సహా అనేక మందికి వైరస్‌ సోకగా ఇప్పుడు తహసీల్దార్‌, ఎంపీడీవోలు కూడా బాధితుల జాబితాలో చేరారు. వాస్తవానికి జిల్లాలో మూడు వారాల్లో వైరస్‌ తీవ్రత ఒకింత సాధారణ స్థాయి మించి పెరుగుతుందనే విషయం అధికారులు గమనించారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం, తగ్గట్టుగానే ముందస్తు చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధపడ్డారు. ఇదే తరుణంలో  ఒకవైపు పరీక్షల్లో జాప్యం తొంగిచూస్తూనే ఉంది. ప్రత్యేకించి ముందస్తుగా ఎవరైనా కరోనా పరీక్షలకు సిద్ధపడినా అధికారులు మాత్రం దీనికి అంగీకరించడమే లేదు. ఇప్పటికే సేకరించిన నమూనాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా దీనిలో జాప్యం తొంగిచూస్తూనే ఉంది. ఆఖరికి జిల్లాలో  వైరాలాజీ ల్యాబ్‌ ఆరంభించిన పరిస్థితుల్లోనే పాజిటివ్‌ కేసులు పెద్ద సంఖ్యలో ప్రతి రోజు నమోదు అవుతూనే వస్తున్నాయి. ఇప్పటిదాకా ఏలూరు నగరంలోనే కేసుల తీవ్రత అత్యధికంగా నమోదు అవుతూ వచ్చింది. ఒక వైపు కట్టడి చేస్తున్నా మరో వైపు కేసులు దూసుకువస్తూనే ఉన్నాయి.  కారణాలను అన్వేషించి తగ్గట్టుగానే కట్టడికి వ్యూహం సిద్ధం చేస్తుండగానే దీనికి సమాంతరంగా ఇప్పుడు మరణాల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతూ పోయాయి. 


తాజాగా  శుక్రవారం ఒక్క ఏలూరు నగరంలోనే గన్‌బజార్‌, నూతివారివీధి, శనివారపు పేట అంబేడ్కర్‌ విగ్రహం ప్రాంతంలో ఒక్కొక్క కేసు బయటపడింది. అలంపురం, పెదగరువు, నిడదవోలు, దెందులూరు, వట్లూరు, ఉంగుటూరు, దుంపగడపలో ఒకొక్కటి చొప్పున, తాడేపల్లిగూడెంలో సుబ్బారావుపేట పీఅండ్‌టీ కాలనీ, సంజీవనగర్‌, కొత్తపాడు, సామవేద వారి వీధిలో మొత్తం ఏడు, జిన్నూరులో రెండు చొప్పున 19 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.   కాగా జిల్లా మొత్తం మీద ఇప్పటి వరకు 1647 కేసులు నమోదయ్యాయి. ఈరోజు ల్యాబ్‌లకు సెలవు కాబట్టి పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒకింత తక్కువగానే కన్పించినా కానీ సాధారణ స్థాయి కంటే ప్రమాద భరితంగానే కేసుల వరుస కొనసాగుతున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులకే పాజిటివ్‌ వర్తించడం మరింత ఆందోళన కల్గిస్తున్న అంశం. ఇదే క్రమంలో వైరస్‌ ఉధృతిగా ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ వరుస పరీక్షలు కూడా పెద్దగా సాహసించడం లేదు. లక్షణాలు ఉంటే తప్ప పరీక్షల నిర్వహణకు అంత అగత్యం ఉండకపోవచ్చునని అధికారులు వాదిస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం ఎక్కడికక్కడ తమకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ సిద్ధపడుతున్నారు.


పెరుగుతున్న మరణాలు 

ఒకవైపు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కల్గిస్తుంటే అంతకంటే మించిన వేగంతోనే మరణాల సంఖ్య నమోదు అవుతుంది. ఏలూరు నగరంలో కీలకంగా వ్యవహరించే ఒక నేత ఆకస్మికంగా మరణించగా ఆ తరువాత ఆయనకు పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలింది. మరోవైపు నర్సాపురంకు చెందిన ఒకరు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేరగా అక్కడ ఆయన పాజిటివ్‌ లక్షణాలతో మృతి చెందారు. ఇదే తరుణంలో ఆచంట మండలం పెదమదం, గణపవరంకు చెందిన ఇద్దరు అనారోగ్యంతో మరణించగా, వీరిద్దరికీ పాజిటివ్‌గానే ఆ తరువాత తేల్చారు. అలాగే తాజాగా మరో మండలంలో ఎనిమిది సంవత్సరాల బాలిక మృతి అందరినీ కలవరపెడుతోంది.  


భయపడకండి : కలెక్టర్‌ 

ఏలూరు పరిసర  ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ఉన్నందున ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వీరంతా ఒకేసారి పరీక్షలకు సమాయత్తమవుతున్నట్లు గుర్తించామని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు వెల్లడించారు. అనుమానంతో ఏ ఒక్కరూ కంగారు పడక్కరలేదని కేవలం లక్షణాలు కలిగిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా తంగెళ్ళమూడిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టైటస్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లంబాడీ పేట పట్టణ ఆరోగ్య కేంద్రం, జేపీ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం, ఆముదాల అప్పలస్వామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ తరహా పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 


గర్భిణికి కరోనా 

పెదవేగి మండలం ముండూరులో  ఒక గర్భవతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకుంటోంది. రెండు రోజుల కిందట అనుమానంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను గురువారం రాత్రి ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. 


ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్‌

 కాళ్ళ మండల పరిషత్‌ కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయంలో ఒక అధికారికి పాజిటివ్‌ రావడంతో సదరు అధికారితో సెకండరీ కాంటాక్టు కలిగిన 18 మందికి పరీక్షలు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో శుక్రవారం భీమవరం క్వారంటైన్‌కు తరలించారు. 


పరీక్షలు చేయకపోవడంపై గ్రామస్థుల ఆగ్రహం..

మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగికి పాజిటివ్‌ రావడంతో సెకండరీ కాంటాక్టు కలిగిన వారికి పరీక్షలు నిర్వహించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళ్ళ పీహెచ్‌సీ వైద్యాధికారి పి.రమామహేశ్వరిని వివరణ కోరగా సెకండరీ కాంటాక్టు కలిగిన 20 మందిని గుర్తించామని, పరీక్షలు నిర్వహించేందుకు కిట్లు లేవని తెలిపారు. 20 మందిలో కరోనా లక్షణాలు ఉన్న నలుగురిని ప్రాథమికంగా గుర్తించామన్నారు.


నిడదవోలులో..

నిడదవోలు తహసీల్దార్‌ కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు శుక్రవారం వైద్యులు ధ్రువీకరించడంతో పట్టణ, మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. తహసీల్దార్‌ కార్యాల యంలో సూపర్‌ శానిటేషన్‌ చేయించి చుట్టుప్రక్కల ఉన్న దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వేశారు. 

Updated Date - 2020-07-04T21:16:11+05:30 IST