విశాఖ జిల్లాలో 20 వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-11T14:35:43+05:30 IST

జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సోమవారం మరో 620 మందికి పాజిటివ్..

విశాఖ జిల్లాలో 20 వేలు దాటిన కరోనా కేసులు

మరో 620

కోలుకుని 13,333 మంది డిశ్చార్జి

వివిధ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 7,055 మంది

24 గంటల్లో ఐదుగురి మృతి

137కు చేరిన కొవిడ్ మరణాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సోమవారం మరో 620 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 20,525కు చేరింది. ఇందులో 13,333 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 7,055 మంది వివిధ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇక వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 132కు చేరింది.


జీవీఎంసీ జోన్‌ 1 పరిధిలో 95!

జీవీఎంసీ జోన్‌-1 పరిధిలో కొవిడ్‌ వైరస్‌ విలయతాండవం చేస్తోంది. సోమవారం 349 మందికి పరీక్షలు నిర్వహించగా 95 మందికి పాజిటివ్‌ వచ్చింది. రెండో వార్డుకు చెందిన 173 మందికి పరీక్షలు చేయగా 42 మంది, నాలుగో వార్డులో 117 మందికి టెస్టులు చేయగా 39 మంది, ఆరో వార్డుకు చెందిన 59 మందికి టెస్టులు నిర్వహించగా 14 మంది వైరస్‌ బారినపడ్డారు.

  

ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో 173 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్‌ వచ్చింది.  

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 61 మందికి పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌ వచ్చింది.  

మాధవధారలో 12 కేసులు నమోదయ్యాయి. తెన్నేటినగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురు, కళింగ నగర్‌లో ముగ్గురు, విద్యానగర్‌లో ఇద్దరు, లాన్సమ్‌ గ్రీన్స్‌, సీతన్న గార్డెన్స్‌లో ఒక్కొక్కరు కొవిడ్‌ బారినపడ్డారు.

గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్థానిక టైలర్స్‌ కాలనీలో ఒకరు, బాపూజీనగర్‌లో ఒకరు, నరసింహనగర్‌లో ఒకరు, అజంతాపార్క్‌లో ముగ్గురు, ఇందిరానగర్‌లో ఇద్దరు, లక్ష్మీనగర్‌లో ముగ్గురు వైరస్‌ బారినపడ్డారు. 

సాగర్‌నగర్‌ ఆరోగ్య కేంద్రం వద్ద 59 మందికి టెస్టులు నిర్వహించగా 14 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 12 మంది పెదరుషికొండ, చిన్నరుషికొండ ప్రాంతాలకు చెందినవారు కాగా ఇద్దరు సాగర్‌నగర్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు.

దువ్వాడ పోలీస్‌ స్టేషన్లో ఆరుగురికి..: దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఆరుగురికి వైరస్‌ సోకింది. 61 మంది సిబ్బందిలో ఇప్పటికే యాభై ఏళ్లు దాటిన ఎనిమిది మంది హౌస్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆరుగురు కరోనా బారినపడ్డారు. 

పరవాడ మండలంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించారు. పరవాడలో మహిళ (52), పురుషుడు (54), రావాడలో ఇద్దరు పురుషులు (37), (36), దీపాంజలినగర్‌లో పురుషుడు (50) వైరస్‌ బారిన పడ్డారు.

సబ్బవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించారు. దీంతో సోమవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.


నర్సీపట్నంలో 16 కరోనా కేసులు

నర్సీపట్నం మునిసిపాలిటీలో సోమవారం 16 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కోమటివీధిలో ఇద్దరు పురుషులు, వృద్ధురాలు, వెంకునాయుడుపేటలో పురుషుడు, మహిళ, బీసీ కాలనీలో వృద్ధురాలు, బాలిక, యువకుడు వైరస్‌ బారినప డ్డారు. శివపురంలో ముగ్గురు మహిళలు, కాపువీధిలో వృద్ధుడు, పెదబొడ్డేపల్లిలో మహిళ, పట్టణ పోలీస్‌ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌లకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో మునిసిపాలిటీలో ఇప్పటి వరకు కరోనా సోకినవారి సంఖ్య 173కు చేరింది.


సీలేరులో 18 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన 80 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్‌ వచ్చింది 

కొయ్యూరు మండలంలో పది కేసులు నమోదయినట్టు ఇన్‌చార్జి ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. శరభన్నపాలెంలో ఐదుగురు, ఇద్దరు 108 సిబ్బంది, రాజేంద్రపాలెం, కేడీపేట పీహెచ్‌సీ పరిధిలోని గొల్లవీధి, సీహెచ్‌ నాగాపురం గ్రామాల్లో ఒక్కొక్కరు వైరస్‌ బారినపడ్డారన్నారు. 

పాయకరావుపేట పీహెచ్‌సీ పరిధిలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి శిరీష తెలిపారు. పట్టణంలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని ఆమె తెలిపారు. అలాగే మండలంలోని శ్రీరాంపురంలో గర్భిణికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి కె.మధుబాబు తెలిపారు.

జి.మాడుగులలో ఐదు కేసులు నిర్ధారణ అయ్యాయి.  

కశింకోట మండలం తాళ్లపాలెం పీహెచ్‌సీ పరిధిలో నలుగురికి కరోనా సోకింది. చింతలపాలెంలో గర్భిణి, తాళ్లపాలెంలో గర్భిణి, సుందరయ్యపేటలో పురుషుడు, బంగారయ్యపేటలో పురుషుడు (58) వైరస్‌ బారినపడ్డారు.

చింతపల్లి రామాలయం వీధిలో మరో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ వీధిలో 85 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక బాలిక, భార్యాభర్తలకు పాజిటివ్‌ వచ్చినట్టు ఆర్‌వీనగర్‌ వైద్యాధికారి గాయత్రి తెలిపారు. 

ఎలమంచిలి పట్టణంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు మునిసిపల్‌ ప్రజారోగ్యశాఖాధికారి చిట్టిబాబు తెలిపారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఒకరికి, కాకివాని వీధిలో మహిళకు, సోమలింగపాలెంలో యువతికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారు.

అచ్యుతాపురం మండలంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారిణి ఆడారి కనకమహాలక్ష్మి తెలిపారు. పూడిమడక రోడ్డులోని ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్న ప్రైవేటు కంపెనీ ఉద్యోగికి, పూడిమడకలో గర్భిణికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. 

రాంబిల్లిలో మహిళకి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారిణి జి.అమృతసాయి తెలిపారు.

అనకాపల్లిలో సోమవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 48 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ జరిగింది. దీంతో పట్టణంలో కేసుల సంఖ్య 822కు చేరింది. గవరపాలెంలో వృద్ధురాలు (61), ముగ్గురు పురుషులు, పిళ్లావారి వీధిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, శ్రీరామ్‌నగర్‌లో మహిళ (49), ముగ్గురు పురుషులు, నర్సింగరావుపేటలో మహిళ (34), పురుషుడు (45) కరోనా బారినపడ్డారు. అలాగే ఏఎంసీ కాలనీలో ఇద్దరు మహిళలు (22, 44), రామాలయం వీధిలో వృద్ధుడు (63), పప్పులవీధిలో ఇద్దరు పురుషులు, పూడిమడక రోడ్డులో ఐదుగురు పురుషులు, గాంధీనగరంలో వృద్ధుడు (78), న్యూకాలనీలో ఇద్దరు పురుషులు, పరశురామునిపేటలో యువకుడు, గోపాలకృష్ణ థియేటర్‌ వద్ద ఇద్దరు మహిళలకు వైరస్‌ సోకింది. అదేవిధంగా, తగరపూడిలో యువతి (20), యువకుడు (22), భీమునిగుమ్మంలో వృద్ధురాలు (65), డైమండ్‌ కాన్వెంట్‌ వీధిలో మహిళ (38), యువకుడు (18), రైతు సంఘం వీధిలో బాలుడు (15), ముత్రాసువీధిలో పురుషుడు, తుమ్మపాలలో పురుషుడు, కోట్ని వీధిలో ఇద్దరు పురుషులు, మిరియాలకాలనీ ముగ్గురు పురుషులు, కొత్తూరులో ఇద్దరు పురుషులు, మళ్లవీధిలో  ఇద్దరు పురుషులు, గొల్లవీధిలో ఒకరికి కరోనా సోకింది. 


ఐదుగురు మృతి.. 

జిల్లాలో కరోనా వైరస్‌ బారినపడి మరో మృతిచెందారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 137కు చేరింది. సోమవారం చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-08-11T14:35:43+05:30 IST