తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 75 మందికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-03T15:09:12+05:30 IST

రాష్ట్రంలో గురువారం మరో 75 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 75 మందికి పాజిటివ్

  • అందరూ ఢిల్లీ మహానాడుకు వెళ్లినవారే
  • 309కి పెరిగిన పాజిటివ్‌ కేసులు

చెన్నై: రాష్ట్రంలో గురువారం మరో 75 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీరందరూ (ఒక్కరు మినహా) ఢిల్లీ నిజాముద్దీన్‌ మహానాడులో పాల్గొన్నవారేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ తెలిపారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 309 చేరుకుంది. వీరిలో 264 మందికి ఢిల్లీతో లింక్‌ ఉంది. గత మూడు రోజుల్లో వరుసగా 57, 110, 75 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో దేశంలో అధిక బాధితులున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో కేరళ ఉన్నాయి. 


రాష్ట్రంలో కరోనా కేసుల గురించి ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ గురువారం సాయంత్రం మీడియాకు తెలియజేస్తూ, తమిళనాడులో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు 309కి పెరిగాయని, గురువారం ఒక్కరోజే 75 కొత్త కేసులు బయటపడ్డాయని చెప్పారు. ఢిల్లీ మహానాడులో పాల్గొన్న 1,103 మంది నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో హోం క్వారంటైన్‌లో 86,342 మంది, ప్రభుత్వ నిఘాలో 90 మంది ఉన్నారని, అలాగే 4070 మంది 28 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకుని గృహాలకు వెళ్లారని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రంలో మరో ఆరు కరోనా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు బీలా రాజేష్‌ చెప్పారు.

Updated Date - 2020-04-03T15:09:12+05:30 IST