అంతా అయో‘మాయం’! కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితుల అదృశ్యం

ABN , First Publish Date - 2020-08-15T22:10:33+05:30 IST

కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్న వారు కోలుకోవడం..

అంతా అయో‘మాయం’! కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితుల అదృశ్యం

పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

వైద్యవర్గాల్లో హైరానా


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్న వారు కోలుకోవడం సంగతి అటుంచితే... అసలు మనుషులే మాయమవుతున్నారు. బాధితుల క్షేమ సమాచారం అందుతుందని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటే...‘అసలు వారెక్కడ ఉన్నారో ఆచూకీ తెలియద’ంటూ ఆస్పత్రి వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. దీంతో విస్తుపోవడం కుటుంబాల వంతవుతోంది. పోనీ బాధితులు ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రుల్లో చేరుతున్నారా అంటే అదీకాదు. మండల స్థాయి అధికారులు...వైద్య సిబ్బంది స్వయంగా ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారు. ఇలా చికిత్స కోసం వెళుతున్నవారు మాయమవుతుండడంతో కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోతోంది. ఆస్పత్రుల్లో చేరడానికి బాధితులు వెనుకంజ వేస్తున్నారు. 


కొవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులపై నిర్లక్ష్యం వీడడం లేదు. ఓ వైపు సరైన వైద్యం అందక కరోనా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి ఆచూకీ కూడా తెలియడం లేదు. ఆస్పత్రులకు ఎంత మంది వస్తున్నారు. ఎంతమంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఎందరు మృత్యుఒడికి చేరుతున్నారో సక్రమంగా తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల హిరమండలానికి చెందిన ఒక బాధితుడు.. కొవిడ్‌ ఆస్పత్రిలో తనకు వైద్యం సక్రమంగా అందడం లేదని, ఆక్సిజన్‌ పెట్టే నాథుడే లేడని ఆవేదన చెందాడు. తన ఆవేదనను వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల ద్వారా అధికారులకు మొరపెట్టుకున్నారు. దీనిపై కలెక్టర్‌ నివాస్‌ స్వయంగా స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఒక్కరే కాదు.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌), జెమ్స్‌లో చాలా మంది బాధితులు తమకు సరైన వైద్యం అందడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.


తాజాగా జెమ్స్‌లో ఆస్పత్రి సిబ్బంది మరో నిర్లక్ష్యానికి ఒడిగట్టారు. పొందూరు మండలం మున్సీపేటకు చెందిన గరుగుబిల్లి ఈశ్వరరావు (58) కరోనా లక్షణాలతో బాధపడుతూ.. గత నెల 28న ఆస్పత్రిలో చేరారు. పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అధికారులే ఆయనను అంబులెన్స్‌లో జెమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల 31 నుంచి ఈశ్వరరావుకు ఫోన్‌ చేసినా.. సమాధానం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షేమ సమాచారంపై ఆస్పత్రి సిబ్బందిని అడిగినా.. సరైన సమాధానం దొరకడం లేదని వాపోతున్నారు. తీవ్ర లక్షణాలున్న బాధితుల జాబితాలో ఆయన పేరు లేదని, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని కొన్ని రోజులు సమాధానం చెప్పుకొచ్చారు. గత 15 రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఎక్కడున్నారో తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అతను బతికే ఉన్నాడా? లేదా? అన్న విషయం కూడా అసుపత్రి అధికారులు, సిబ్బంది చెప్పలేకపోతున్నారు. చివరకు చేసేది లేక కుటుంబ సభ్యులు తమ తండ్రి ఆచూకీ తెలియజేయాలంటూ పొందూరు పోలీసులను ఆశ్రయించారు. 


- రాజాం గాయత్రి కాలనీకి చెందిన శ్రీనివాసనాయుడుకు ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని, మెరుగైన వైద్యం నిమిత్తం జూలై 16న జెమ్స్‌లో చేర్పించామని ఆమె భార్య రాజరాజేశ్వరి తెలిపారు. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ తెలియడం లేదని, ఆస్పత్రివర్గాలు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కూడా ఈ విషయమై శుక్రవారం పెదపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త ఆచూకీ కనుగొని అప్పగించాలంటూ వేడుకున్నారు. ఇలా బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో ఆసుపత్రి వర్గాలు హైరానా పడుతున్నారు. 


వరుస సంఘటనలు జరుగుతున్నా...

కొవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.  రోగులను పట్టించుకోవడం లేదని, ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తే, రాత్రిపూట ఎవరూ స్పందిచడం లేదని పలువురు అధికారులకు ఫిర్యాదులు చేశారు. పాత్రునివలస కేర్‌ సెంటర్‌లో బాధితులు తమ ఇబ్బందులను స్వయంగా కలెక్టర్‌కు చెప్పుకొనేందుకు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఇక పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేసినా, కొవిడ్‌ ఆస్పత్రుల సిబ్బందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇటీవల కలెక్టర్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిబ్బంది కొరత సాకుగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-08-15T22:10:33+05:30 IST